టాలీవుడ్ ని గత కొంతకాలంగా విషాదాలు వీడడం లేదు. సీనియర్ ఫిల్మ్ ఎగ్జిబిటర్, డిస్ట్రిబ్యూటర్ కట్నేని ఉమామహేశ్వరరావు (67) మంగళవారం ఉదయం కన్నుమూశారు. ఎప్పటిలానే ఉదయం షటిల్ ఆడటానికి కోర్టుకు వెళ్ళిన ఆయన, ఆట అనంతరం కుర్చీలో విశ్రాంతి తీసుకుంటూ కుప్పకూలిపోయారని కుటుంబ సభ్యులు తెలిపారు. కృష్ణాజిల్లా పంపిణీదారుడైన ఉమామహేశ్వరరావుకు ప్రముఖ నిర్మాత ఎమ్మెస్ రెడ్డి కాలం నుండి శబ్దాలయ రికార్డింగ్ థియేటర్ తో అనుబంధం ఉంది. ‘శబ్దాలయ’ ఉమామహేశ్వరరావుగా పేరు తెచ్చుకున్న ఆయన, శ్యాంప్రసాద్ రెడ్డి హయాంలోనూ ఆ సంస్థకు సేవలు అందించారు. అనంతరం 14 రీల్స్ ఎంటర్ టైన్ మెంట్స్ సంస్థ చిత్రాల నిర్మాణ నిర్వహణ బాధ్యతలను నిర్వర్తించారు.

Kenei
Read Also: BJP: కాంగ్రెస్‌పై బీజేపీ ఎదురుదాడి.. అదానీతో ఉన్న రాబర్ట్ వాద్రా ఫొటోలు విడుదల
ప్రస్తుతం ఎన్టీయార్, కొరటాల శివ కాంబినేషన్ లో యువసుధ ఆర్ట్స్ సంస్థ రూపొందిస్తున్న చిత్ర నిర్మాణ వ్యవహారాలను ఉమామహేశ్వరరావు పర్యవేక్షిస్తున్నారు. ఆయన హఠాన్మరణ వార్త తెలిసి పలువురు సినీ ప్రముఖులు దిగ్భాంతి వ్యక్తం చేశారు. చిరంజీవి తన భార్య సురేఖతో పాటు ఉమామహేశ్వరావు కుటుంబ సభ్యులను కలిసి, ఆయనతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ప్రముఖ నిర్మాతలు శ్యాంప్రసాద్ రెడ్డి, జెమిని కిరణ్, దామోదర ప్రసాద్, జగదీశ్ ప్రసాద్, మిక్కిలినేని సుధాకర్, కొర్రపాటి సాయి, ఆచంటి గోపీ, గౌతమ్ మోడల్ స్కూల్స్ ఛైర్మన్ వెంకట్ నారాయణ తదితరులు ఉమామహేశ్వరరావు భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. మంగళవారం ఇఎస్ఐ శ్మశాన వాటికలో ఉమామహేశ్వరరావు అంత్రక్రియలు పూర్తయ్యాయి. ఆయనకు ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు.
Read Also: Pawan Kalyan: పవన్ కళ్యాణ్ దుర్గమ్మకు ఇచ్చిన ‘చీర’కు యమ డిమాండ్