White Paper on Economy:అధికార బీజేపీ, కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు చేస్తోంది. ఇప్పటికే లోక్‌సభ, రాజ్యసభల్లో ప్రధాని మోడీ కాంగ్రెస్ తీరుపై సంచలన విమర్శలు చేశారు. తాజాగా గురువారం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ భారత ఆర్థిక వ్యవస్థపై శ్వేతపత్రం ప్రవేశపెట్టారు. యూపీఏ ప్రభుత్వం, ఎన్డీయే ప్రభుత్వ పనితీరును పోల్చారు. 2004లో ఆరోగ్యకరమైన ఆర్థిక వ్యవస్థ వారసత్వంగా యూపీఏ ప్రభుత్వానికి వచ్చిందని, 2014లో తాము అధికారం చేపట్టిన తర్వాత ఎదురైన సంక్షోభాలను డాక్యుమెంట్‌లో ఆమె ప్రస్తావించారు.
Read Also: Amit Shah: కేంద్రం కీలక నిర్ణయం.. మయన్మార్‌కు రాకపోకలు బంద్
2014లో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సమయంలో దేశ ఆర్థిక వ్యవస్థ దుర్భలమైన స్థితిలో ఉందని, ప్రభుత్వం ఆర్థిక పరిస్థితి అధ్వానంగా ఉందని, ఆర్థిక దుర్వినియోగం, ఆర్థిక క్రమశిక్షణారాహిత్యం ఉందని, ఇది సంక్షోభ పరిస్థితి అని శ్వేతపత్రంలో పేర్కొన్నారు. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి వేసిన బలమైన ఆర్థిక పునాదులను, సంస్కరణల వేగాన్ని వినియోగించుకోవడంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ విఫలమైందని, దశాబ్ధ కాలాన్ని ఉపయోగించుకోలేదని ఆరోపించింది. యూపీఏ ప్రభుత్వంలో నాయకత్వ సంక్షోభం ఉందని, ప్రభుత్వం జారీ చేసిన ఆర్డినెన్స్‌ని చింపివేయడం సిగ్గుచేటని శ్వేతపత్రం ఆరోపించింది.
యూపీఏ అధికారం చేపట్టినప్పుడు భారత్ వృద్ధి రేటు 8 శాతం ఉందని, 1991 ఆర్థిక సంస్కరణల క్రెడిట్ తీసుకోవడంలో విఫలమైన యూపీఏ నాయకత్వం, 2004లో వాటిని పూర్తిగా విడిచిపెట్టిందని శ్వేతపత్రంలో బీజేపీ ఆరోపించింది. యూపీఏ ప్రభుత్వ హయాంలో రెండంకెల ద్రవ్యోల్భణం, ప్రభుత్వ ఆర్థిక నిర్వహాణా లోపాలను, విదేశీ మారకద్రవ్య సంక్షోభాలతో పాటు ఇతర వైఫల్యాలను శ్వేతపత్రం హైలెట్ చేసింది. 2004-2014 మధ్య సగటు వార్షిక ద్రవ్యోల్బణం రేటు దాదాపు 8.2% అని శ్వేతపత్రం పేర్కొంది, అధిక ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడానికి UPA ఏమీ చేయలేదని ఆరోపించింది.
యూపీఏ హయాంలో కామన్వెల్త్, 2జీ కుంభకోణాలను కలిగి ఉందని, ఎన్డీయే ప్రభుత్వం 4 జీ ద్వారా ప్రజలు విస్తృత కవరేజీ అందిస్తోందని, జీ20 వంటి సమావేశాలను అత్యుత్తమంగా నిర్వహించినట్లు స్వేతపత్రంలతో పేర్కొన్నారు. ప్రస్తుతం భారత్ 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉందని, త్వరలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని చెప్పింది. ఇండియా వద్ద రికార్డు స్థాయిలో 620 బిలియన్ డాలర్ల విదేశీ మారక నిల్వలు ఉన్నాయని తెలిపింది.