తమిళంలో జయకేతనం ఎగురవేసిన పలు చిత్రాలు తెలుగులో రీమేక్ అయి అలరించాయి. అలాగే ఇక్కడ విజయాన్ని చవిచూసిన సినిమాలు అక్కడా సక్సెస్ ను సాధించాయి. అలా తమిళంలో శివాజీ గణేశన్ హీరోగా తెరకెక్కిన ‘సవాలే సమాలి’ ఆధారంగా తెలుగులో ఏయన్నార్ ‘మంచి రోజులు వచ్చాయి’ చిత్రం తెరకెక్కింది. అంతకు ముందు 1955లో ఏయన్నార్ నటించిన ‘రోజులు మారాయి’ సినిమాలోలాగే ఇందులోనూ ఊరి పెదకామందుకు, హీరోకు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గు మంటూ ఉంటుంది. అదే కథకు ఓ సవాల్ ను జోడించి తమిళ కథను తయారు చేసుకున్నారు. జెమినీ సంస్థ ఆ చిత్రాన్ని తెలుగులో ‘మంచి రోజులు వచ్చాయి’గా వి.మధుసూదనరావు దర్శకత్వంలో తెరకెక్కించింది. 1972 మే 12న విడుదలైన ‘మంచి రోజులు వచ్చాయి’ మంచి విజయం సాధించింది.
‘మంచి రోజులు వచ్చాయి’ చిత్ర కథ ఏమిటంటే- గోపాలం అనే సన్నకారు రైతుకు, ఆ ఊరి పెదకామందు అంటే మొదటి నుంచీ గిట్టదు. కానీ, గోపాలం తండ్రి సీతన్న ఆ కామందు దగ్గరే పాలేరుగా పనిచేస్తుంటాడు. ఆ జమీందార్ ఇంటి చెంతనే గోపాలానికి చెందిన కాసింత స్థలం ఉంటుంది. అందులో గోపాలం, అతని మిత్రులు ఆటలు ఆడుకుంటూ ఉంటారు. దానిని తీసేయమని జమీందార్, అతని కొడుకు రాజు చెబుతారు. అందుకు గోపాలం అంగీకరించడు. గోపాలం చెల్లి పెళ్ళికి రెండు వేలు అప్పు ఇచ్చిన కారణంగా, ఆ స్థలం రాసివ్వమంటాడు జమీందార్. అందుకు గోపాలం ససేమిరా అంటాడు. ఆ ఊరి గ్రామపంచాయతీ ప్రెసిడెంట్ ఎలక్షన్స్ వస్తాయి. అందులో పోటీ చేయమని జమీందార్ ను కరణం కామయ్య బలవంతం చేస్తాడు. సరేనని పోటీకి దిగుతాడు జమీందార్. గోపాలం కూడా పోటీ చేస్తానంటాడు. గోపాలం తండ్రి అప్పుని చెల్లుచేసి, ఎన్నికల్లో పోటీ నుండి కొడుకును తప్పించమంటాడు జమీందార్. అందుకు గోపాలం అంగీరించడు. గోపాలం ఓడిపోతే ఊరు విడిచి పోవాలని కామయ్య చెబుతాడు. జమీందార్ ఓడిపోతే ఆయన కూతురు గీతను ఇచ్చి పెళ్ళి చేస్తాడనీ కామయ్యనే సూచిస్తాడు. మాటామాట పెరిగి చివరు స్టాంప్ పేపర్ల మీద ఒప్పందం కూడా రాసుకుంటారు. ఎన్నికల్లో గోపాలం గెలుస్తాడు. ఒప్పందం ప్రకారం జమీందార్ కూతురును ఇచ్చి పెళ్ళి చేయమంటారు జనం. ఓడిపోయిన జమీందార్ తన కూతురును వదలి వెళితే కావలసినంత డబ్బు ఇస్తానంటాడు. గోపాలం అంగీకరించడు. దాంతో జమీందార్ చచ్చే ప్రయత్నం చేస్తాడు. జమీందార్ భార్య కూతురు గీతను తన పసుపు కుంకుమ కాపాడమని కోరుతుంది. గోపాలమంటే అసహ్యించుకొనే గీత చివరకు అతనికి భార్య అవుతుంది. అతని ఇంటికీ వెడుతుంది. అక్కడ తనను ముట్టుకోరాదనీ చెబుతుంది. గీతను ఇంటికి తీసుకోవాలని ఆమె అన్న వస్తాడు. అక్కడ భర్త వదిలేసిన గోపాలం చెల్లిని చూసి