Kranthi Kumar: స్త్రీకీ ఓ మనసుందని, శరీరం ఉందని వాటిని గౌరవించాలని చలం రచనలు చాటుతూ ఉంటాయి. స్త్రీ పక్షపాతిగా సాగిన చలం ఆ రోజుల్లో ఎందరో మహిళలు బయటకు చెప్పుకోలేకపోయినా, వారి అభిమాన రచయిత! అదే తీరున తాను నిర్మించిన, దర్శకత్వం వహించిన చిత్రాలలో స్త్రీ సమస్యలను ఇతివృత్తాలుగా ఎంచుకున్నారు దర్శకనిర్మాత టి.క్రాంతికుమార్. అందువల్లే క్రాంతికుమార్ ను ‘వెండితెర చలం’ అని పిలుస్తారు. ఈ అనుబంధమే కాదు, చలం, క్రాంతి కుమార్ ఇద్దరికీ మే మాసంతో సంబంధం ఉంది. ఇద్దరూ మే నెలలోనే జన్మించారు. అలాగే అదే మాసంలో తుదిశ్వాస విడిచారు. 1894 మే 19న కన్నుతెరచిన చలం 1979 మే 4న కన్నుమూశారు. 1942 మే 4న జన్మించిన క్రాంతికుమార్, 2003 మే 9న తుదిశ్వాస విడిచారు.
క్రాంతికుమార్ నిర్మాణభాగస్వామిగా తెరకెక్కిన తొలి చిత్రం ‘శారద’ మొదలు ఆయన దర్శకనిర్మాతగా రూపొందించిన చివరి చిత్రం ‘9 నెలలు’ వరకూ సింహభాగం స్త్రీ సమస్యలు- వాటికి తగ్గ పరిష్కారాలతోనే సాగడం గమనార్హం! అందుకే సినీజనం ‘వెండితెర చలం’గా క్రాంతికుమార్ ను అభివర్ణించారు. చలం పుస్తకం అనగానే చాలామంది పాఠకులు ఆయన రాసిన ‘మైదానం’ పేరు చెబుతూ ఉంటారు. కానీ, క్రాంతి కుమార్ కు చలం రాసిన ‘మ్యూజింగ్స్’ అంటే వల్లమాలిన ఇష్టం. ఆ పుస్తకాన్ని పదే పదే చదివేవాడినని క్రాంతి కుమార్ చెప్పేవారు. చలం కథల్లో ‘స్త్రీలు- ఆర్థిక పరిస్థితులు’ అన్న అంశాలు ముఖ్యంగా కనిపిస్తూ ఉంటాయి. అదే తీరున క్రాంతి కుమార్ సినిమాల్లోనూ స్త్రీలకు ఆర్థిక స్వేచ్ఛ ఉంటే వారి భావాలు సైతం ఉన్నతంగా సాగుతాయని చూపించారు. “శారద, ఊర్వశి, జ్యోతి, ఆమెకథ, కల్పన, ప్రాణం ఖరీదు, న్యాయం కావాలి” చిత్రాలను చూస్తే క్రాంతికుమార్ స్త్రీ పక్షపాతం ఎలాంటిదో ఇట్టే అర్థమై పోతుంది. ఆరంభంలో కె.విశ్వనాథ్, దాసరి నారాయణరావు, కె.రాఘవేంద్రరావు, ఎ.కోదండరామిరెడ్డి వంటి దర్శకులతో చిత్రాలు నిర్మించిన క్రాంతికుమార్ ‘స్వాతి’ చిత్రంతో తానే మెగాఫోన్ పట్టారు. ఇందులో పెళ్ళీడుకు వచ్చిన కూతురు, భర్తలేని తన తల్లికి మరో పెళ్ళి చేయడం ప్రధానాంశం. 1984లో ఈ అంశాన్ని ఎంచుకోవడమే సాహసం. అందులో స్వాతిగా సుహాసిని వంటి స్టార్ హీరోయిన్ ను నటింప చేసి, మెప్పించడం మరింత సాహసమనే చెప్పాలి. ‘స్వాతి’ చిత్రం క్రాంతికుమార్ ను దర్శకునిగా నిలిపింది. ఆ యేటి మేటి చిత్రాల్లో ఒకటిగా నిలచింది. తరువాత ఈ సినిమాను హిందీలోనూ అదే పేరుతో క్రాంతికుమార్ దర్శకత్వంలోనే పునర్నిర్మించారు. దర్శకునిగానూ తనదైన బాణీ పలికిస్తూ “స్రవంతి, రాజేశ్వరి కళ్యాణం, అక్కమొగుడు, సీతారామయ్యగారి మనవరాలు, అమ్మకొడుకు, సరిగమలు, అరుంధతి, 9 నెలలు” వంటి చిత్రాలలో స్త్రీపక్షమే నిలిచారు. అందుకే ‘వెండితెర చలం’గా వెలిగారు క్రాంతికుమార్. చిత్రమేమిటంటే క్రాంతికుమార్ పుట్టినరోజయిన మే 4వ తేదీన, ఆయన పుట్టిన 37 ఏళ్ళకు చలం అదే తేదీన కన్నుమూయడం.