కొన్ని వారాలుగా జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబాన్ ప్రభుత్వం కుదురుకోవటం పక్కా. అమెరికా , నాటో దళాలకు చెందిన ఆఖరు సైనికుడూ ఆఫ్గన్‌ని వీడాడు. ఇక వారికి ఎదురు లేదు. అయితే ఇది అంతర్జాతీయంగా ఎలాంటి ప్రభావం చూపుతుందో ఇప్పుడే తెలియదు. కానీ మన విషయం చూసుకుంటే కాశ్మీర్లో తాలిబాన్ల ప్రభావం ఉంటుందా అన్నది ప్రశ్న. కశ్మీర్ లోయకు తాలిబాన్లను మళ్లిస్తారా…లేదా అన్నది మరో పెద్ద క్వశ్చన్ మార్క్. ఒక వేళ అదే జరిగితే ఇప్పటికే ధ్వంసమైన కశ్మీర్‌లో అత్యంత ప్రమాదకరమైన పరిణామాలకు ఆస్కారం ఉంటుంది. కాబట్టి తాలిబాన్ మిలిటెంట్లు కాశ్మీర్ వ్యాలీలోకి చొరబడి ..మిలిటెన్సీ కార్యకాలాపాలకు పాల్పడే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయనే దానిని ఇప్పుడు పరిశీలించాల్సి వుంటుంది.
అధికారికంగా కశ్మీర్ పై తాలిబాన్ల వైఖరి స్పష్టంగా ఉంది. అది పాకిస్తాన్ భారత్ ద్వైపాక్షిక చర్చల ద్వారా తేల్చుకోవాల్సిన అంశమని ఇప్పటికే స్పష్టం చేసింది. అందులో తాలిబాన్ కు ఎలాంటి పాత్ర ఉండబోదంది. కానీ అది పాకిస్తాన్ చెప్పినట్టు ఆడే ఇస్లామిక్ టెర్రర్ గ్రూప్. ఐఎస్‌ఐ , పాక్ ప్రభుత్వం, పాక్ ఆర్మీలు తాలిబాన్‌ను కంట్రోల్ చేస్తున్నాయన్నది ఓపెన్ సీక్రెట్. అందుకే తాలిబాన్లు కశ్మీర్‌లో చొరబడే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయన్నది కొందరి వాదన. భౌగోళికంగా కశ్మీర్-ఆఫ్ఘనిస్తాన్ మధ్య సామీప్యత కూడా ఈ భయాలకు ఓ కారణం. అంతేకాదు పాస్తూన్ మిలిటెంట్లను కశ్మీర్ లోయకు పంపిన చరిత్ర ఆధునిక ఆఫ్గనిస్తాన్ కు ఉందన్న సంగతి మర్చిపోవద్దు.
90వ దశకం ప్రారంభం నుంచి కశ్మీర్ లోయలో తీవ్రవాదం మొదలైంది. అప్పుడు తాలిబాన్లు కనీసం పుట్టను కూడా పుట్టలేదు. ఆఫ్ఘన్ ముజాహిదీన్ గ్రూప్‌ల మధ్య తీవ్ర స్థాయిలో అంతర్యుద్ధం జరుగుతున్న కాలమది. సోవియట్ యూనియన్ నిష్క్రమణ తరువాత అధికారం కోసం జరిగిన ఆధిపత్యత పోరాటం అది. ఆ సమయంలో పాకిస్తాన్ ఐఎస్‌ఐ ఆఫ్గన్ ముజాహిదీన్లను కాశ్మీర్‌కు పంపించింది. 1993 నాటికి గులాబుద్దీన్ హెక్మత్యార్ గ్రూపైన హెజ్బ్-ఇ-ఇస్లామీకి చెందిన దాదాపు 400 మంది కాశ్మీర్ లోయలో ఉన్నారు. తరువాత ఆ సంఖ్య ఇంకా పెరిగింది.
