గత కొద్దీ రోజుల నుంచి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆరోగ్యంపై పలు రకాల వార్తలు వినిపిస్తున్నాయి. ఆయన నయం చేయలేని వ్యాధి బారిన పడ్డారని, అందుకే చికిత్స తీసుకుంటున్నారని కొందరు బాహాటంగానే వెల్లడిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆ వార్తలకు బలం చేకూర్చే విధంగా పుతిన్ ఆరోగ్య పరిస్థితిపై బ్రిటన్ మాజీ గూఢచారి క్రిస్టఫర్ స్టీల్ కీలక వ్యాఖ్యలు చేశారు. వ్లాదిమిర్ పుతిన్ బ్లడ్ కేన్సర్‌తో బాధపడుతున్నారని ఓ మేగజీన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో బ్రిటన్ మాజీ గూఢచారి క్రిస్టఫర్ స్టీల్ పేర్కొన్నారు. ఆయన ఆరోగ్య సమస్య ఏంటనేది ఖచ్చితంగా తెలియదన్న క్రిస్టఫర్ స్టీల్.. అది నయమయ్యేదో, కాదో కూడా తెలియదన్నారు.
దీంతో పుతిన్ ఆరోగ్యంపై క్రిస్టఫర్ స్టీల్ చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి. అంతేకాకుండా.. తనకు వస్తున్న విశ్వసనీయ సమాచారం ప్రకారం.. పుతిన్ తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్నారని ఆయన అన్నారు. ఈయనే కాకుండా రష్యా కుబేరుడు కూడా ఒకరు ఈ విషయాన్ని ధ్రువీకరించారు. ఉక్రెయిన్‌పై యుద్ధ ప్రకటనకు ముందే ఆయనకు కేన్సర్ చికిత్సలో భాగంగా వెన్నుకు ఆపరేషన్ జరిగిందని వివరించారు. పుతిన్‌తో తనకు సన్నిహిత సంబంధం ఉందని, ఆయన తీసుకున్న ఓ పిచ్చి నిర్ణయంతో ప్రపంచం మొత్తం ఇబ్బంది పడుతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.