India’s strong response to Islamic countries comments On jammu kashmir: భారత్ ఎన్నిసార్లు చెప్పినా.. ఇస్లామిక్ దేశాల సమూహం ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్ (ఓఐసీ) తన వక్రబుద్ధిని మానుకోవడం లేదు. పదేపదే భారత అంతర్గత విషయం అయిన జమ్మూ కాశ్మీర్ అంశంపై వ్యాఖ్యలు చేస్తూనే ఉంది. తాజాగా ఐక్యరాజ్యసమితిలో ఓఐసీ చేసిన వ్యాఖ్యలకు భారత్ ఘాటుగానే సమాధానం ఇచ్చింది. ఇస్లామిక్ దేశాలు చేస్తున్న ఆరోపణలు వాస్తవానికి దూరంగా ఉన్నాయని.. అనవసరమైన సూచనలని కొట్టి పారిసేంది ఇండియా. పాకిస్తాన్ ద్వేషపూరిత ప్రచారానికి పాల్పడుతోందని యూఎన్ లో భారత్ ఆగ్రహం వ్యక్తం చేసింది.
పాకిస్తాన్ ముందుగా సొంతింటిని చక్కదిద్దుకుంటే మంచిదని భారత్ హితవు పలికింది. పాకిస్తాన్ తో పాటు ఓఐసీలో 57 ముస్లిం దేశాలు సభ్యులుగా ఉన్నాయి. యూఎన్ఓలో ఓఐసీ అనవరస వ్యాఖ్యలు చేసింది. కాశ్మీర్ స్థితిని మార్చేందుకు భారత్ ఏకపక్ష చర్యలు తీసుకుంటుందని.. భారత్ కాశ్మీర్ లో జనాభాను మార్చేందుకు ప్రయత్నిస్తోందని వ్యాఖ్యానించింది. భారత వ్యతిరేక ప్రచారాన్ని ప్రారంభించేందుకు ఓఐసీని పాకిస్తాన్ వేదికగా ఉపయోగించుకుంటుందని భారత్ ఆరోపించింది.
Read Also: Bhutan King: ప్రధాని మోదీతో భూటాన్ రాజు జిగ్మే ఖేసర్ నామ్‌గేల్ వాంగ్‌చుక్ భేటీ
పాకిస్తాన్.. ప్రజల మానవహక్కులను కాపాడటంతో అధ్వాన్నమైన రికార్డ్ కలిగి ఉందని భారత్ ఘాటుగా స్పందించింది. బంగ్లాదేశ్ విభజనకు ముందు తూర్పు పాకిస్తాన్ (ఇప్పటి బంగ్లాదేశ్)లో పాకిస్తాన్ మారణహోమం సిగ్గుమాలిన చర్య అని గతాన్ని గుర్తు చేసింది. పాకిస్తాన్ మైనారిటీలను అణచి వేస్తుందని.. బలూచిస్తాన్ లో ప్రజల్ని దారుణంగా అణచివేస్తోందని భారత్ విమర్శించింది.
జమ్మూ కాశ్మీర్ ప్రాంతానికి ఉన్న ప్రత్యేక ప్రతిపత్తిని భారత్ రద్దు చేసినప్పటి నుంచి ఓఐసీ ఇలాగే భారత్ వైఖరిని విమర్శిస్తోంది. పాకిస్తాన్ చెప్పినట్లు ఇస్లామిక్ దేశాలు ఆడుతున్నాయి. గతంలో కూడా ఓఐసీ ఆర్టికల్ 370, 35 ఏ రద్దు సమయంలో ఇలాంటి వ్యాఖ్యలనే ఓఐసీ చేసింది. ఇది భారత అంతర్గత విషయం అని చాలా సార్లు ఓఐసీకి భారత్ చెప్పింది. అయినా కూడా పదేపదే కాశ్మీర్ అంశంపై ఏదో ఒక వ్యాఖ్యలు చేస్తూనే ఉంటుంది ఓఐసీ. గతంలో కాశ్మీర్ అంశంపై ఓఐసీ ‘‘ చట్టవిరుద్ధమైన ఏకపక్ష చర్య’’ అని ఆరోపించింది. యూఎన్ తీర్మాణాలకు అనుగుణంగా ఈ సమస్యను పరిష్కరించాలని అంతర్జాతీయ సమాజానికి పిలుపునిచ్చింది. దీన్ని ఆ సమయంలో భారత్ తీవ్రంగా ఖండించింది. ఒక దేశానికి అనుగుణంగా మతపరమైన ఎజెండాను ప్రచారం చేయడాన్ని ఓఐసీ మానుకోవాలని భారత్ హితవు పలికింది.