Father Tries To Kill Pregnant Daughter: ప్రస్తుత సమాజంలో పరువు హత్యలు ఎక్కువ అయిపోతున్నాయి. బిడ్డల భవిష్యత్తు కంటే కులం, పరువే మాకు ముఖ్యమంటున్నారు. పేగుతెచ్చుకున్న బిడ్డలను నిర్దాక్షిణ్యంగా చంపేస్తున్నారు. ఇప్పటికే ఇలాంటి ఘటనలు చాలానే చూసాం.. తాజాగా కూతురు వేరే కులం వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుందని, తమ పరువు తీసిందని ఒక తండ్రి కన్నా కూతురును, అందులోనూ కడుపుతో ఉన్న కూతురును ఆటో ఎక్కించి హత్య చేయబోయాడు. ఈ దారుణ ఘటన రాజస్థాన్ లో వెలుగుచూసింది. వివరాల్లోకి వెళితే.. రాజస్థాన్ లో భరత్ పూర్ కు చెందిన నగ్మా అనే యువతి.. అదే గ్రామానికి చెందిన నరేంద్ర అనే యువకుడు ప్రేమించుకున్నారు. వీరి ప్రేమ విషయం నగ్మా వాళ్ళింట్లో తెలిసిపోయింది. నరేంద్ర తక్కువ కులంవాడు కావడంతో నగ్మా తండ్రి వీరి పెళ్ళికి అంగీకరించలేదు. దీంతో నగ్మా, నరేంద్ర ఇంట్లో నుంచి పారిపోయి పెళ్లి చేసుకున్నారు. ఇక దాదాపు 7 నెలలు వేరే ప్రాంతంలో ఉండి ఇటీవలే భరత్ పూర్ కు వచ్చారు. అక్కడే నగ్మా గర్భవతి అయ్యింది.
కూతురు, అల్లుడు సొంత వూరు వచ్చారని తెలుసుకున్న తండ్రి వారిని ఎలాగైనా చంపాలని ప్లాన్ వేశాడు. బుధవారం హాస్పిటల్ కు చెకప్ కు వెళ్లిన నగ్మా, నరేంద్రను తండ్రి ఆటో తో తొక్కించడానికి ప్రయత్నించాడు. హాస్పిటల్ నుంచి కడుపుతోఉన్న నగ్మా రోడ్ల మీద ప్రాణ భయంతో పరుగులు పెడుతూ కనిపించింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. ఒక చేత్తో కడుపు పట్టుకొని రోడ్ల మీద యువతి అరుస్తున్న అరుపులు చూపరులను కంటతడి పెట్టించాయి. ఇలాంటి కర్కశమైన తండ్రులు ఉండడం కన్నా చావడమే మేలు అంటూ ఈ వీడియో చూసినవారు కామెంట్స్ పెడుతున్నారు. ఇక ఈ వీడియో వైరల్ కావడంతో పోలీసులు ఆ జంటకు ప్రొటెక్షన్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆ జంట సురక్షితంగా ఉన్నట్లు సమాచారం. యువతి తండ్రిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.