ఓ వైపు నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతుండడంతో ప్రజలు అల్లాడి పోతున్నారు. మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్టు ఇప్పుడు మొబైల్ రీఛార్జ్ ధరలు కూడా పెరగబోతున్నట్లు టాక్ వినిపిస్తుండడంతో షాక్ కు గురవుతున్నారు. మొబైల్ రీఛార్జ్ ధరలు మరింత భారం కానున్నట్లు సమాచారం. గతేడాది జియో, ఎయిర్ టెల్, వొడాఫోన్ ఐడియా వంటి టెలికాం సంస్థలు టారిఫ్ ధరలను భారీగా పెంచిన విషయం తెలిసిందే. ఏకంగా 25 శాతం వరకు పెంచి కస్టమర్లపై ఆర్థిక భారాన్ని మోపాయి. ఈ ఏడాది కూడా టెల్కోలు మళ్లీ టారిఫ్ ధరలను పెంచబోతున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.
టెలికాం ఆపరేటర్స్ ఈ సంత్సరం దాదాపు 10 శాతం టారిఫ్ ధరలను పెంచే ఛాన్స్ ఉందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. ఇప్పటికే పెరిగిన రీఛార్జ్ ధరలతో సతమతమవుతుంటే మరోసారి టారిఫ్ ధరలు పెరుగుతాయనే సంకేతాలు వస్తుండడంతో మొబైల్ వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు. పెరగనున్న రీఛార్జ్ ధరలు కస్టమర్లకు అదనపు భారం కానున్నాయి. అయితే మరోసారి టెలికాం కంపెనీలు రీఛార్జ్ ధరలను పెంచడానికి గల కారణం ఏంటి? ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. ఆపరేట్స్ మార్జిన్లపై దృష్టిపెడుతున్నారని త్వరలో 5G నిర్ధిష్ట ధరలను ప్రవేశపెట్టవచ్చని జెఫరీస్ రిపోర్ట్ వెల్లడించింది.
ఈ ఏడాది జియో లిస్టింగ్ కు వెళ్లే ఛాన్స్ ఉండడంతో దాని వృద్ధిని పెంచడానికి టారిఫ్ ల పెంపుకు అనుకూలంగా ఉండనున్నట్లు జెఫరీస్ నివేదిక తెలిపింది. ఇదే సమయంలో ఎయిర్ టెల్ మెరుగైన రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయ్ మెంట్ కోసం టారిఫ్ లను పెంచాలని టార్గెట్ గా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వం అతిపెద్ద వాటాదారుగా ఉండడంతో వొడాఫోన్ ఐడియా కూడా టారిఫ్ లను పెంచే అవకాశం ఉండవచ్చని జెఫరిస్ రిపోర్ట్ వెల్లడించింది. టారిఫ్ ధరల పెంపుతో టెలికాం రంగ ఆదాయ వృద్ధి సంవత్సరానికి 15 శాతం పెరుగుతుందని జెఫరిస్ అంచనా వేస్తోంది. ఒక వేళ రీఛార్జ్ ధరలు పెరిగితే ఏడాది కాలంలోనే రెండు సార్లు పెరిగినట్లు అవుతుంది.