అంతర్జాతీయ సినిమా రంగంలో ఆస్కార్ అవార్డులకు చాలా ప్రాధాన్యత ఉంటుంది. ఇదే తరహాలో కేన్స్ ఫిలిం ఫెస్టివల్‌లో ప్రదర్శితమయ్యే చిత్రాలకు కూడా అంతే గుర్తింపు ఉంటుంది. ఫ్రాన్స్‌లోని కేన్స్‌లో ఈ నెల 17 నుంచి 28 వరకు చలన చిత్రోత్సవాలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో నిర్వాహకులు కీలక నిర్ణయం తీసుకున్నారు. 75 వసంతాల స్వతంత్ర భారత్‌కు కేన్స్ ఫిలిం ఫెస్టివల్ మార్కెట్‌లో అధికారిక దేశం హోదా కల్పించారు. దీంతో ఇండియాకు అరుదైన గౌరవం దక్కినట్లు అయ్యింది.
కాగా కేన్స్ ఫిలిం ఫెస్టివల్ కూడా 75 వసంతాల వేడుక జరుపుకుంటోంది. ఈ ఏడాది జరిగే కేన్స్ ఫిలిం ఫెస్టివల్‌లో భారతీయ దిగ్గజ దర్శకుడు సత్యజిత్ రే తెరకెక్కించిన ప్రతిధ్వని చిత్రాన్ని ప్రత్యేకంగా ప్రదర్శించనున్నారు. ఈ మూవీని అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా 4కే టెక్నాలజీకి అనుగుణంగా మారుస్తున్నారు. మరో ఇండియన్ మూవీ థాంప్ అనే సినిమాను కూడా ఈ ఫిలిం ఫెస్టివల్‌లో ప్రదర్శించనున్నారు. ఈ చిత్రానికి అరవిందన్ గోవిందన్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలతో పాటు హాలీవుడ్ క్లాసిక్ మూవీ సింగిన్ ద రెయిన్ మూవీని కూడా కేన్స్ ఫిలిం ఫెస్టివల్‌లో ప్రదర్శించనున్నారు. అటు బాలీవుడ్ భామ దీపిక పదుకునేకు అరుదైన గౌరవం లభించింది. కేన్స్ ఫిలిం ఫెస్టివల్ కాంపిటీషన్ జ్యూరీలో దీపికా పదుకునే సభ్యురాలిగా నియమితులైంది.