US Elections 2024: ఉత్సాహంగా అమెరికా ఓటర్లు కనిపిస్తున్నారు. పోలింగ్ తేదీ కంటే ముందుగానే ఓటు వేసేందుకు కోట్ల మంది యూఎస్ పౌరులు ముందుకు వస్తున్నారు. రేపే (మంగళవారం) పోలింగ్ జరగనుండగా ఇప్పటికే 6.8 కోట్ల మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మరోవైపు అభ్యర్థులు డొనాల్డ్ ట్రంప్, కమలా హారిస్ తమ ప్రచార చివరి అంకంలో ఓటర్లను ఆకట్టుకునేందుకు ట్రై చేస్తున్నారు. ఇక, ముందస్తు ఓటింగ్‌కు ఓటర్లు గతంలో కంటే ఈసారి ఎక్కువగా వస్తుండటంతో పోలింగ్ కేంద్రాలను పెంచాల్సి వచ్చింది. న్యూయార్క్‌లోని 42 బ్రాడ్‌వేలో ఉన్న బోర్డు ఆఫ్ ఎలక్షన్స్ ఆఫీసు ఈ ఏర్పాట్లలో బిజీ అయిపోయింది. బోర్డు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మైఖేల్ ర్యాన్, ఆయన డిప్యూటీ విన్సెంట్ ఇగ్నిజియో ఎన్నికల పనుల్లో స్పీడ్ పెంచారు. ముందస్తు ఓటింగ్‌లో ఇప్పటికే న్యూయార్క్ రికార్డు సృష్టించగా.. అది ఇంకా కొనసాగుతోందని ర్యాన్ వెల్లడించారు. న్యూయార్కే కాదు.. అమెరికా మొత్తం ఇదే ట్రెండ్ నడుస్తుంది. మెయిల్స్, పోలింగ్ కేంద్రాల ద్వారా వారంతా ఓట్లు వేస్తున్నారు.
Read Also: TheRajaSaab : రెబల్ స్టార్ ప్రభాస్ ‘అన్ స్టాపబుల్’
ఇక, గత ఎన్నికల్లో న్యూయార్క్‌లో ముందస్తు పోలింగ్ కేంద్రాలను 100 ఏర్పాటు చేయగా.. ఈసారి 50 శాతం అధికంగా ఏర్పాటు చేశారు. అయితే, అసాధారణ వాతావరణ పరిస్థితులు, పోలింగ్ రోజున భారీ క్యూలతో ప్రజల ఇబ్బందులు, ఎన్నికల రోజున గొడవలు.. ముందస్తు ఓటింగ్‌కు కారణాలుగా అక్కడి అధికారులు భావిస్తున్నారు. మరోవైపు అభ్యర్థుల ప్రచారం ముగింపు దశకు చేరుకుంది. రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్.. తనకు అనుకూలమైన నార్త్ కరోలినాలో మకాం వేశారు. డెమోక్రటిక్ అభ్యర్థి కమలా హారిస్ వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. రేపటి (మంగళవారం) వరకూ నార్త్ కరోలినాలో ఉండి ర్యాలీలు నిర్వహించాలని ట్రంప్ నిర్ణయం తీసుకున్నారు. 2016, 2020లలో తనకు మద్దతుగా నిలిచిన ఈ రాష్ట్రంపై ఆయన ఎక్కువగా నజర్ పెట్టారు.
Read Also: Khalistanis Attacked Hindus: కెనడాలో హిందూ భక్తులపై ఖలిస్తానీల దాడి.. ఖండించిన ట్రూడో
అలాగే, న్యూమెక్సికో, వర్జీనియాలనూ సైతం డొనాల్డ్ ట్రంప్ సీరియస్‌గా తీసుకున్నారు. నార్త్ కరోలినాలోని గ్యాస్తోనియా, ఛార్లెట్, గ్రీన్స్‌బరోల్లో శనివారం ప్రచారం నిర్వహించారు. ఆదివారం కింగ్‌స్టన్‌లో ప్రచారం చేయగా.. ఈరోజు (సోమవారం) రాలేగ్‌లో నిర్వహించే ప్రచారంలో ఆయన పాల్గొంటారు. దీంతో నార్త్ కరోలినాలోనే అక్టోబరు 1 నుంచి ఆయన 9 ర్యాలీలు నిర్వహించారు. ఉపాధ్యక్ష అభ్యర్థి జేడీ వాన్స్ 6సార్లు ఈ రాష్ట్రంలో పర్యటించారు. కమలా హారిస్ కూడా శనివారం నార్త్ కరోలినాలోని ఛార్లెట్‌లో ప్రచారం చేయగా.. ఇవాళ తన భర్త డగ్ ఎంహాఫ్‌ను గ్రీన్‌విల్లేకు పంపబోతున్నారు. తుఫాన్ కారణంగా నార్త్ కరోలినా పశ్చిమ ప్రాంతంలో తీవ్ర నష్టం జరిగింది. దీంతో ఈ ప్రాంత ఓటర్లు ఎటు వైపు మొగ్గుతారనే దానిపై సందిగ్ధత నెలకొంది. శుక్రవారం నాటికి నార్త్ కరోలినాలో 78 లక్షలమంది ఓటు వేశారు.