India Today Poster War
నోటెడ్ న్యూస్ మేగజైన్ ‘ఇండియా టుడే’ కవర్ పేజీ కారణంగా టాలీవుడ్ టాప్ స్టార్స్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అభిమానుల మధ్య పోస్టర్ వార్ రాజేసింది. ‘ఇండియా టుడే’ తాజా సంచికపై అల్లు అర్జున్ బొమ్మ కనిపించింది. లోపల ‘ఐకాన్ స్టార్’తో ముచ్చట్లు ఉన్నాయి. అలాగే బన్నీ నటించిన ‘పుష్ప- ద రైజ్’ సినిమా వసూళ్ళనూ పేర్కొన్నారు. గత సంవత్సరం బ్లాక్ బస్టర్ గా ‘పుష్ప’ను నిలిపారు. ఇందులో విశేషమేమీలేదు. కానీ, ఐదేళ్ళ క్రితం ప్రభాస్ ‘బాహుబలి-2’ విడుదలయ్యాక ఇదే ‘ఇండియా టుడే’ కవర్ పై ప్రభాస్ బొమ్మ కనిపించింది. 2017లో ప్రభాస్ కవర్ పేజీ వేసినప్పుడు ‘ఎపిక్ బ్లాక్ బస్టర్’ అని పేర్కొనగా, ఇప్పుడు అల్లు అర్జున్ కవర్ తో వచ్చిన సంచికపై ‘ద సౌత్ స్వాగ్’ అని రాశారు. నిజానికి ఇది బన్నీ ఒక్కడి కవర్ స్టోరీ కాదు. సౌత్ ఇండియా సినిమా ఎలా డామినేట్ చేస్తోందో వివరించే కథ. అంతకు ముందు కేవలం ‘బాహుబలి-2’ ఘనవిజయానికి సంబంధించిన కథనే కవర్ స్టోరీగా రాశారు. ఈ తేడాతోనే ప్రభాస్, బన్నీ ఫ్యాన్స్ మధ్య సోషల్ మీడియాలో వార్ నడుస్తోందేమో!
‘ఇండియా టుడే’ కవర్ పేజీ రాజేసిన అభిమానుల మధ్య గొడవను అదే సంస్థకు చెందిన న్యూస్ ఛానెల్ స్పెషల్ స్టోరీగా ఓ అరగంట పాటు ప్రసారం చేయడం గమనార్హం! ఈ కార్యక్రమంలో ‘ఇండియా టుడే’కు చెందిన ఇండియా టుడే ఎంటర్ టైన్ మెంట్ బ్యూరో దీపాలీ పటేల్, ఇండియా టుడే డిప్యూటీ ఎడిటర్ సుహానీ సింగ్, స్పెషల్ కరస్పాండెంట్ నబిలా జమాల్, ప్రముఖ నటి కస్తూరి, ఇండియా టుడే ఛీఫ్ ఫోటోగ్రాఫర్ అక్షిత నందగోపాల్ పాల్గొన్నారు.
“ఇలా అభిమానుల మధ్య మాటల యుద్ధం జరగడం అన్నది దక్షిణాదిన సర్వ సాధారణం. అయితే ఫ్యాన్స్ వార్స్ ఎలా సాగినా, స్టార్ హీరోస్ మధ్య సత్సంబంధాలు ఉంటాయి. ప్రభాస్, అల్లు అర్జున్ మధ్య సైతం అలాంటి అనుబంధమే ఉంది” అని దీపాలీ పటేల్ చెప్పారు. “డిసెంబర్ లో విడుదలైన ‘పుష్ప’ గురించి ఇంకా మాట్లాడుకోవడానికి ఆ సినిమాకు సీక్వెల్ రాబోతోంది. అలాగే ఈ యేడాది బ్లాక్ బస్టర్స్ రాజమౌళి ‘ట్రిపుల్ ఆర్’, యశ్ ‘కేజీఎఫ్-2’ తో పాటు ‘పుష్ప’ను కూడా గుర్తు చేసుకుంటున్నారు జనం” అని సుహానీ సింగ్ అన్నారు. ఈ సౌత్ సినిమాల వసూళ్ళ సునామీ చూసి బాలీవుడ్ కంగారు పడుతోందని ఆమె చెప్పారు.
