హనుమకొండ జిల్లా ధర్మసాగర్‌లో జరిగిన కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమం రాజకీయ వేదికగా మారింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే కడియం శ్రీహరి, మాజీ ఎమ్మెల్యే రాజయ్య, ప్రస్తుత ఎమ్మెల్యే పల్లా అజయ్‌లపై సంచలన వ్యాఖ్యలు చేశారు. దేవాదుల ప్రాజెక్టు, కాలేశ్వరం ప్రాజెక్టుల నిర్వహణపై తన అభిప్రాయాలను స్పష్టంగా వెల్లడించారు.
కడియం శ్రీహరి మాట్లాడుతూ, దేవాదుల ప్రాజెక్టుపై అవగాహన లేకుండా కొంతమంది పెద్దపెద్ద మాటలు మాట్లాడుతున్నారని విమర్శించారు. ఈ ప్రాజెక్టుకు తనదే రూపకల్పన అని, దీన్ని అమలు చేసే సమయంలో ఎవరూ ముందుకు రాలేదని గుర్తు చేశారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి హయాంలోనే దేవాదుల ప్రాజెక్టు మొదటి , రెండో దశ పనులు పూర్తయ్యాయని చెప్పారు. అయితే, కేసీఆర్ హయాంలో ఈ ప్రాజెక్టు పూర్తిగా నిర్లక్ష్యానికి గురైందని ఆయన ఆరోపించారు.
కేసీఆర్ పాలనపై తీవ్ర విమర్శలు చేస్తూ, ఆయన దృష్టి మొత్తం కాలేశ్వరం ప్రాజెక్టుపైనే ఉందని అన్నారు. మెదక్ జిల్లాలోని తన ఫామ్ హౌస్ చుట్టూ కాలువలు తవ్వుకున్న చరిత్ర కేసీఆర్‌దేనని మండిపడ్డారు. లక్ష కోట్ల రూపాయలు వెచ్చించి నిర్మించిన కాలేశ్వరం ప్రాజెక్టు ఎవరికి ఉపయోగపడని దుస్థితిలో ఉందని విమర్శించారు.
దేవాదుల ప్రాజెక్టు పూర్తయితే ఏడు మండలాలు వ్యవసాయ రంగంలో అద్భుతమైన అభివృద్ధి సాధించేవని కడియం శ్రీహరి చెప్పారు. అప్పటి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తమ స్వప్రయోజనాలను మాత్రమే చూసుకున్నారని, వేలేరు, పిచర్ల ప్రాంతాల్లోని రైతులకు నీటిని అందించే ఆలోచనే చేయలేదని ఆరోపించారు.
ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం దేవాదుల ప్రాజెక్టును తిరిగి పునరుద్ధరించేందుకు కృషి చేస్తుందని, మూడో దశ పనులను వేగంగా పూర్తిచేసేందుకు ప్రణాళికలు సిద్ధమవుతున్నాయని చెప్పారు. ఉత్తంకుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి లాంటి నేతలు మూడో దశ పైప్లైన్ ద్వారా నీటిని విడుదల చేసి రిజర్వాయర్ను పరిశీలించారని తెలిపారు. వచ్చే ఏడాది లోపు మూడో దశ పనులను పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.
కడియం శ్రీహరి మాటలపై మాజీ ఎమ్మెల్యే రాజయ్య చేసిన వ్యాఖ్యలను వ్యంగ్యంగా తప్పుబట్టారు. “దేవాదుల నా కష్టార్జితం” అంటూ ధోతి దులుపుకుంటూ రాజయ్య మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు. నన్ను ప్రారంభానికి పిలవలేదని పల్లా అజయ్ మాట్లాడటం సిగ్గుచేటని అన్నారు. అధికారంలో ఉన్నప్పుడు దేవాదుల కాలువల వెంట తిరగలేని, అధికారులతో సమీక్షలు చేయని నేతలు, ఇప్పుడు మాటలు చెప్పడం విడ్డూరంగా ఉందని వ్యాఖ్యానించారు.
అంతేగాక, అధికారంలో ఉన్నప్పుడు ప్రజాసేవ గురించి ఆలోచించని కొందరు నేతలు, ఇప్పుడు తాగి, తిని, ఎగిరి, దునికి పదవులు అమ్ముకున్న వారిగా మారిపోయారని తీవ్ర విమర్శలు చేశారు. ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు చేస్తున్నారని, అవినీతికి కేరాఫ్‌గా మారిన స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గాన్ని వారు చెడ్డపేరు తెచ్చారని ధ్వజమెత్తారు.
ఈ సందర్భంగా కడియం శ్రీహరి, దేవాదుల ప్రాజెక్టును పూర్తి చేయడమే తన లక్ష్యమని, దీని కోసం తాను పోరాడుతూనే ఉంటానని స్పష్టం చేశారు. ప్రజలకు నీరు అందించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తోందని, త్వరలోనే ఈ ప్రాజెక్టు పూర్తి అవుతుందని ఆయన భరోసా ఇచ్చారు.
Maathru : హృదయాన్ని కదిలించేలా ‘మాతృ’ ‘చూస్తున్నవేమో’ పాట