చలికాలంలో చర్మాన్ని, శరీరాన్ని ఎంత జాగ్రత్తగా చూసుకుంటామో.. అంతే జాగ్రత్తగా జుట్టుపై కూడా ప్రత్యేక శ్రద్ధ అవసరం. చల్లటి గాలి, తక్కువ తేమ, తరచుగా వేడి నీటిని ఉపయోగించడం వల్ల జుట్టు సహజ తేమను, మెరుపును కోల్పోతుంది. ఈ క్రమంలో.. సరైన జుట్టు సంరక్షణ కోసం కొన్ని ప్రత్యేక చిట్కాలను అనుసరించడం చాలా ముఖ్యం.
చలికాలంలో వేడి నీళ్లతో తలస్నానం చేయద్దు:
వేడి నీళ్లతో తలస్నానం చేస్తే జుట్టుకు హానికరం. వేడి నీరు జుట్టును దాని సహజ తేమను తొలగిస్తుంది. దీంతో.. జుట్టు పొడిగా, నిర్జీవంగా అనిపిస్తుంది. గోరువెచ్చని లేదా చల్లటి నీటితో మాత్రమే జుట్టును శుభ్రం చేసుకోవాలి. దీంతో.. జుట్టు తేమగా ఉంటుంది.
స్కార్ఫ్ లేదా టోపీ పెట్టుకోండి:
కాలుష్యం మీ జుట్టును త్వరగా దెబ్బతీస్తుంది. చల్లని గాలి, ధూళి నుండి రక్షించడానికి మీ జుట్టుకు స్కార్ఫ్ లేదా టోపీ పెట్టుకోవాలి. ఉన్ని లేదా కాటన్ దుస్తులు వాడొద్దు.. ఇవి పెట్టుకుంటే జుట్టు రాలిపోతుంది. జుట్టును రక్షించడానికి సిల్క్ లేదా శాటిన్ ఫాబ్రిక్ ఉపయోగించాలి.
మసాజ్ చేయాలి:
చలికాలంలో తలకు మసాజ్ చేయాలి. చల్లని గాలి జుట్టు నుండి తేమను గ్రహిస్తుంది. దీంతో జుట్టు మరింత పొడిగా మారుతుంది. గోరువెచ్చని నూనెతో తలకు మసాజ్ చేయడం వల్ల జుట్టుకు తేమ తిరిగి వస్తుంది. స్కాల్ప్ మసాజ్ రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. ఇది జుట్టు మూలాలను బలపరుస్తుంది.. జుట్టు పెరుగుదలను వేగవంతం చేస్తుంది.
హీట్ స్టైలింగ్ నివారించండి:
శీతాకాలంలో జుట్టు పొడిగా మారుతుంది. అందుకోసం.. బ్లో డ్రైయర్‌లు, స్ట్రెయిట్‌నర్‌లు, కర్లర్‌ల వంటి హీట్ స్టైలింగ్ వంటివి వాడుతారు. అవి జుట్టుకు మరింత హాని కలిగిస్తాయి. ఇవి వాడటంవల్ల జుట్టు చిట్లిపోయి, చివర్లు చిట్లిపోతాయి. వీలైనంత వరకు హీట్ స్టైలింగ్‌కు దూరంగా ఉండండి.
షాంపూ తక్కువగా వాడండి:
జుట్టుకు రక్షణ కల్పించే సహజ నూనెలను కలిగి ఉంటుంది. తరచుగా షాంపూతో తలస్నానం చేయడం వల్ల జుట్టులోని సహజమైన ఆయిల్ తొలగిపోతుంది. దీనివల్ల జుట్టు పొడిబారడంతోపాటు చిట్లిపోతుంది. చలికాలంలో ప్రతిరోజూ షాంపూ చేయడం మానుకోండి. షాంపూ చేయడానికి మధ్య ఎక్కువ గ్యాప్ ఉంచండి. స్కాల్ప్ దాని సహజ నూనెను నిర్వహించడానికి సమయం ఇవ్వండి. ప్రతి 3 రోజులకు ఒకసారి జుట్టును శుభ్రం చేయడానికి తేలికపాటి షాంపూని ఉపయోగించండి.
వీక్లీ డీప్ కండిషనింగ్ చేయండి:
చల్లని, పొడి గాలి వల్ల జుట్టు చిట్లడం.. బలహీనమవుతుంది. వారానికి ఒకసారి డీప్ కండిషనింగ్ లేదా హెయిర్ మాస్క్‌ని ఉపయోగించడం ద్వారా జుట్టుకు తేమ, పోషణను అందించాలి. చలికాలంలో వారానికి ఒకసారి డీప్ కండిషనింగ్ చేయడం వల్ల జుట్టు మృదువుగా, మెరిసేలా, హైడ్రేటెడ్‌గా ఉంటుంది. బ్రేకేజ్‌ను నివారించడంలో కూడా సహాయపడుతుంది.