కశ్మీర్ తీవ్రవాదం తొలి రెండు దశాబ్దాలలో దాదాపు 16 వేల మంది మిలిటెంట్లు హతమయ్యారు. వారిలో మూడు వేల మంది విదేశీ మూలాలు గల ఆఫ్గన్ ముజాహిదీన్లు, పాకిస్తాన్ పంజాబీలు. కాశ్మీర్లో సాధారణ పరిస్థితులు నెలకొనటానికి దాదాపు పాతికేళ్లు పట్టింది. విదేశీ మిలెటెన్సీ భాగస్వామ్యాన్ని పాకిస్తానీ పంజాబీ మిలిటెంట్ సంస్థలు లష్కర్ ఏ తోయిబా, జైషే మహమ్మద్ తీసుకున్నాయి.
కాశ్మీర్లో 90ల నాటి పరిస్థితి ఇప్పుడు పునరావృతమవుతుందా? అంటే.. సమాధానం కష్టమే. కానీ తాలిబాన్ మిలిటెంట్లు కాశ్మీరులోకి చొరబడటం ఇప్పుడు అంత సులభం కాదు. ఒక వేళ కొందరు ఎలాగోలా వచ్చినా పెద్దగా నష్టం కలిగించలేరు. అందుకు బలమైన కారణాలే ఉన్నాయి. మొదటిది ఇప్పుడు మనం చూస్తున్న కాశ్మీర్ 1990ల నాటి కాశ్మీర్ కాదు. రక్షణ సంసిద్ధత, కాశ్మీర్ వ్యాలీలో సామాజిక పరిస్థితుల నిర్వహణలో అప్పటికి ఇప్పటికీ చాలా తేడా వుంది. అడ్వాన్స్‌డ్ టెక్నలాజికల్ సిస్టమ్స్ తో నియంత్రణ రేఖతో పాటు మొత్తం వ్యాలీపై నిరంతరం నిఘా ఉంది. డేగ కన్నుతో శతృవుని కనిపెడుతున్నాం. నైట్ విజన్ కెమెరాలు. శాటిలైట్ డ్రోన్స్ అందుబాటులో ఉన్నాయి. అందుకే ఇప్పుడు కశ్మీర్‌లోకి చొరబాటు అత్యంత సాహంతో కూడినది.
మరోవైపు, మూడు దశాబ్దాల పాటు కశ్మీర్‌లో నిర్విరామంగా మారణహోమం సాగింది. విధ్వంసాలతో పాటు తీవ్ర ఆర్థిక నష్టం..ఇవన్నీ చూసి సగటు కశ్మీరీ అలసిపోయాడు. ఇన్నేళ్ల పోరాటంతో సాధించింది ఏమీలేదని వారికి అర్థమైంది. త్రీ సెవెంటీ ఆర్టికల్ రద్దు తరువాత మిలిటెంట్లు ఏమీ చేయలేరని పూర్తిగా గ్రహింపుకు వచ్చింది వారికి .
ఇన్నేళ్ల సాయుధ పోరాటంలో సాధించిందేమీ లేకపోగా కాశ్మీర్ సామాజిక చిత్రం ఛిద్రమైంది. వేలాది మంది కశ్మీరీ పండిట్లు బలవంతంగా లోయ నుంచి వెళ్లిపోయారు. మత తీవ్రవాదం పెరిగింది. చట్టాలు నిర్వీర్యమయ్యాయి. ఫలితంగా డ్రగ్స్, క్రైమ్ రేట్ పెరిగిపోయింది. కాశ్మీర్ ప్రజలు ఇప్పుడు మళ్లీ అదే కోరుకుంటారని అనుకోలేము. కానీ ఇప్పటికీ తాలిబాన్ల నుంచి మనకు ముప్పు పొంచివుంది. తాలిబాన్లు కాశ్మీర్లోకి మిలిటెంట్లను భౌతికంగా పంపలేకపోవచ్చు. కానీ వారి ఐడియాలజీనీ కశ్మీరీల బుర్రలోకి ఎక్కించటం సులభమే. గత తరం కాశ్మీరీలు చేసిన పోరాటాలను పునరుద్ధరించేలా నేటి యువతను తప్పుదోవ పట్టించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఆఫ్గనిస్తాన్‌లో తాలిబాన్ల విజయం యువ కాశ్మీరీలపై బలమైన ప్రభావం చూపే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.
