Iran: ఇజ్రాయిల్-ఇరాన్ యుద్ధం ముగిసిన తర్వాత తొలిసారిగా ఇరాన్ సుప్రీంలీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ స్పందించారు. సంఘర్షణ తర్వాత తన తొలి బహిరంగ ప్రసంగంలో ఖమేనీ గురువారం మాట్లాడుతూ.. ఇజ్రాయిల్‌పై తాము విజయం సాధించామని, ఇజ్రాయిల్‌ని కాపాడాలని అండగా వచ్చిన అమెరికా ముఖంపై చెంప దెబ్బ కొట్టామని అన్నారు. ఇరాన్ అణు స్థావరాలకు పెద్దగా నష్టం జరగలేదని, అమెరికా పెద్దగా ఏం సాధించలేకపోయిందని చెప్పారు.
Read Also: MLA Raja Singh: డీజీపీకి బీజేపీ ఎమ్మేల్యే రాజా సింగ్ కీలక లేఖ..
‘‘మా ప్రియమైన ఇరాన్ అమెరికా పాలనపై విజయం సాధించినందుకు నా అభినందనలు. జియోనిస్ట్(ఇజ్రాయిల్) పాలన పూర్తిగా నాశనం అవుతుందని భావించినందున అమెరికా ప్రభుత్వం నేరుగా యుద్ధంలోకి ప్రవేశించింది. ఆ పాలనను కాపాడే ప్రయత్నంలో అది యుద్ధంలోకి ప్రవేశించింది కానీ ఏమీ సాధించలేదు’’ అని ఎక్స్‌లో ఖమేనీ అన్నారు. ఇస్లామిక్ రిపబ్లిక్ అమెరికా ముఖంపై భారీ దెబ్బ కొట్టిందని అన్నారు.
ఇరాన్ దాడితో ఇజ్రాయిల్ పాలన దాదాపుగా కూలిపోయిందని, నలిగిపోయిందని ఇరాన్ అనే గొప్ప దేశానికి అభినందనలు అని ఖమేనీ చెప్పారు. ఇరాన్‌పై భవిష్యత్తులో జరిగే ఏ దురాక్రమణకైనా భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుందని ఇరాన్ సుప్రీం లీడర్ హెచ్చరించారు. ఖతార్‌లోని అమెరికా స్థావరాలపై ఇరాన్ దాడులు చేయడం గొప్ప విజయంగా ఖమేనీ అభివర్ణించారు. మళ్లీ అమెరికా రెచ్చగొడితే ఇదే పునరావృతమవుతుందని హెచ్చరించారు.