China: చైనా, అమెరికాల మధ్య ఉద్రిక్తతలు పెరిగేలా కనిపిస్తున్నాయి. మరికొన్ని రోజుల్లో ట్రంప్ యూఎస్ అధ్యక్షుడిగా అధికారం చేపట్టే లోపే వాణిజ్య యుద్ధానికి చైనా సిద్ధమైనట్లు తెలుస్తోంది. అమెరికా రక్షణ సంస్థలపై ఆంక్షలను తీవ్రతరం చేయడం ద్వారా చైనా యూఎస్‌కి సవాల్ విసిరింది. ఒక వారం వ్యవధిలోనే చైనా ఈరోజు 10 యూఎస్ కంపెనీలపై సెకండ్ రౌండ్ ఆంక్షలను ప్రకటించింది. తైవాన్‌కి ఆయుధాలు అమ్మడం వల్లే చైనా, యూఎస్ కంపెనీలపై జరిమానాలు, ఆంక్షలు విధించినట్లు తెలుస్తోంది.
Read Also: Maharashtra: చనిపోయాడని డిక్లేర్ చేసి ఆస్పత్రి.. ‘‘స్పీడ్ బ్రేకర్’’ ప్రాణాలను రక్షించింది..
చైనా మొత్తం 45 అమెరికా సంస్థలపై చర్యలు తీసుకుంది. 17 సంస్థలపై ఆంక్షలు విధించగా, 28 సంస్థల ఎగుమతి నిషేధ జాబితాలో చేర్చి జరిమానా విధించింది. ప్రపంచవ్యాప్తంగా అతిపెద్ద రక్షణ తయారీదారుగా ఉన్న బోయింగ్ డిఫెన్స్, లాక్‌హీడ్ మార్టిన్, రేథియాన్, జనరల్ డైనమిక్స్ వాటి అనుబంధ సంస్థలు ఈ జాబితాలో ఉన్నాయి. చైనా వాణిజ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ప్రకటన ప్రకారం… తైవాన్‌కి ఆయుధాలు అమ్మకంలో పాల్గొన్నందున మొత్తం 10 అమెరికన్ సంస్థలు అవిశ్వసనీయ సంస్థల జాబితాలో చేర్చబడ్డాయని పేర్కొంది. ఈ కంపెనీల నుంచి దేశంలోకి దిగుమతి, ఎగుమతులను నిషేధించబడ్డాయని పేర్కొంది. చైనాలో పెట్టుబడులు పెట్టేందుకు వారిని అనుమతించబోమని చెప్పింది. ఆయా కంపెనీల సీనియర్ మేనేజ్మెంట్‌ని దేశంలోకి రాకుండా నిషేధిస్తామని తెలిపింది.
తైవాన్, తమ ‘‘వన్ చైనా’’ విధానంలో భాగమని చైనా వాదిస్తోంది. గత కొంత కాలంగా తైవాన్‌ని స్వాధీనం చేసుకోవాలని అనుకుంటోంది. మరోవైపు తైవాన్‌కి అమెరికా అండగా నిలుస్తోంది. గతేడాది మేలో ప్రజాస్వామ్య ఎన్నికల్లో తైవాన్ అధ్యక్షుడిగా లాయ్ చింగ్ తే అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు సార్లు చైనా సైనిక కసరత్తు నిర్వహించింది. న్యూ ఇయర్ సందర్భంగా జాతిని ఉద్దేశించి ప్రసంగించిన చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్.. తైవాన్‌ని స్వాధీనం చేసుకుంటామని చెప్పకనే చెప్పారు.