Pakistan: ఆర్థిక ఇబ్బందులు, రాజకీయ సమస్యలతో పీకల్లోతు కష్టాల్లో ఉన్న దాయాది దేశం పాకిస్తాన్ లో ప్రజలు నిరసనలకు పిలుపునిచ్చారు. ఈ నిరసనలకు కారణం అధికం వస్తున్న విద్యుత్ బిల్లులే. పాక్ ఆక్రమిత కాశ్మీర్(పీఓకే) ప్రాంతంలో మొదలైన నిరసనలు నెమ్మదిగా ఆ దేశం మొత్తం వ్యాపించాయి. ఆగస్టు 3న పీఓకేలో ప్రారంభమైన నిరసనలు పాకిస్తాన్ లోని ప్రధాన పట్టణాలు, నగరాలకు వ్యాపించాయి. ఇప్పటికే నిత్యావసరాల అధిక ధరలతో అల్లాడుతున్న ఆ దేశ ప్రజలకు ఈ కరెంట్ బిల్లులు మోయలేని భారాన్ని మోపాయి.
దీంతో పాకిస్తాన్ ప్రజలు విద్యుత్ బిల్లులు చెల్లించేది లేదని పెద్ద ఉద్యమానికి పిలుపునిచ్చారు. ప్రజలు వీధుల్లోకి వచ్చి తమ విద్యుత్ బిల్లులను తగలబెడుతున్నారు. కరెంట్ బిల్లులను చెల్లించవద్దని ప్రజలు సోషల్ మీడియాలో కోరుతున్నారు. ఇక పీఓకే ప్రాంతంలోని మసీదుల్లో లౌడ్ స్పీకర్ల ద్వారా బిల్లులు చెల్లించవద్దని పిలుపునిచ్చారు. నిరసనలు తీవ్రం కావడంతో పాకిస్తాన్ తాత్కాలిక ప్రధాని అన్వర్ ఉల్ హక్ కకర్ అత్యవసర సమావేశాన్ని నిర్వహించి 48 గంటల్లో పరిష్కార మార్గాన్ని కనుగొనాల్సిందిగా అధికారులను ఆదేశించారు.
ఆర్థిక కష్టాల్లో ఉన్న 3 బిలియన్ డాలర్ల ఆర్థిక ప్యాకేజీని పొందేందుకు ఐఎంఎఫ్ విధించిన షరతులకు పాకిస్తాన్ లొంగిపోయింది. ఇందులో కరెంట్ బిల్లుల పెంపు కూడా ఉంది. దీంతో ఇప్పటికే ద్రవ్యోల్భణ సమస్యతో అక్కడి ప్రజలు ఇబ్బందులు పడుతుంటే, పెరిగిన కరెంట్ ఛార్జీలు ప్రజలను ఆర్థికంగా దివాళా తీయిస్తున్నాయి. తమ ప్రాంతంలో 4000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి జరుగుతున్నప్పటికీ కోతల నుంచి ఉపశమనం లభించండం లేదని పీఓకే ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Read Also: Allu Arjun: నేషనల్ క్రష్ హర్టవ్వుద్దని అల్లు అర్జున్ కి నేషనల్ అవార్డు ఇచ్చేశారా?
ఆగస్టు 3న ప్రారంభమైన ఈ నిరసనలు పాక్ వ్యాప్తంగా పీఓకే నుంచి ఖైబర్ ఫక్తుంక్వా ప్రాంతం వరకు వ్యాపించాయి. నెలసరి ఆదాయంలో 20-50 శాతం వరకు విద్యుత్ బిల్లులకే పోతుందని ప్రజలు వాపోతున్నారు. కరాచీ, గుజ్రాన్వాలా, నరోవర్, అటాక్, సర్గోదా, హరిపూర్ వంటి నగరాల్లో నిరసనలు మిన్నంటుతున్నాయి.
ఇదిలా ఉంటే పాక్ ప్రజలు సోషల్ మీడియాలో విద్యుత్ బిల్లులను షేర్ చేస్తున్నారు. భారతదేశంలో విద్యుత్ ఛార్జీలతో పోల్చి చూస్తున్నారు. ట్విట్టర్ లో వీటిని షేర్ చేస్తున్నారు. పాకిస్తాన్ లో సగటు ఒక వ్యక్తి 300 యూనిట్లకు 12,000 పాకిస్తాన్ రూపాయలను చెల్లిస్తున్నాడు. ఇదే భారత ప్రజలు కేవలం రూన. 1,300 చెల్లిస్తున్నారని సోషల్ మీడియాలో పోస్టులను వైరల్ చేస్తున్నారు. రూ. 5000 కరెంట్ బిల్లుపై పన్నులు పాకిస్తాన్ లో రూ. 1800 కాగా.. భారత్ లో ఇది రూ. 700 లే అని అక్కడి ప్రజలు పోస్టులు పెడుతున్నారు.
పాకిస్థాన్ వార్షిక ద్రవ్యోల్బణం మేలో ఆల్ టైమ్ గరిష్ట స్థాయి 37.97 శాతానికి చేరుకుంది. ఇక ఆ దేశంలోని లక్షలాది మంది స్కిల్ పుల్ యువత దేశాన్ని వదిలి వెళ్తోంది. డాక్టర్లు, ఇంజనీర్లు, ఐటీ నిపుణులు దేశాన్ని వదిలి వెళ్తున్నారు.