అవమానిస్తాడు. ఆమె ఛీ కొడుతుంది. కక్షతో ఆమెను బలాత్కారం చేయబోతాడు. నెత్తి పగల గొడుతుంది. ఆ విషయం బయట పడితే, అసలే చెల్లిని వదిలేసిన బావ ఏమంటాడో అని గోపాలం భయపడతాడు. గోపాలమే పేదవారి పంట కాల్చేశాడని అతనికి శిక్షగా కొరడా దెబ్బలు విధిస్తారు. గోపాలం నిజాయితీ తెలిసిన గీత వచ్చి అక్కడ ఉన్న జనానికి తన అన్న తప్పును చెబుతుంది. అదే సమయంలో గోపాలం చెల్లెలి భర్త రంగ తన భార్యకు జరిగిన అవమానం తెలుసుకొని వచ్చి, రాజును, జమీందార్ ను చితక బాదుతాడు. రాజును రంగ చంపబోతే, జమీందార్ భార్య ముఖం చూసి వదిలేయమని గోపాలం చెబుతాడు. అసలు నిజం జనానికి కూడా తెలుస్తుంది. జనం జమీందార్ ఇంటిపై దాడికి దిగితే గోపాలం అడ్గుకొని, డబ్బున్న వాళ్ళు ఏమైనా చేస్తారు.. కానీ మనం పేదవాళ్ళం.. కూటికి లేకపోయినా మన్నించే గుణముందని చాటుదాం… అని చెబుతాడు. అతని మాటలకు గౌరవమిచ్చి జనం వెళ్ళిపోతారు. గోపాలం దెబ్బలకు మందు రాయడానికి గీత వస్తుంది. దాంతో కథ సుఖాంతమవుతుంది.
‘మంచిరోజులు వచ్చాయి’ చిత్రానికి మల్లియం రాజగోపాల్ రాసిన కథ ఆధారం. తమిళ చిత్రం ‘సవాలే సమాలి’కు రాజగోపాలే దర్శకుడు. తెలుగు చిత్రానికి బొల్లిముంత శివరామకృష్ణ సంభాషణలు పలికించారు. ‘టి.చలపతిరావు సంగీతం సమకూర్చారు. దేవులపల్లి, కొసరాజు, దాశరథి, సి.నారాయణ రెడ్డి పాటలు రాశారు. “పదరా పదరా…మంచి రోజులొచ్చాయి పదరా…”, “ఈ నాడు సంక్రాంతి అసలైన పండుగ…”, “సిరిపల్లె చిన్నది…”, “ఎగిరే గువ్వ ఏమంది…”, “ఎక్కడికమ్మా ఈ పయనం…” అంటూ మొదలయ్యే పాటలు అలరించాయి. అన్నిటినీ మించి దేవులపల్లి రాసిన “నేలతో నీడ అన్నది…” పాట భలేగా ఆకట్టుకుంది.
అక్కినేని నాగేశ్వరరావు, కాంచన, నాగభూషణం, ధూళిపాల, గుమ్మడి, కృష్ణంరాజు, సత్యనారాయణ, అంజలీదేవి, గీతాంజలి, ఝాన్సీ, భీమరాజు, చిడతల అప్పారావు తదితరులు నటించారు. ఈ చిత్రాన్ని
జెమినీ పతాకంపై ఎస్.ఎస్.బాలన్ ఈ చిత్రాన్ని నిర్మించారు. తరువాతి రోజుల్లో మేటి దర్శకుడు అనిపించుకున్న ఏ.కోదండరామిరెడ్డి ఈ చిత్రానికి అసోసియేట్ డైరెక్టర్ గా పనిచేశారు. ‘మంచి రోజులు వచ్చాయి’ రంగుల్లో రూపొంది తెలుగువారిని అలరించింది.
‘మంచి రోజులు వచ్చాయి’ కథనే అటు ఇటుగా చేసి రమణి-మధు ‘ప్రెసిడెంట్ గారి పెళ్ళాం’ కథను రూపొందించారు. ‘మంచి రోజులు వచ్చాయి’కి అసోసియేట్ డైరెక్టర్ గా పనిచేసిన కోదండరామిరెడ్డి దర్శకత్వంలోనే ఏయన్నార్ నటవారసుడు నాగార్జున హీరోగా ‘ప్రెసిడెంట్ గారి పెళ్ళాం’ తెరకెక్కడం విశేషం! ‘శివ’ తరువాత వరుస ఫ్లాపులు చూసిన నాగార్జునకు ‘ప్రెసిడెంట్ గారి పెళ్ళాం’తోనే సూపర్ హిట్ దక్కింది. ఇందులో నాగార్జున సరసన మీనా నాయికగా నటించారు.