Russian Strikes Across Ukraine: ఉక్రెయిన్ పై భారీస్థాయిలో క్షిపణులతో విరుచుకుపడుతోంది రష్యా. రాజధాని కీవ్ తో సహా దక్షిణాన ఉన్న క్రైవీ రిహ్, ఈశాన్యంలో ఉన్న ఖార్కీవ్ నగరాలపై దాడులు చేస్తోంది. శుక్రవారం ఉదయం నుంచి ఉక్రెయిన్ పై దాడులు ప్రారంభించింది రష్యా. ముఖ్యంగా ఈ నగరాల్లోని మౌళిక సదుపాయాలే లక్ష్యంగా రష్యా దాడులు చేస్తోంది. రష్యా దాడుల వల్ల ఖార్కీవ్ నగరంలో విద్యుత్ లేకుండా పోయింది. ఖార్కీవ్ లోొ మూడు దాడులు మౌళిక సదుపాయలే లక్ష్యంగా జరిగాయని ఆ ప్రాంత గవర్నర్ వెల్లడించారు.
Read Also: Rahul Gandhi: చైనా యుద్ధానికి సిద్ధమవుతోంది.. కానీ బీజేపీ ప్రభుత్వం నిద్రపోతోంది..
రష్యా దాడులతో రాజధాని కీవ్ లోని నీటి సరఫరా దెబ్బతింది. నగరంలో మెట్రోను నిలిపివేశారు. నీరు, విద్యుత్ వనరులపైనే ప్రధానంగా దాడులు చేసింది రష్యా. దాడులతో ప్రజలంతా భూగర్భ మెట్రోలో తలదాచుకునేందుకు మెట్రోను నిలిపివేశారు ఉక్రెయిన్ అధికారులు. క్రైవీ రిహ్ నగరంలో ఇద్దరు మరణించారు. ప్రస్తుతం చలికాలం కావడంతో ఉక్రెయిన్ పై మరింత ఒత్తడి పెంచేందుకు రష్యా విద్యుత్ వ్యవస్థలపై దాడులు చేస్తోంది.
2014లో ఉక్రెయిన్ భూభాగం అయిన క్రిమియాను రష్యా స్వాధీనం చేసుకుంది. రష్యా ప్రధాన భూభాగంతో క్రిమియాను కలిపే కేర్చ్ వంతెనను ఉక్రెయిన్ కూల్చేయడంతో రష్యా ఆగ్రహంగా ఉంది. దీంతో పాటు ఇటీవల కాలంలో రష్యా ఎయిర్ బెస్ లపై ఉక్రెయిన్ దాడులు జరిపింది. దీంతో రష్యా ఆగ్రహంతో క్షిపణి దాడులు చేస్తోంది. ఈ వారం కైవ్‌లో ప్రయోగించిన డజనుకు పైగా ఇరాన్ నిర్మిత దాడి డ్రోన్‌లను ఉక్రెయిన్ దళాలు కూల్చివేసినట్లు ఆ దేశం ప్రకటించింది. మరోవైపు రష్యా మిత్రదేశం, ఉక్రెయిన్ సరిహద్దుల్లో ఉన్న బెలారస్ దేశంలో రష్యా అధ్యక్షుడు పుతిన్ పర్యటించనున్నారు. బెలారస్-రష్యా ఏకీకరణపై బెలారస్ అధ్యక్షుడు అలెగ్జాండర్ లుకాషెంకోతో పుతిన్ చర్చించనున్నట్లు తెలిసింది.