Bangladesh: ఎప్పుడైతే బంగ్లాదేశ్‌లో షేక్ హసీనా ప్రధాని పదవికి రాజీనామా చేసి, ఆగస్టు 05న భారత్ పారిపోయి వచ్చిందో అప్పటి నుంచి ఆ దేశం క్రమంగా పాకిస్తాన్ జిరాక్స్ కాపీలా మారుతోంది. ఒక విధంగా చెప్పాలంటే పాకిస్తాన్‌కి మించి అక్కడ ఇస్లామిక్ రాడికల్ శక్తులు ఎదుగుతున్నాయి. పాకిస్తాన్ ప్రేమికులుగా పేరున్న బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ(బీఎన్పీ)తో పాటు రాడికల్ ఇస్లామిక్ శక్తులైన జమాతే ఇస్లామీ, అన్సరుల్లా బంగ్లా వంటి శక్తులు ఆడిండే ఆటగా అక్కడ పాలన సాగుతోంది.
ఈ శక్తుల చేతిలో తాత్కాలిక ప్రభుత్వాధినేత మహ్మద్ యూనస్ కీలుబొమ్మగా మారాడు. ఇదిలా ఉంటే, తాజాగా యూనస్ ప్రభుత్వం మరో వివాదాస్పద నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం ఇటు భారత్‌తో పాటు అమెరికాకు ముప్పుగా భావిస్తు్న్నారు. అల్‌ఖైదాతో సంబంధం ఉన్న బంగ్లాదేశ్ ఆర్మీ నుంచి తీసేసిన మేజర్ సయ్యద్ జిలా ఉల్ హక్‌ని నిర్దోషిగా ప్రకటించే ప్రక్రియ ప్రారంభించినట్లు తెలుస్తోంది. గతంలో అమెరికా ఒత్తిడి మేరకు హక్‌ని బంగ్లాదేశ్ ఆర్మీ నుంచి తొలగించారు.
Read Also: Tejashwi Yadav: ఇండియా కూటమి కేవలం లోక్‌సభ ఎన్నికల కోసమే.. దుమారం రేపుతున్న తేజస్వీ వ్యాఖ్యలు
డిసెంబర్ 2021 ప్రారంభంలో, US డిపార్ట్‌మెంట్ ఆఫ్ స్టేట్ యొక్క డిప్లొమాటిక్ సెక్యూరిటీ సర్వీస్, దాని రివార్డ్స్ ఫర్ జస్టిస్ (RFJ) కార్యాలయం ద్వారా.. మేజర్ జియా, అక్రమ్ హుస్సేన్ అరెస్టు చేయడానికి లేదా దోషిగా నిర్ధారించడానికి తగిన సమాచారం కోసం 5 మిలియన్ డాలర్ల రివార్డ్ ప్రకటించింది. ఫిబ్రవరి 2015లో ఢాకాలో జరిగిన ఉగ్రవాద దాడిలో ఇతనితో పాటు మరో నలుగురు వ్యక్తులకు సంబంధం ఉన్నట్లు తేలింది. ఈ దాడిలో అమెరికా పౌరుడు అవిజిత్ రాయ్ మరణించగా, అతని భార్య రఫిదా బోన్యా అహ్మద్ తీవ్రంగా గాయపడ్డారు.
అవిజిత్ రాయ్ ఓ పుస్తక ప్రదర్శన కోసం ఢాకాకు వెళ్లగా, అక్కడ దుండగులు కత్తితో దాడి చేశారు. ఈ దాడిలో రాయ్ మరణించగా, అహ్మద్ తీవ్రంగా గాయపడ్డారు. బంగ్లాదేశ్‌లో ఉన్న అల్-ఖైదా ప్రేరేపిత ఉగ్రవాద సంస్థ అన్సరుల్లా బంగ్లా టీం, ఢాకాలోని తన కార్యకర్తల ద్వారా దాడికి బాధ్యత వహించిందని అమెరికా విదేశాంగ శాఖ నివేదించింది. బంగ్లాదేశ్‌లోని అన్సరుల్లా బంగ్లా టీంతో ఈ దాడికి బాధ్యత వహించింది. ఇది అల్‌ఖైదాకు అనుబంధ విభాగంగా పనిచేస్తోంది. ఈ ఘటన తర్వాత జియా పాకిస్తాన్ పారిపోయాడని భావిస్తున్నారు. 2016లో అతడిని పట్టించే సమాచారం చెప్పిన వారికి 2 మిలియన్ టాకాల రివార్డు ప్రకటించింది. ఇతనికి 2011లో సైనిక తిరుగబాటుకు ప్రయత్నించి విఫలమయ్యాడు.
ఇటీవల బంగ్లాదేశ్ పాకిస్తానీలకు వీసా నిబంధనల్ని సడలించింది. పాక్ పౌరులకు భద్రతా అనుమతి తప్పనిసరి అనే విధానాన్ని తీసేసింది. దీని వల్ల జియా కొన్ని వారాల క్రితం పాకిస్తాన్ పాస్‌పోర్ట్‌పై ఢాకా తిరిగిరావడానికి వీలు కలిగింది. జియా తిరిగి వచ్చిన వెంటనే డిసెంబర్ 29, 2024 వరకు ఉన్న అన్ని ఆరోపణల నుంచి విముక్తి పొందాలని, ‘‘మోస్ట్ వాంటెడ్’’ జాబితా నుంచి తొలగించేందుకు అధికారికంగా దరఖాస్తు చేసుకున్నాడని, అదే సమయంలో అన్ని నేరారోపణలు రద్దు చేయాలని కోరినట్లు తెలుస్తోంది.