‘ఆంధ్రుల అన్నపూర్ణ డొక్కా సీతమ్మ’ సినిమాతో ఆమని గారికి జాతీయ అవార్డు రావాలని టైటిల్ పోస్టర్ లాంచ్ ఈవెంట్‌లో మురళీ మోహన్ ఆకాంక్షించారు. ఉషారాణి మూవీస్ బ్యానర్‌పై వల్లూరి రాంబాబు నిర్మాతగా, టి.వి. రవి నారాయణ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో మురళీ మోహన్, ఆమని ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. రాహుల్ శ్రీవాస్తవ్ సినిమాటోగ్రాఫర్‌గా, కార్తిక్ కోడకండ్ల సంగీత దర్శకుడిగా, ఎం. రవి కుమార్ ఆర్ట్ డైరెక్టర్‌గా పని చేశారు. ఈ సినిమా టైటిల్ పోస్టర్ విడుదల కార్యక్రమం శుక్రవారం జరిగింది. అంబికా కృష్ణ, రేలంగి నరసింహారావు వంటి ప్రముఖులు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
అంబికా కృష్ణ మాట్లాడుతూ, “డొక్కా సీతమ్మ వంటి గొప్ప వ్యక్తి కథను సినిమాగా తీయడం అద్భుతమైన ప్రయత్నం. ఇలాంటి మహనీయుల గురించి సినిమాల ద్వారా తెలియజేస్తే అందరికీ అవగాహన కలుగుతుంది. ప్రజలకు వీరి గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. 400 ఎకరాల భూమిని అమ్మి అందరికీ అన్నం పెట్టిన ఆమె ఒక గొప్ప మహిళ. ఆమని గారు ఈ పాత్రతో అందరి గౌరవాన్ని పొందుతారు. ఆమె కేవలం నటి మాత్రమే కాదు, హృదయం ఉన్న కళాకారిణి. ఈ చిత్రాన్ని రూపొందిస్తున్న రాంబాబు, దర్శకుడికి నా శుభాకాంక్షలు. ఈ సినిమా ఒక గొప్ప చిత్రంగా రూపొందనుందని అనిపిస్తోంది,” అని పేర్కొన్నారు.
దర్శకుడు టి.వి. రవి నారాయణ్ మాట్లాడుతూ, “చిరంజీవి గారిని చూసి అభిమానిగా మారి 2012లో సినీ రంగంలోకి అడుగుపెట్టాను. చిరంజీవి, పవన్ కళ్యాణ్ అభిమానిగా ఏదైనా మంచి పని చేయాలని, మంచి సినిమా తీయాలని ఆశించాను. డొక్కా సీతమ్మ గురించి పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాటలు నన్ను ఎంతగానో ప్రేరేపించాయి. అభిమానిగా ఈ సినిమాను తీసి వారిద్దరికీ అంకితం ఇవ్వాలనుకున్నాను. ఆమె చరిత్ర అందరికీ తెలియాలనే సంకల్పంతో ఈ ప్రాజెక్ట్ మొదలుపెట్టాం. డబ్బు కోసం కాకుండా, కేవలం వారి అభిమానిగా ఈ మహనీయురాలి కథను తెలుగు ప్రజలకు చేర్చాలనే ఉద్దేశంతోనే ఈ సినిమా తీస్తున్నాం. ఈ చిత్రం ద్వారా వచ్చే ప్రతి రూపాయిని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి మా టీమ్ అంతా కలిసి విరాళంగా అందిస్తాం. డొక్కా సీతమ్మ పేరిట ఉన్న పథకానికి ఆ డబ్బు ఇస్తాం. నా తొలి సినిమాగా ఆమె కథను ఎంచుకోవడం నా అదృష్టం. సుచిత్ర గారితో ఓ పాట చేయాలనుకున్నాను. చంద్రబోస్ గారి మద్దతుతో ఈ సినిమా స్థాయి ఎక్కువైంది. ఆమని గారు అద్భుతంగా నటించారు. మురళీ మోహన్ గారి సహకారం మరువలేనిది. ఆర్ట్ డైరెక్టర్ రవన్న అద్భుతమైన సెట్స్ రూపొందించారు. త్వరలో ట్రైలర్‌తో మీ ముందుకు వస్తాం. ఈ చిత్రం అందరినీ ఆకట్టుకుంటుందని నమ్ముతున్నాను,” అని అన్నారు.
మురళీ మోహన్ మాట్లాడుతూ, “డొక్కా సీతమ్మ వంటి గొప్ప వ్యక్తి కథతో సినిమా తీస్తున్నాం. అన్ని దానాల్లో అన్నదానం ఉత్తమమైనది. ఆమె ప్రతి వచ్చిన వారికీ కడుపు నిండా అన్నం పెట్టేవారు. ఇటువంటి వ్యక్తుల గురించి ఈ తరం వారికి తెలియాలి. దర్శకుడు రవి గారు ఎంతో పరిశోధన చేసి ఈ కథను సిద్ధం చేశారు. ఆమని గొప్ప నటి. ఆమెకు ఈ పాత్ర దక్కడం సంతోషం. ఈ సినిమాతో ఆమని గారికి జాతీయ అవార్డు రావాలని కోరుకుంటున్నాను. అందరూ ఈ చిత్రాన్ని చూడాలి. నాకు ఈ అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు కృతజ్ఞతలు,” అని చెప్పారు.
ఆమని మాట్లాడుతూ, “దర్శకుడు డొక్కా సీతమ్మ కథను వివరించారు. నేను బెంగళూరు నుంచి వచ్చిన వ్యక్తిని కాబట్టి ఆమె గురించి పెద్దగా తెలియదు. కథ విన్న తర్వాత గూగుల్‌లో ఆమె గురించి వెతికాను. ఆమె ఎంత గొప్ప వ్యక్తో అర్థమైంది. ఇలాంటి పాత్రలు చేయడం అదృష్టం కావాలి. ఈ పాత్ర నాకు రావడం సంతోషం. మురళీ మోహన్ గారితో కలిసి నటించడం ఆనందంగా ఉంది. సుచిత్ర గారితో మళ్లీ పని చేయడం సంతృప్తినిచ్చింది. మంచి ఉద్దేశంతో ఈ సినిమా చేస్తున్నాం. ఈ అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు ధన్యవాదాలు,” అని అన్నారు.