ఈ రోజు మధురానగర్ రైల్వే ట్రాక్ వద్ద సీఎం చంద్రబాబు పర్యటన సందర్భంగా పెద్ద ప్రమాదమే తప్పింది.. వరద పరిస్థితిని చూసేందుకు రైల్వే ట్రాక్ దాటారు సీఎం చంద్రబాబు... అయితే, చంద్రబాబు రైల్వే ట్రాక్ వద్ద ఉండగానే రైలు వచ్చేసింది.. ఇక, రైలును చూసి భద్రతా సిబ్బంది అప్రమత్తం కాగా.. రైల్వే ట్రాక్ అవతలి పక్కకు వెళ్లిపోయారు సీఎం చంద్రబాబు. రెయిలింగ్ కు.. రైలుకు మధ్య ఉన్న చిన్నపాటి గ్యాపులోనే ఉండిపోయారు ముఖ్యమంత్రి.
వరద బాధిత కుటుంబాలకు శుక్రవారం నిత్యావసర వస్తువుల పంపిణీ ప్రారంభించనుంది ఏపీ పౌరసరఫరాల శాఖ.. సుమారు 2 లక్షల మంది లబ్ధిదారులకు ఈ పంపిణీ జరగనుంది.. 179 వార్డు,3 గ్రామ సచివాలయాల పరిధిలో పంపిణీ చేపట్టనున్నారు.. ముంపు బాధితులు అందరికీ నిత్యావసర వస్తువులు అందిస్తామని వెల్లడించారు రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్...
ఆంధ్రప్రదేశ్‌లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ పర్యటిస్తున్నారు.. గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకున్న కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కు మంత్రి నారా లోకేష్ స్వాగతం పలికారు.. ఆ తర్వాత ఏరియల్ సర్వే ద్వారా బుడమేరు, క్యాచ్మెంట్ ఏరియాలను పరిశీలించారు చౌహాన్. అక్కడ నుంచి వరద ప్రభావిత ప్రాంతాలైన జక్కంపూడి మిల్క్ ఫ్యాక్టరీ, కండ్రిక, అజిత్‌సింగ్ నగర్ లను ఏరియల్ సర్వే ద్వారా కేంద్ర మంత్రి పరిశీలించగా... ఆయా ప్రాంతాల్లో జరిగిన నష్టాన్ని కేంద్ర మంత్రికి వివరించారు మంత్రి…
కొల్లేరు చేపల చెరువులకు బుడమేరు ముంపు గండం పొంచిఉంది.. బుడమేరుకు వరద పెరగటంతో వేల ఎకరాల్లో ఉన్న చెరువులకు ముంపు వాటిల్లే అవకాశం ఉంది అంటున్నారు.. ఇవాళ సాయంత్రానికి బుడమేరు వరద మరింత పెరుగుతుందని హెచ్చరిస్తున్నారు.. మరో రెండు అడుగులు వరద పెరిగితే 10 వేల ఎకరాల్లో చెరువులు నీట మునుగుతాయనే భయంతో వ్యాపారుల ఆందోళన నెలకొంది..
వరద ముంపు ప్రాంతాల్లో పారిశుధ్య పనులను వేగవంతం చేసింది పురపాలక శాఖ.. వరద నీరు తగ్గిన ప్రాంతాల్లో యుద్ధ ప్రాతిపదికన పారిశుధ్య పనులు చేపట్టారు.. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 3454 మంది పారిశుధ్య కార్మికులతో పాటు 450 మంది ప్రజారోగ్య విభాగం సిబ్బంది ఉన్నారు.. ఇతర మున్సిపాలిటీల నుంచి 5889 మంది పారిశుధ్య కార్మికులను విజయవాడకు రప్పించింది ప్రభుత్వం..
బుడమేరు కాలువకు పడిన గండ్లు పూడ్చే వరకు తాను అక్కడ నుంచి కదిలేది లేదంటున్నారు ఆంధ్రప్రదేశ్ నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు. కాలువకు మూడు ప్రాంతాలలో గండి పడటం వల్లే విజయవాడలోని పలు ప్రాంతాలు నీట మునిగాయని ఆయన పేర్కొన్నారు.
బుడమేరు గండి పూడ్చే పనులను డ్రోన్ లైవ్ ద్వారా కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి పర్యవేక్షిస్తున్నారు మంత్రి నారా లోకేష్.. క్షేత్రస్థాయిలో ఉన్న మంత్రి నిమ్మల రామానాయుడుతో సమన్వయం చేసుకుంటూ పనులు వేగవంతం చేసేందుకు చర్యలు చేపట్టారు.. వివిధ శాఖల సమన్వయంతో అవసరమైన యంత్రాలు, సామాగ్రిని అక్కడి పంపిస్తున్నారు లోకేష్. ఇక, బుడమేరు దగ్గర జరుగుతున్న పనులను పర్యవేక్షించారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.
వరద బాధితుల నుంచి డబ్బులు వసూలు చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు బెజవాడ పోలీసులు.. ఈ మేరకు ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ కార్యాలయం, విజయవాడ నుంచి ఓ ప్రకటన విడుదల చేశారు..