దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ జంటగా నటిస్తున్న సినిమా ‘సీతా రామం’. ప్రతిష్ఠాత్మక వైజయంతి మూవీస్ సంస్థలో అశ్వినీ దత్ నిర్మిస్తున్న ఈ మూవీ ఆగస్ట్ 5న తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో వరల్డ్ వైడ్ రిలీజ్ కాబోతోంది. దర్శకుడు హను రాఘవపూడి 1965 యుద్ధ నేపధ్యంలో ప్రేమకావ్యంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. విశేషం ఏమంటే… ఈ సినిమాలో ఎంతో మంది పేరున్న నటీనటులు నటించారు. వారిందరి పాత్రలను స్పెషల్ మోషన్ పోస్టర్స్ తో గత కొంతకాలంగా ప్రేక్షకులకు చిత్ర దర్శక నిర్మాతలు పరిచయం చేస్తూ వస్తున్నారు. స్టార్ హీరోయిన్ రష్మిక మందన్నతో పాటు తొలిసారి హీరో సుమంత్ ఇందులో ఓ కీలక పాత్రను పోషించాడు. అలానే ఇప్పుడు గౌతమ్ వాసుదేవ మీనన్ పోషిస్తున్న పాత్రను చిత్రబృందం రివీల్ చేసింది. ఇందులో మేజర్ సెల్వన్ పాత్రను గౌతమ్ పోషిస్తున్నారు. బేసికల్ గా మంచి రచయితగానే కాకుండా దర్శకుడిగానూ గుర్తింపు సంపాదించుకున్న గౌతమ్ మీనన్… ఈ మధ్య నటుడిగానూ విభిన్నమైన పాత్రలు చేస్తున్నారు. అలా ఇందులోనూ మేజర్ క్యారెక్టర్ ను ఆయన పోషించారు. ఈ చిత్రానికి విశాల్ చంద్రశేఖర్ సంగీతాన్ని సమకూర్చాడు. ‘హను రాఘవపూడి గొప్ప సంగీత అభిరుచి వున్న దర్శకుడని, ఈ చిత్రంలో పాటలన్నీ వైబ్రెంట్ గా వుంటాయని, ప్రతి పాట మనసుని హత్తుకునేలా వుంటుంద’ని విశాల్ చంద్రశేఖర్ చెబుతున్నారు.