మరోవైపు, ఆఫ్గన్ పగ్గాలు తిరిగి తాలిబన్ల చేతికి చిక్కటం అక్కడి ఉగ్రతండాల్లో ఉత్సాహం పెల్లుబుకుతోంది. ముఖ్యంగా, చచ్చిన పాములుగా పడున్న అల్ ఖైదా మళ్లీ మళ్లీ కోరలు చాస్తోంది. అమెరికా, నాటో దళాలల నిష్క్రమణతో చీకట్లోంచి బయటికొచ్చి ఊపిరిపీల్చుకుంది అల్‌ఖైదా. తాలిబాన్ నేతలకు శుభాకాంక్షలు తెలిపింది. అమెరికాపై స్వాతంత్ర్య పోరాటంలో గెలిచినందుకు తాలిబాన్ నేతలను అభినందించింది. అయితే అల్‌ఖైదా అంతటితో ఆగలేదు, కశ్మీర్ తో పాటు ప్రపంచవ్యాప్తంగా ఇస్లాం శత్రువుల చేతుల్లో ఉన్న ప్రాంతాలకూ విముక్తి కల్పించాలని పిలుపునిచ్చింది. కశ్మీర్‌ను ప్రత్యేకంగా ప్రస్తావించటంతో దాని నెక్స్ట్ టార్గెట్స్ ఏమిటన్నది అర్థమవుతోంది.
2001లో తాలిబాన్ల పాలన అంతమైన తరువాత ఆఫ్గనిస్తాన్‌లో భారత్ వంటి దేశాలు భారీగా పెట్టుబడులు పెట్టాయి. మౌలిక సదుపాయాలు అభినృద్ధి చేశాయి. ఈ నేపథ్యంలో తాలిబాన్లు అంత ఈజీగా భారత్ జోలికి రారు. కానీ అల్‌ఖైదా వారిని కవ్విస్తుంది. తాలిబన్లను రెచ్చగొట్టేందుకే అల్ ఖైదా ఇలాంటి ప్రకటనలు చేస్తున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రస్తుతం మారిన పరిస్దితుల్లో తాలిబన్లు అంతర్జాతీయంగా మద్దతు కూడగట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. అదే జరిగితే తాలిబన్ ప్రభుత్వానికీ, ఆయా దేశాలకూ మధ్య సంబంధాలు కూడా మెరుగుపడతాయి. అది అల్ ఖైదాకు ఇష్టం లేదు. అలా జరిగితే అల్ ఖైదా ప్రాబల్యం బాగా తగ్గుతుంది. దాంతో తాజా పరిస్థితులను క్యాష్ చేసుకుని అప్ఘన్ ని తిరిగి ఉగ్ర అడ్డాగా చేయాలన్నదే దాని ప్లాన్.
తాజాగా తాలిబాన్ ప్రతినిధి ఒకరు జమ్ముకశ్మీర్ పై కీలక ప్రకటన చేశారు. కశ్మీర్ ముస్లింల కోసం గళం వినిపించే హక్కు తమకు ఉందని తాలిబాన్ ప్రతినిధి సుహైల్ షాహీన్ ఇటీవల ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. అమెరికాతో జరిగిన దోహా ఒప్పందం గురించి మాట్లాడుతూ.. ఏ దేశానికి వ్యతిరేకంగానైనా సాయుధ ఆపరేషన్లు నిర్వహించడం తమ విధానంలో భాగం కాదన్నారు. ఒక ముస్లింగా భారత్‌లోని కశ్మీర్ లేదా ఇతర దేశాల్లో ఉంటున్న ముస్లింల కోసం గళం వినిపించే హక్కు మాకు ఉందన్నాడాయన.