అల్లు అర్జున్ కవర్ పేజీ గొప్పగా ఉందని ఆయన ఫ్యాన్స్ పేర్కొనగా, దానిని మించినది ప్రభాస్ కవర్ పేజీ అని యంగ్ రెబల్ స్టార్ అభిమానులు అంటున్నారు. ఇలా ప్రభాస్, బన్నీ అభిమానుల మధ్య పోస్టర్ వార్ సాగుతోందని నబిలా వివరించారు. ఈ వార్ అదే పనిగా ఏర్పాటు చేసినది కాదని, అభిమానుల మధ్య పోటాపోటీగా సాగుతోందని యాంకర్ అన్నారు. ఇద్దరు బిగ్ సూపర్ స్టార్స్ నడుమ ఇంత పోటీ ఉంటుందా అని యాంకర్ ఆశ్చర్య పోతున్నారు. ప్రముఖ నటి కస్తూరి ఈ ప్రోగ్రామ్ లో ఫోన్ ద్వారా పాల్గొన్నారు. ఇంతవరకు మనం బాలీవుడ్ స్టార్స్ ఖాన్స్, రోషన్స్ గురించి మాట్లాడుకున్నామని, ఇప్పుడు ప్రభాస్, యశ్, అర్జున్ లాంటి సౌత్ సూపర్ స్టార్స్ గురించి కూడా దేశవ్యాప్తంగా చర్చించుకొనే రోజులు వచ్చాయని కస్తూరి అన్నారు. ఈ మార్పు ఆహ్వానించదగ్గదే అని ఆమె చెప్పారు. ఈ సంచిక కోసం అల్లు అర్జున్ ఫోటోలు తీసిన అక్షిత నందగోపాల్ సైతం ఈ కార్యక్రమంలో పాల్గొని తన అనుభవాలు తెలిపారు.
నిజమే, ఇలాంటి ఫ్యాన్ వార్స్ ఉత్తరాది వారికి కొత్తేమో కానీ, దక్షిణాది వారికి కాదు. ఇండియా టుడే కవర్ పై మన టాలీవుడ్ సూపర్ స్టార్స్ బొమ్మలు రావడం కొత్తేమీ కాదు. ఇప్పటికంటే ఒకప్పుడు ‘ఇండియా టుడే’ సర్క్యులేషన్ లక్షల్లో ఉండేది. అప్పట్లోనే యన్టీఆర్, చిరంజీవి వంటి వారి కవర్ పేజీ స్టోరీస్ ప్రచురితమయ్యాయి. అప్పట్లో ఇండియాలోనే అత్యధిక పారితోషికం తీసుకొనే నటునిగా మెగాస్టార్ నిలిచారు. దాంతో “బిగ్గర్ దేన్ బచ్చన్” అనే టైటిల్ తో చిరంజీవి కవర్ పేజీ, ఆయనపై ప్రత్యేక కథనం ప్రచురితమయ్యాయి. నిజానికి ఇప్పుడు బన్నీపై ప్రత్యేకంగా ప్రచురించిన సంచికేమీ కాదు ఇది. అయినా ప్రభాస్ ఫ్యాన్స్ ఐదేళ్ళ క్రితం కవర్ పేజీగా వచ్చిన తమ హీరో బొమ్మను చూపిస్తూ వార్ సాగించడమే విడ్డూరం! అంతేనా, అదే పనిగా ఇండియా టుడే ఈ కహానీ వినిపించడానికి కారణం ఏమైనా ఉందా? అన్న అనుమానాలూ కొందరు వ్యక్తం చేస్తున్నారు.