ప్రధాని మోడీ రెండ్రోజుల రష్యా పర్యటన ముగిసింది. మంగళవారం సాయంత్రం పర్యటన ముగియడంతో అక్కడ నుంచి మోడీ ఆస్ట్రియాకు బయల్దేరి వెళ్లారు. మాస్కో నుంచి ఆస్ట్రియా రాజధాని వియన్నాకు పయనమయ్యారు.
ఆస్ట్రియాతో భారత్‌కు దృఢమైన, విశ్వసనీయమైన బంధం ఉందని మోడీ పేర్కొన్నారు. ఆ దేశాధ్యక్షుడు అలెగ్జాండర్ వాన్‌డర్ బెల్లెన్, ఛాన్సలర్ కార్ల్ నెహమ్మర్‌తో భేటీ అవుతున్నానని.. వారితో ప్రజాస్వామ్యం, బహుళత్వ వాదంపై చర్చలు జరపబోతున్నట్లు ప్రధాని మోడీ ట్వీట్ చేశారు. భారత ప్రధాని ఆస్ట్రియాకు వెళ్లడం 41 ఏళ్లలో ఇదే మొదటిసారి కావడం విశేషం.
ఇక రష్యా అధ్యక్షుడు పుతిన్ ఆహ్వానం మేరకు మోడీ.. సోమ, మంగళవారాల్లో ఆ దేశంలో పర్యటించారు. మాస్కోలో ఘన స్వాగతం లభించింది. సోమవారం రాత్రి పుతిన్ తన అధికారిక నివాసంలో విందు ఇచ్చారు. పర్యటనలో భాగంగా రష్యా అత్యున్నత పౌర పురస్కారాన్నీ ప్రధాని మోడీ అందుకున్నారు. ఉక్రెయిన్ యుద్ధం ముగింపునకు సలహా ఇచ్చిన మోడీకి పుతిన్ కృతజ్ఞతలు తెలిపారు. అలాగే సివిల్ న్యూక్లియర్ ఎనర్జీ ఎగ్జిబిషన్‌ను ప్రధాని మోడీ సందర్శించారు.