ఇండియా కొంత కాలంగా వరల్డ్ మీడియా హెడ్‌లైన్లలో నిలుస్తోంది. 2014 లో మోడీ పాలన మొదలైనప్పటి నుంచి అనేక కారణాలతో భారత్ పతాక శీర్షికల్లో నిలుస్తోంది. ముస్లింలపై విద్వేషాలు పెరిగాయని విమర్శలు వినిపిస్తున్నాయి. బీజేపీ వాటిని ఎప్పటికప్పుడు కొట్టిపారేస్తూనే ఉంది.
370 ఆర్టికల్ రద్దు తర్వాత కశ్మీరీలు ఆగ్రహంతో ఉన్నారు. గత నాలుగు దశాబ్దాలుగా ఇండియా-పాకిస్తాన్ మధ్య కశ్మీర్ అంశమే సింగిల్ పాయింట్ ఎజెండా. ఇప్పుడు పాకిస్తాన్ పెంచి పోషించిన తాలిబాన్లు అఫ్గానిస్తాన్‌లో అధికారం హస్తగతం చేసుకోవటం భారత్‌కు ఓ వైపు ఆందోళన కలిగిస్తోంది. దాని దృష్టి జమ్ము కశ్మీర్ మీద పడవచ్చని, వారికి పాకిస్తాన్‌లోని భారత వ్యతిరేక శక్తుల మద్దతు లభించవచ్చన్నదే భారత్ భయం.
తాజాగా జరిగిన ఓ పాకిస్తాన్ టీవీ డిబేట్‌లో పాకిస్తాన్ అధికార పార్టీ పీటీఐ ప్రతినిధి నీలమ్ ఇర్షాద్ షేఖ్ తాలిబాన్లు మాకు అండగా ఉన్నారు, కశ్మీర్ విముక్తి కోసం కోసం వారు మాకు సాయం చేస్తారనటం పాక్ ధీమా ఏంటో ప్రపంచానికి అర్థమవుతోంది. పాకిస్తాన్ ఆర్మీ, ఇంటిలిజెన్స్ ఏజెన్సీలతో తాలిబాన్‌కు ఉన్న సాన్నిహిత్యం గురించి కూడా ప్రపంచానికి తెలుసు. ఇప్పుడు తాలిబాన్‌లు పాకిస్తాన్‌ను తమ మరో ఇల్లులా చెబుతున్నారు. చైనా కూడా తాలిబాన్‌కు అండగా నిలిచింది. మరోవైపు అమెరికా అక్కడ నుంచి బయటపడింది. దీంతో ఇప్పుడు భారత్ ఎటూ తేల్చుకోలేని స్థితిలో ఉంది. భారత్‌లో ఇస్లామిక్ తీవ్రవాదానికి అఫ్గానిస్తాన్ సాయం చేయడం మొదలవుతుందేమోనని బారత్ ఆందోళన చెందుతోంది.
అయితే ఈ సమయంలోనే భారత్ జాగ్రత్తగా అడుగులు వేయాల్సి వుంది. ఎలాంటి తొందరపాటు చర్యలకు వెల్లకూడదు. ప్రస్తుతానికి జరుగుతున్న పరిణామాలను మౌనంగా వీక్షించిటమే మేలని ఫారిన్ ఎక్స్‌పర్ట్స్ భావిస్తున్నారు. ఆఫ్గనిస్తాన్‌లో తాలిబాన్ల ప్రభుత్వం స్థిరపడితే కాని అది ఎటువైపు అడుగులు వేస్తుందో ప్రపంచానికి అర్థంకాదు. అప్పటి వరకు చూస్తూ ఉండటం తప్ప చేసేదేమీ లేదు!!