తెలుగునాటనే తన కెరీర్ కు వెలుగుబాటలు వేసుకుంది కాజల్ అగర్వాల్. ‘క్యూ హో గయా నా’ చిత్రంలో తొలిసారి వెండితెరపై తళుక్కుమంది కాజల్. అందులో అందాలతార ఐశ్వర్యారాయ్ చెల్లెలిగా కనిపించిన కాజల్ ను దర్శకుడు తేజ తన ‘లక్ష్మీ కళ్యాణం’తో తెలుగు చిత్రసీమకు పరిచయం చేశాడు. తరువాత కృష్ణవంశీ ‘చందమామ’లా కాజల్ ను తీర్చిదిద్దాడు. ఇక రాజమౌళి తన ‘మగధీర’లో మిత్రవిందగా కాజల్ ను మార్చేశాడు. అప్పటి నుంచీ ఇప్పటి దాకా కాజల్ తెలుగు చిత్రాలలో మెరుస్తూనే ఉంది. తనదైన అందాల అభినయంతో ఆకట్టుకుంటూ సాగుతోంది. ‘మగధీర’లో రామ్ చరణ్ సరసన మురిపించిన కాజల్, ‘ఖైదీ నంబర్ 150’లో చిరంజీవితోనూ కలసి చిందేసి ఆకట్టుకుంది. ఇప్పుడు కూడా కొరటాల శివ తాజా చిత్రం ‘ఆచార్య’లో చిరంజీవి సరసన నటిస్తోంది కాజల్.
పోయిన చోటనే వెదుక్కోవాలని పెద్దలు చెబుతారు. కాజల్ మనసు సినిమాలపై పారేసుకుంది. అందుకే ఇదే చిత్రసీమలో తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని తపించింది. ఆరంభంలో ఆట్టే విజయాలు పలకరించక పోయినా, ‘మగధీర’ అఖండ విజయం తరువాత కాజల్ రేంజ్ మారిపోయింది. టాలీవుడ్ టాప్ స్టార్స్ జూ.యన్టీఆర్, మహేశ్, ప్రభాస్, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, రవితేజ, రానా తదితరుల సరసన నటించింది. తమిళనాట కూడా కాజల్ హవా విశేషంగా వీచింది. ‘జనతా గ్యారేజ్’లో “పక్కా లోకల్…” అంటూ ఐటమ్ సాంగ్ లోనూ మురిపించింది. తన తొలి చిత్ర దర్శకుడు తేజ రూపొందించిన ‘నేనే రాజు-నేనే మంత్రి’లో రానా సరసన నటించి ఎంతగానో అలరించింది. గత సంవత్సరం అక్టోబర్ 6న గౌతమ్ కిచ్లూను పెళ్ళాడింది కాజల్.
పెళ్ళయ్యాక కూడా కాజల్ కు ఏ మాత్రం క్రేజ్ తగ్గలేదు. ప్రస్తుతం దాదాపు ఏడు చిత్రాలలో నటిస్తోంది కాజల్. అందులో రెండు తెలుగు చిత్రాలున్నాయి. వాటిలో చిరంజీవి ‘ఆచార్య’ జనం ముందుకు రావడానికి సిద్ధమైంది. మరోటి ప్రవీణ్ సత్తారు రూపొందిస్తోన్న చిత్రం. కాగా, ఐదు తమిళ చిత్రాలలో కాజల్ నటిస్తోంది. ‘చక్రవ్యూహ’ అనే కన్నడ చిత్రంలో “ఏనాయితూ…” అంటూ గళం విప్పిన కాజల్ తనలోని గాయనిని కూడా బయటకు తెచ్చింది. పలు బ్రాండ్స్ కు అంబాసిడర్ గా ఉన్న కాజల్, శంకర్ ‘ఇండియన్ -2’లో కమల్ హాసన్ సరసన నటిస్తోంది. మునుముందు కాజల్ ఇంకా ఎన్ని చిత్రాలలో ‘సిత్రాలు’ చేస్తుందో చూడాలి.