ఖమ్మం జిల్లాలోని కోదాడ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. కోదాడ నుంచి ఖమ్మం వెళ్తున్న బస్సు.. గోకినపల్లి సమీపంలో ఆటోని ఢీకొంది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా, మృతుల్లో ఒకరు రెండేళ్ళ చిన్నారి ఉంది. ఆటో నుజ్జునుజ్జయ్యింది. మృతదేహాలు చిందరవందరగా పడిపోయాయి. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడగా.. వెంటనే వారిని ఆసుపత్రికి తరలించారు. వారి పరిస్థితి కూడా విషమంగానే ఉందని వైద్యులు చెప్తున్నారు. మృతులు నేలకొండపల్లి మండలం సదాశివపురం గ్రామస్తులుగా పోలీసులు గుర్తించారు.
మృతుల బంధువులు ఘటనా స్థలానికి చేరుకొని, ఆందోళన చేపట్టారు. దీంతో, అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. దాదాపు మూడు గంటల పాటు రాస్తారోకో నిర్వహించారు. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి, బాధితుల్ని ఓదార్చేందుకు స్వయంగా రంగంలోకి దిగారు. న్యాయం చేస్తామని ఎంత చెప్పిన వినకుండా.. ఆందోళనకారులు రోడ్డు ప్రమాదానికి కారణమైన బస్సు అద్దాలు పగలగొట్టి ధ్వంసం చేశారు. గతంలోనూ ఈ బస్సు కారణంగా ప్రమాదం జరిగింది. అందుకే, ఈసారి ఆవేశంతో ఊగిపోయిన జనాలు బస్సుని నాశనం చేశారు. చివరికి ఆర్టీసీ నుంచి నష్టపరిహారం ఇప్పిస్తామని హామీ ఇవ్వడంతో, వాళ్ళు ఆందోళన విరమించారు.