Sudan Crisis: సైన్యం, పారామిలిటరీల మధ్య రాజుకున్న వివాదం సూడాన్ లో తీవ్ర హింసకు దారి తీసింది. ఈ రెండు బలగాల మధ్య తీవ్రమైన దాడులు జరుగుతున్నాయి. పారామిలిటరీని సైన్యంలో కలిపే ప్రతిపాదనతో సైన్యాధ్యక్షుడు, పారామిలిటీరీ కమాండర్ మధ్య వివాదం ఏర్పడింది. ఈ ఘర్షణల్లో 200 మంది మరణించగా.. 1800 మంది గాయపడ్డారు. ఈ ఘర్షణల్లో సాధారణ ప్రజలు మరణిస్తున్నారు. మూడు రోజులుగా కొనసాతున్న ఈ ఘర్షణల్లో రాజధాని ఖార్టుమ్ లోని పలు ఆస్పత్రులు దెబ్బతిన్నాయి. వైద్యం, ఆహారం కొరత ఏర్పడింది.
2021లో తిరుగబాటుతో అధికారాన్ని చేపట్టిన ఇద్దరు జనరల్స్ సూడాన్ ఆర్మీ చీఫ్ అబ్దెల్ ఫట్టా అల్-బుర్హాన్, శక్తివంతమైన పారామిలిటరీ రాపిడ్ సపోర్ట్ ఫోర్స్‌కు నాయకత్వం వహిస్తున్న అతని డిప్యూటీ మొహమ్మద్ హమ్దాన్ డాగ్లో మధ్య వారాలపాటు సాగిన అధికార పోరాటం శనివారం ఘోరమైన హింసాత్మకంగా మారింది. రాజధానిలో పరిస్థితులు తీవ్రంగా తయారు అయ్యాయి. ఇరు వర్గాలు కూడా వారి వ్యతిరేక స్థావరాలపై దాడులు చేసుకుంటున్నాయి.
Read Also: Pakistan: పాకిస్తాన్‌లో చైనా వ్యాపారాలు క్లోజ్.. భద్రతే ప్రధాన కారణం..
ప్రజలు ఆహారం, పెట్రోల్ కోసం దాడుల మధ్యే క్యూల్లో నిలబడాల్సి పరిస్థితి ఏర్పడింది. ఐక్యరాజ్యసమితి సెక్రటరీ-జనరల్ ఆంటోనియో గుటెర్రెస్ ఇరు పక్షాలు శతృత్వాన్ని వీడాలంటూ పిలుపునిచ్చారు. రాజధాని ఖార్టూమ్ నగరంలో తొమ్మిది ఆస్పత్రుల్లో రక్తమార్పిడి, ఇంట్రావీనస్ ఫ్లూయిడ్స్ ఇతర మందులు అయిపోయాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇప్పటికే హెచ్చరించింది.
ఇదిలా ఉంటే ఈ ఘర్షణల మధ్య యూరోపియన్ యూనియన్ రాయబారి ఇంటిపై దాడి జరిగింది. మరోవైపు భారతీయుల భద్రతపై అక్కడి రాయబార కార్యాలయం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇళ్ల నుంచి బయటకు వెళ్లవద్దని కోరింది. సూడాన్ ఘర్షణల్లో కేరళకు చెందిన ఓ వ్యక్తి మరణించాడు. అతడి మృతదేహాన్ని ఇండియాకు తీసుకురావడానికి అధికారం యంత్రాంగం పనిచేస్తోంది.