Pakistan Champions Beat India Champions: దాయాది పాకిస్తాన్ చేతిలో భారత్ దారుణ ఓటమిని మూటగట్టుకుంది. వరల్డ్ ఛాంపియషిప్ ఆఫ్ లెజెండ్స్ 2024లో భాగంగా శనివారం బర్మింగ్‌హామ్ వేదికగా పాకిస్థాన్ ఛాంపియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇండియా ఛాంపియన్స్ 68 పరుగుల తేడాతో ఓడింది. 244 పరుగుల భారీ ఛేదనలో ఇండియా 9 వికెట్లకు 175 పరుగులు మాత్రమే చేసింది. సురేష్ రైనా (52; 40 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లు) హాఫ్ సెంచరీతో చెలరేగినా ఇండియాకు ఓటమి తప్పలేదు. పాకిస్తాన్ ఓపెనర్ షర్జీల్ ఖాన్ (72; 30 బంతుల్లో 7 ఫోర్లు, 5 సిక్సర్లు)కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది.
ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 243 పరుగుల భారీ స్కోర్ చేసింది. షర్జీల్ ఖాన్ సహా కమ్రాన్ అక్మల్ (77; 40 బంతుల్లో 9 ఫోర్లు, 4 సిక్సర్లు), షోయబ్ మక్సూద్ (51; 26 బంతుల్లో, 2 ఫోర్లు, 5 సిక్సర్లు ) హాఫ్ సెంచరీలు చేశారు. పాక్ మాజీ స్టార్స్ షోయబ్ మాలిక్ 25 రన్స్ చేయగా.. షాహిద్ ఆఫ్రిది డకౌట్ అయ్యాడు. ఇండియా బౌలర్లలో ఆర్పీ సింగ్, అనురీథ్ సింగ్, ధావల్ కులకర్ణి, పవన్ నేగి తలో వికెట్ తీశారు. పాకిస్తాన్‌పై మంచి రికార్డు ఉన్న ఇర్ఫాన్ పఠాన్ ఒక ఓవర్ వేసి ఏకంగా 25 రన్స్ ఇచ్చుకున్నాడు. ధావల్ కులకర్ణి 4 ఓవర్లలో 49 పరుగులు సమర్పించుకున్నాడు.
Also Read: Reliance Jio OTT Plans: 21 నుంచి 7కు.. ఎంటర్‌టైన్‌మెంట్ ప్లాన్‌లను తగ్గించేసిన జియో!
భారీ ఛేదనలో ఇండియా 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 175 పరుగులు చేసింది. ఇండియాకు మంచి ఆరంభం దక్కినా.. మిడిల్ ఆర్డర్ బ్యాటర్లు విఫలమవడంతో ఓడిపోవాల్సి వచ్చింది. ఓపెనర్లు రాబిన్ ఉతప్ప (22; 12 బంతుల్లో, 1 ఫోర్, 2 సిక్సర్), అంబటి రాయుడు (39; 23 బంతుల్లో, 3 ఫోర్లు, 2 సిక్సర్లు) ఫర్వాలేదనిపించారు. సురేష్ రైనా సత్తాచాటగా.. యూసఫ్ పఠాన్ డకౌట్ అయ్యాడు. యువరాజ్ సింగ్ (14), ఇర్ఫాన్ పఠాన్ (15) పరుగులు చేశారు. పాకిస్తాన్ బౌలర్లలో వాహబ్ రియాజ్, షోయబ్ మాలిక్ చెరో మూడు వికెట్లు తీశారు.