Govinda Rajula Subbarao వాచకాభినయం ఎలా ఉండాలి? అన్న ప్రశ్నకు పాత్రోచితంగా సాగాలని పలువురు సమాధానం చెబుతారు. కానీ, పాత్రధారి శరీరాకృతిని బట్టి పాత్రకు తగ్గ వాచకం పలికించాలని కొందరు శాస్త్రీకరించారు. ఈ రెండో కోవకు చెందిన వారితో ఏకీభవిస్తారు మహానటుడు డాక్టర్ గోవింద రాజుల సుబ్బారావు. ఆయన పర్సనాలిటీ భారీగా కనిపించదు, అలాగని మరీ పొట్టివారూ కాదు. ఇక ఆయన గళంలో గన్నుల మోతకు దీటుగా పదాలు వల్లించే పటుత్వమూ లేదు. అయినా, తాను ధరించే పాత్రకు తగ్గ సంభాషణలను తన శరీరాకృతికి అనువుగా గోవిందరాజుల సుబ్బారావు వల్లించిన తీరు సదరు పాత్రలకే వన్నె తెచ్చింది. సారథీవారి ‘మాలపిల్ల’లో “దేవలం మా పూర్వికులు కట్టించింది… నేను ధర్మకర్తను… అందులో హరిజనులకు ప్రవేశం కల్పిస్తున్నాను… ఆ హక్కు నాకుంది…” అంటూ సుందర రామశాస్త్రిగా సుబ్బారావు కనబరచిన నటన ఇప్పుడు చూసినా ఆకట్టుకుంటుంది. ‘పల్నాటి యుద్ధం’లో బ్రహ్మనాయుడుగా బాలచంద్రుడు మరణించిన సమయంలో “నాన్నా నీవెప్పుడూ ఇంతే…” అంటూ సుబ్బారావు పలికిన తీరు హృదయాలను ద్రవింప చేయక మానదు. “సంగూ… అద్భుతంగా ఉంది నీ నాట్యం… రా నా రాణీ…” అంటూ జెమినీ వారి ‘బాలనాగమ్మ’లో సుబ్బారావు వల్లించిన సంభాషణల్లోని పట్టుకన్నా, ఆయన నటనలోని కనికట్టు మనల్ని కట్టిపడేస్తుంది. “సుబ్బులూ వచ్చావటే… నీకు ఈ చెంగయ్య మావ ఇంకా జ్ఞాపకం ఉన్నాడటే…” అంటూ విజయవారి ‘షావుకారు’లో లోభి చెంగయ్యగా సుబ్బారావు కనబరచిన అభినయాన్ని ఎవరు మరచిపోగలరు? వినోదావారి ‘కన్యాశుల్కం’లో రామప్పపంతులు ఉత్తరం చదివే సమయంలో లుబ్ధావధానులుగా సుబ్బారావు నటన ఒక్కసారి పరిచయమయితే చాలు చక్కిలిగింతలు పెట్టకమానదు. ఇలా చెప్పుకుంటూ పోతే గోవిందరాజుల సుబ్బారావు తెరపై కనిపించిన ప్రతి పాత్రలోనూ తనదైన వాచకాభినయంతో అలరించారనే చెప్పాలి.
గోవిందరాజుల సుబ్బారావు 1895లో జన్మించారు. ఆయనకు చదువన్నా, విషయపరిజ్ఙానం పెంచుకోవడమన్నా, ఎక్కడ విజ్ఙానం ఉన్నా అక్కడకు పరుగు తీయడమన్నా మహా ఇష్టం! హిస్టరీ చదువుతూ, దానికి స్వస్తి చెప్పి ఎల్.ఎమ్.పి. పరీక్ష పాసై తెనాలిలో కొంతకాలం డాక్టర్ గా ప్రాక్టీసు చేశారు. తరువాత హోమియో వైద్యం కూడా అభ్యసించారు. ఆయన హస్తవాసి మంచిదనే పేరు సంపాదించారు. తెనాలి చుట్టుపక్కల ఊళ్ళవారందరికీ వైద్యం చేశారు సుబ్బారావు. డాక్టర్ గా ఎంతో పేరు సంపాదించిన గోవింద రాజుల సుబ్బారావుకు ‘అణు విజ్ఞానం’ (Atomic Science)పై ఆసక్తి పెంచుకొని, దానిని చదివి ఆ రోజుల్లో విఖ్యాత శాస్త్రవేత్త ఆల్బర్ట్ ఐన్ స్టీన్ తో ఉత్తర ప్రత్యుత్తరాలు జరిపారు. ఇన్ని కొనసాగిస్తూనే కళల పట్ల ఎంతో అభిలాషతో చిత్రలేఖనం, సంగీతం, నటనపై ఆసక్తిని పెంచుకున్నారు సుబ్బారావు. తన బహుముఖ ప్రజ్ఞను ప్రదర్శిస్తూ సాగారాయన. తెనాలిలోని రామవిలాస సభ వారి నాటకాల్లో నటించి ఆకట్టుకున్నారు సుబ్బారావు. ‘ప్రతాపరుద్రీయం’లో గోవిందరాజుల వారు పోషించిన పిచ్చివాడి పాత్ర ఖ్యాతి నార్జించింది. ఆ రోజుల్లో తెలుగునేలపై పలు ప్రాంతాల్లో ఆ నాటకాన్ని ప్రదర్శించేవారు. పిచ్చివాడిగా సుబ్బారావు నటనకు జనం జేజేలు పలికేవారు. ఆయనలోని నటునికి ప్రఖ్యాత దర్శకనిర్మాత గూడవల్లి రామబ్రహ్మం కూడా అభిమానిగా మారారు. తన ‘మాలపిల్ల’ చిత్రంలో సుందరరామశాస్త్రి పాత్రలో నటింప చేశారు గూడవల్లి. ఆ సినిమాతో గోవిందరాజుల సుబ్బారావు పేరు మరింతగా ప్రసిద్ధమయింది.
“గృహలక్ష్మి, బాలనాగమ్మ, రత్నమాల, పల్నాటియుద్ధం, గుణసుందరి కథ, ధర్మాంగద, షావుకారు, కన్యాశుల్కం, చరణదాసి, పాండురంగ మహాత్మ్యం, భాగ్యరేఖ, సమ్రాట్ విక్రమార్క” వంటి చిత్రాలలో తనదైన అభినయంతో జనాన్ని ఆకట్టుకున్నారు గోవిందరాజుల సుబ్బారావు. మదరాసులో తన స్వగృహంలో 1958 అక్టోబర్ 28న ఆయన తుదిశ్వాస విడిచారు. ఇప్పటికీ ఆయన నటించిన చిత్రాలు కొన్ని బుల్లితెరపై ప్రత్యక్షమవుతూనే ఉన్నాయి. వాటిలో సుబ్బారావు ప్రత్యేకమైన వాచకాన్ని చూసి, ‘ఎవరీయన?’ అంటూ నవతరం ప్రేక్షకులు అడుగుతూ ఉంటారు. తరాలు మారినా, గోవిందరాజుల సుబ్బారావు అభినయం ఆకట్టుకుంటూనే ఉండడం విశేషం!