కొత్త ఏడాది కొత్త జంటకు పోలీసులు షాక్ ఇచ్చారు. కత్రినా, విక్కీ కౌశల్ డిసెంబర్ లో వివాహంతో ఒక్కటైన విషయం తెలిసిందే. అయితే పెళ్ళయ్యి ఇంకా ఒక నెల కూడా గడవక ముందే కొత్త పెళ్లి కొడుకు చిక్కుల్లో పడ్డాడు. విక్కీ కౌశల్ పై తాజాగా కేసు నమోదు అయ్యింది.
విక్కీ కౌశల్, సారా అలీ ఖాన్ జంటగా నటిస్తున్న చిత్రం షూటింగ్ మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ నగరంలో జరుగుతోంది. ఈ సినిమాలోని వారి లుక్స్ ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ పై భారీగా అంచనాలు ఉన్నాయి. అయితే ఇప్పుడు ఇండోర్ నివాసి అయిన ఒక వ్యక్తి విక్కీపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. ఓ సినిమా సీక్వెన్స్‌లో మోటార్ సైకిల్ నంబర్ ప్లేట్‌ను ఉపయోగించారని ఫిర్యాదులో పేర్కొన్నాడు. నంబర్ ప్లేట్ తనకు చెందిన వాహనం అని ఆయన చెప్పాడు.
Read Also : “రాధేశ్యామ్” పోస్ట్ పోన్… అసలు విషయం చెప్పేసిన మేకర్స్
పోలీసులు ఈ విషయాన్నీ మీడియాతో ప్రస్తావిస్తూ “మాకు ఫిర్యాదు అందింది. నంబర్ ప్లేట్ దుర్వినియోగం చేశారా ? లేదా ? అన్నది చూస్తాము. మోటారు వాహన చట్టంలోని నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలి. చిత్ర యూనిట్ ఇండోర్‌లో ఉంటే వారిని విచారించడానికి ప్రయత్నిస్తాము” అని బంగంగా ఎస్‌ఐ రాజేంద్ర సోని అన్నారు.
ఫిర్యాదుదారు జై సింగ్ యాదవ్ మాట్లాడుతూ “సినిమా సీక్వెన్స్‌లో ఉపయోగించిన వాహనం నంబర్ నాది. ఈ విషయం చిత్ర యూనిట్‌కి తెలిసిందో లేదో తెలియదు. ఇది చట్టవిరుద్ధం… నా అనుమతి లేకుండా నా నంబర్ ప్లేట్‌ని ఉపయోగించకూడదు. స్టేషన్‌లో మెమోరాండం ఇచ్చాను. ఈ విషయంలో చర్యలు తీసుకోవాలి’ అని అన్నారు. విక్కీ కౌశల్ తన రాబోయే చిత్రం కోసం ఇండోర్ వీధుల్లో సారా అలీ ఖాన్‌తో కలిసి బైక్ నడుపుతూ కనిపించిన తర్వాత ఫిర్యాదు నమోదైంది. గమనించదగ్గ విషయం ఏమిటంటే ఈ చిత్రానికి సంబంధించిన వివరాలను గోప్యంగా ఉంచారు. టైటిల్ కూడా ఇప్పటి వరకు ప్రకటించలేదు. కత్రినా కైఫ్‌తో పెళ్లి తర్వాత విక్కీ ఈ సినిమా షూటింగ్‌లో కనిపించాడు.