Nikki Haley: 2024 అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో నిలిచిన ఇండో-అమెరికన్ నేత నిక్కీ హేలీ సంచలన వ్యాఖ్యలు చేశారు. భారతదేశం అమెరికాతో భాగస్వామిగా ఉండాలని అనుకుంటోందని అయితే, ప్రస్తుతం అమెరికా ప్రపంచానికి నాయకత్వం వహిస్తుందని భారత్ విశ్వసించడం లేదని ఆమె అన్నారు. ప్రస్తుతం భారత్ అమెరికాను బలహీనంగా చూస్తోందని, ప్రస్తుతం ప్రపంచ పరిస్థితుల్లో భారత్ తెలివిగా ఆట ఆడుతోందని, రష్యాతో సన్నిహితంగా ఉంటోందని ఆమె అన్నారు.
ఫాక్స్ బిజినెస్ న్యూస్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో నిక్కీహేలీ మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. నేను మోడీతో మాట్లాడాను, భారత్ మాతో భాగస్వామిగా ఉండాలని కోరుకుంటోంది, అదే విధంగా రష్యాతో స్నేహంగా ఉండేందుకు ఇష్టపడుతోంది, దీనికి ఆ దేశం నుంచే భారత్ ఎక్కువగా మిలిటరీ పరికరాలు ఉండటమే అని ఆమె అభిప్రాయపడ్డారు.చైనా ఆర్థికంగా బాగా లేదని, అమెరికాతో యుద్ధానికి సిద్ధమవుతోందని నిక్కీ హేలీ అన్నారు.
అమెరికా మళ్లీ నాయకత్వం వహించడం ప్రారంభించినప్పుడు, బలహీనతల నుంచి బయటపడటం ప్రారంభించినప్పుడు మన స్నేహితులు భారతదేశం, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఇజ్రాయెల్, జపాన్, దక్షిణ కొరియా మనతో ఉంటారని అన్నారు. చైనాపై తక్కువ ఆధారపడేందుకు భారత్, జపాన్ దేశాలు తమకు తాము అనేక ఉద్దీపణలు ఇచ్చుకున్నాయని, భారత్‌తో మనం పొత్తును నిర్మించాల్సిన అవసరం ఉందని ఆమె అన్నారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ తరుపున అభ్యర్థిత్వాన్ని దక్కించుకునేందుకు నిక్కీ హేలీ పోటీ పడుతున్నారు. ట్రంప్ కూడా ఇదే పార్టీ నుంచి తొలిస్థానంలో ఉన్నారు.