రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన పాన్ ఇండియా మూవీ ‘రాధేశ్యామ్’ అనుకోని ఫలితాన్ని అందించలేకపోయింది. దీనికి ముందు వచ్చిన ‘సాహో’ సైతం పాక్షిక విజయాన్నే అందుకుంది. దాంతో ప్రభాస్ మానసిక ప్రశాంతత కోసం స్పెయిన్ కు వెళ్ళాడనే వార్తలు రెండు మూడు వారాల క్రితం వచ్చాయి. అయితే అక్కడ ప్రభాస్ తన మోకాలికి చిన్నపాటి ఆపరేషన్ చేయించుకున్నాడనీ కొన్ని రూమర్స్ వెలువడ్డాయి. కానీ ప్రభాస్ సన్నిహితులు ఎవరూ దీనిపై పెదవి విప్పలేదు. ఇదిలా ఉండగా, ‘రాధేశ్యామ్’ విడుదల కాగానే ప్రభాస్ ప్రస్తుతం సెట్స్ పై ఉన్న ‘సలార్’, ‘ప్రాజెక్ట్ కె’ పై దృష్టిపెడతాడని అంతా అనుకున్నారు. కానీ ‘సలార్’ మూవీ దర్శకుడు ప్రశాంత్ నీల్ ప్రస్తుతం తన తాజా చిత్రం ‘కేజీఎఫ్ -2’ ప్రమోషన్స్ లో తలమునకలై ఉన్నాడు. మరో పక్క ‘ప్రాజెక్ట్ -కె’ కు సంబంధించి కొన్ని కీలక పాత్రలకు నటుల ఎంపిక ఇంకా జరుగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో ప్రభాస్ విదేశాలలో ఇప్పుడు ఆపరేషన్ చేయించుకుంటున్నాడని, గతంలో వచ్చిన ఆపరేషన్ వార్తలలో నిజం లేదని కొందరు అంటున్నారు.
చిత్రం ఏమంటే ప్రభాస్ కాలికి గాయం ఎప్పుడైందనే విషయంలోనూ విభిన్న కథనాలే వినిపిస్తున్నాయి. కొందరు ‘సాహో’ సమయంలో జరిగిందని చెబుతుంటే మరికొందరు ‘సలార్’ షూటింగ్ సమయంలో జరిగిందని అంటున్నారు. ఆ సమయంలో వెంటనే ఆపరేషన్ చేయించుకోమని డాక్టర్లు చెప్పకపోవడంతో ‘రాధేశ్యామ్’, ‘ఆదిపురుష్’ చిత్రాల షూటింగ్స్ ను ప్రభాస్ పూర్తి చేశాడని, ఇప్పుడు కొంత సమయం చిక్కడంతో ఆపరేషన్ కు సిద్ధమయ్యాడని చెబుతున్నారు. ఆపరేషన్ అనంతరం రెండు, మూడు మాసాల పాటు ప్రభాస్ బెడ్ రెస్ట్ తీసుకోవాల్సి ఉంటుందట! దాని కారణంగా ‘సలార్, ప్రాజెక్ట్ కె’ సినిమాలు పూర్తి కావడానికి మరింత ఆలస్యం అవుతుందని తెలుస్తోంది. అయితే ప్రభాస్ కు జరుగబోతోంది మైనర్ ఆపరేషనే అని, దాని గురించి అభిమానులు ఆందోళన పడాల్సిన పనిలేదని అంటున్నారు.