UP Crime: అత్యాచారాలకు అడ్డుకట్ట పడటం లేదు. దేశవ్యాప్తంగా ఎక్కడో చోట అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి. ఉత్తర్ ప్రదేశ్ మధురలో దళిత బాలికపై కారులో సామూహిక అత్యాచారం జరిగిన ఘటన వెలుగులోకి వచ్చింది. కదులుతున్న కారులో ముగ్గురు నిందితులు ఈ దారుణానికి ఒడిగట్టారు. ఘటన తర్వాత బాలికను రోడ్డు పక్కన తోసేశారని పోలీసులు శుక్రవారం తెలిపారు.
మైనర్ బాలిక ఫిర్యాదు మేరకు నిందితులపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ముగ్గురు నిందితులు ప్రస్తుతం పరారీలో ఉన్నారు. వీరిని పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. 13 ఏళ్ల బాలికను వైద్య పరీక్షల కోసం జిల్లా మహిళా ఆస్పత్రికి తరలించారు. ఆమె వాంగ్మూలనాన్ని మేజిస్ట్రేట్ వద్ద నమోదు చేసినట్లు ఎస్పీ త్రిగుణ్ బిసెన్ తెలిపారు.
Read Also: Yahya Ayyash: ‘‘ది ఇంజనీర్: యాహ్య అయ్యాష్’’ని ఇజ్రాయిల్ సెల్‌ఫోన్ బాంబుతో ఎలా చంపేసింది..?
మైనర్ బాలిక టిఫిన్ కోసం సామాన్ తీసుకుని వచ్చేందుకు స్థానికంగా ఉన్న ఓ దుకాణానికి వెళ్లింది. షాపులో ఉన్న నీరజ్ అనే వ్యక్తి బాలికకు మత్తుమందు కలిపిన వాటర్ బాటిల్ ఇచ్చాడు. నీళ్లు తాగిన బాలికకు తల తిరగడంతో పాటు స్పృహతప్పి పోయింది. నీరజ్ తన స్నేహితులు శైలేంద్ర, మరో సహచరుడు బాలికను కారులో తీసుకెళ్లారు. బాలిక పాక్షిక స్పృహలో ఉన్న సమయంలో, కదులుతున్న కారులో అత్యాచారం చేసి, బర్సానా రోడ్ ఫ్లై ఓవర్ కింద పడేసి పారిపోయారు. బాలిక స్పృహలోకి వచ్చిన తర్వాత ఇంటికి చేరుకుని తల్లిదండ్రులకు విషయం చెప్పింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నామని, ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నామని త్రిగుణ్ బిసెన్ తెలిపారు.