PM Narendra Modi Speaks With Ukraine Volodymyr Zelenskyy: ఉక్రెయిన్‌పై యుద్ధాన్ని మరింత తీవ్రం చేసేందుకు.. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఇప్పటికే సైనిక సమీకరణ ప్రక్రియను ప్రారంభించిన సంగతి తెలిసిందే! దీనికితోడు ఆయన అణ్వాయుధాల ప్రయోగం కూడా జరపవచ్చనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇలాంటి పరిణామాల నేపథ్యంలో.. మంగళవారం ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్‌స్కీకి ప్రధాని నరేంద్ర మోడీ ఫోన్ చేశారు. ఉక్రెయిన్‌లో నెలకొన్న పరిస్థితులపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా.. ప్రస్తుత సంక్షోభాన్ని సైనిక చర్యతో పరిష్కరించలేమంటూ ఆయన హితవు పలికారు.
శత్రుత్వాలను త్వరగా వీడాలని సూచించిన మోదీ.. చర్చలు, దౌత్య మార్గం ద్వారా సమస్యను పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉందని గుర్తు చేశారు. శాంతి ప్రయత్నాలకు సహకరించేందుకు భారత్ సిద్ధంగా ఉందని మోదీ ఉద్ఘాటించినట్లు పీఎం కార్యాలయం వెల్లడించింది. యూఎన్ ఛార్టర్, అంతర్జాతీయ చట్టం, దేశాల సార్వభౌమాధికారం, ప్రాదేశిక సమగ్రతలను గౌరవించాల్సిన ప్రాధాన్యాన్ని కూడా చాటిన మోదీ.. ఉక్రెయిన్‌తో పాటు ప్రపంచంలోని అణు కేంద్రాల భద్రతకు భారత్ ప్రాముఖ్యాన్ని ఇస్తోందని చెప్పారు. అణు కేంద్రాల ప్రమాదం.. ప్రజారోగ్యంతో పాటు పర్యావరణానికి విపత్కర పరిణామాలు కలిగిస్తుందని పేర్కొన్నారు. 2021 నవంబరులో గ్లాస్గోలో ఇరు నేతలు సమావేశం అయినప్పుడు చర్చించుకున్న ద్వైపాక్షిక అంశాలన కూడా ఈ సందర్భంగా ప్రస్తావించారు.
కాగా.. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి ఉక్రెయిన్‌పై దురాక్రమణకు దిగిన రష్యా.. ఇటీవల ఉక్రెయిన్‌లోని ఖేర్సన్, జపోరిజియా, లుహాన్స్క్, దొనెట్స్క్ ప్రాంతాలను విలీనం చేసుకుంది. ఈ విషయాన్ని గత శుక్రవారం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రకటించారు. ప్రజాభిప్రాయ సేకరణ ద్వారానే తాము ఆ నాలుగు ప్రాంతాల్ని తమ దేశంలో విలీనం చేసుకున్నామని స్పష్టం చేసిన ఆయన.. అందుకు సంబంధించిన ఒప్పందాలపై సంతకాలు కూడా చేశారు. మరోవైపు.. సెప్టెంబర్ 21న పుతిన్ సైనిక సమీకరణను ప్రకటించారు. అప్పట్నుంచి దాదాపు 2లక్షల మంది రష్యన్లు, సమీప దేశాలకు వెళ్లినట్టు అంతర్జాతీయ నివేదికలు వెల్లడిస్తున్నాయి.