అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్ తొలిసారి కలిసి నటిస్తున్న యాక్షన్ ఎంటర్ టైనర్ ‘బడే మియా చోటే మియా’. ఇదే టైటిల్ తో బిగ్ బి అమితాబ్, గోవిందాతో 1998లో భారీ బడ్జెట్ చిత్రాన్ని తెరకెక్కించిన విషు భగ్నాని ఇప్పుడు మరోసారి అదే ప్రయత్నం చేస్తున్నారు. ఈసారి ఏకంగా దీని బడ్జెట్ ను రూ. 300 కోట్లకు ఫిక్స్ చేసినట్టు తెలుస్తోంది. అలనాటి ‘బడే మియా చోటే మియా’లో అమితాబ్, గోవింద ఇద్దరూ ద్విపాత్రాభినయం చేశారు. డేవిడ్ ధావన్ తెరకెక్కించిన ఆ సినిమా ఆ యేడాది బ్లాక్ బస్టర్ గా నిలిచింది.
ఇక ఈ తాజా చిత్రాన్ని వచ్చే యేడాది క్రిస్మస్ కానుకగా హిందీతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లోనూ డబ్ చేసి రిలీజ్ చేయాలని భావిస్తున్నారట. పూజా ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ లో నిర్మితమయ్యే ఈ సినిమా షూటింగ్ ఈ యేడాది చివరిలో మొదలవుతుందని అంటున్నారు. అయితే అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వం వహించే ఈ సినిమాకు సంబంధించిన పవర్ ఫుల్ యాక్షన్ టీజర్ ను మంగళవారం విడుదల చేశారు. దీనితో ఇప్పటి నుండే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొనడం మొదలైంది.