Joe Biden: హమాస్ ఉగ్రవాదుల దురాగతాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. చిన్న పిల్లలు, వృద్ధులు, మహిళలు అని చూడకుండా అత్యంత కిరాతకంగా హత్యలు చేశారు. ఒకే ప్రాంతంలో 40 మంది పిల్లల తలలను తెగనరికారు. ఈ క్రూరమైన దాడితో ఇజ్రాయిల్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తోంది. హమాస్‌ని లేకుండా చేసేందుకు పావులు కదుపుతోంది. ఇదిలా ఉంటే ఈ దాడిపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
Read Also: Israel-Hamas War: అప్పటి వరకు కుళాయి నీరు రాదు, కరెంట్ ఆన్ కాదు.. హమాస్‌కి ఇజ్రాయిల్ వార్నింగ్..
ఈ క్రూరమైన దాడిని, పిల్లల తలలు నరికేసే చిత్రాలను జీవితంలో ఎన్నడూ ఊహించలేదని ఆయన వ్యాఖ్యానించారు. హోలోకాస్ట్ తర్వాత యూదులకు ‘ప్రాణాంతక రోజు’గా ఆయన అభివర్ణించారు. చరిత్రలో యూదులకు వ్యతిరేకంగా జరిగిన మారణహోమాన్ని మళ్లీ గుర్తు చేసిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. హమాస్ ఉగ్రవాదులు, ఐసిస్ కన్నా అత్యంత దారుణాలకు తెలబడ్డారని బైడెన్ అన్నారు.
అయితే బైడెన్ ఈ చిత్రాలను నేరుగా చూడలేదని, ఇజ్రాయిల్ ప్రధాని బెంజిమిన్ నెతన్యాహు అధికార ప్రతినిధి చేసిన ప్రకటనల ఆధారంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారని వైట్ హౌజ్ తెలిపింది. హమాస్ దాడుల్లో ఇప్పటి వరకు 22 మంది అమెరికన్లు ప్రాణాలు కోల్పోయారని, మరో 17 మంది ఆచూకీ తెలియాల్సి ఉందని వైట్ హౌజ్ బుధవారం ప్రకటించింది. రాబోయే రోజుల్లో ఈ సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉందని యూఎస్ జాతీయ భద్రతా సలహాదారు జాక్ సలీవన్ తెలిపారు.