కరోనా రక్కసి కొత్త కొత్త వేరియంట్లతో ప్రజలపై విరుచుకుపడుతోంది. అయితే మొన్నటి వరకు ఒక్క కరోనా కేసు కూడాలేని ఉత్తర కొరియాను కూడా కరోనా మహమ్మారి చుట్టేసింది. ఉత్తర కొరియాలో కరోనా విజృంభన కొనసాగుతోంది. రోజు రోజుకు అక్క జ్వరపీడుతుల సంఖ్య పెరుగుతూ వస్తుంది. అయితే నిన్న ఒక్క రోజులోనే 2 లక్షల పై చిలుకు జ్వరం కేసులు నమోదవడంతో కిమ్ రాజ్యంలో కరోనా కల్లోలం సృష్టిస్తోంది. ఇప్పటికే కరోనా కట్టడికి ఆర్మీని దించే యోచనలో ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ ఉండగా.. ప్రపంచ ఆరోగ్యం సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) మరో కీలక విషయాన్ని ప్రకటించింది. నార్త్ కొరియాలో లక్షలాదిమంది ప్రజలు తీవ్ర జ్వరంతో బాధపడుతున్న వార్తలు తాజాగా వెలుగులోకి రావడంతో సర్వత్ర ఆందోళన వ్యక్తమవుతోంది.
అక్కడి తాజాగా పరిస్థితులపై ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎమర్జెన్సీ డైరెక్టర్ మైక్ ర్యాన్ మాట్లాడుతూ.. కచ్చితంగా ఇది ఆందోళన కలిగించే అంశమేనని ఆందోళన వ్యక్తం చేశారు. కరోనా కట్టడికి అందుబాటులో ఉన్న అన్ని సాధనాలను వాడాల్సిందేనని, వైరస్ ఇలాగే వ్యాప్తి చెందితే కొత్త వేరియంట్లు వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఉత్తరకొరియాలో పరిస్థితులను అదుపు చేసేందుకు అవసరమైన ఔషధాలు, టీకాలు, పరీక్ష సాధనాలు, సాంకేతిక సాయం అందించేందుకు తాము సిద్ధంగా ఉన్నట్టు డబ్ల్యూహెచ్ఓ చీఫ్ టెడ్రోస్ అధనోమ్ వెల్లడించారు. అలాగే, ఐక్యరాజ్య సమితి కూడా నార్త్ కొరియా పరిస్థితులపై ఆందోళన వ్యక్తం చేసింది.