వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి.. వారికి అందుతున్న సాయంపై ఆరా తీసిన మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి.. ఈ రోజు వరద బాధితులకు కోటి రూపాయల సాయం ప్రకటించారు.. పార్టీ నాయకుల సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు జగన్.
మంత్రులకు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. వరద ప్రభావిత ప్రాంతాల్లో మంత్రులు సరిగా పనిచేయకపోతే.. వారిని తీసివేస్తానంటూ హెచ్చరించారు.. తనకు పనిచేయని మంత్రులు అక్కరలేదంటూ తేల్చిచెప్పారు.. మంత్రులు సరిగ్గా పని చేయకపోతే వారినీ తీసేస్తా... పని చేయని వాళ్లు నాకు అక్కర్లేదని స్పష్టం చేశారు.. జక్కంపూడిలో వరద సహాయ చర్యల్లో సరిగ్గా పని చేయని ఓ అధికారిని సస్పెండ్ చేశామని గుర్తుచేశారు సీఎం చంద్రబాబు.
విజయవాడలోని చాలా ప్రాంతాలు ఇంకా వరద నీటిలోనే ఉన్నాయి.. అయితే, వరద ప్రభావిత ప్రాంతాల్లో నీరు తగ్గిన తర్వాత చేపట్టాల్సిన చర్యలపై ఫోకస్ పెట్టింది ఏపీ ప్రభుత్వం.. నగరంలో పారిశుధ్య నిర్వహణ కోసం ఇతర మున్సిపాలిటీల నుంచి అధికారులను రప్పించారు మంత్రి నారాయణ.
విజయవాడలో ప్రజల కష్టాలను చూసి గుండె తరుక్కుపోతుంది అంటూ ఆవేదన వ్యక్తం చేశారు మాజీ మంత్రి, వైసీపీ నేత ఆర్కే రోజా.. చిన్న పిల్లలు, మహిళలు, వృద్ధులు వరదల్లో చిక్కుకుపోయి అవస్థలు పడుతున్నారు.. వారి కష్టాలు వర్ణనాతీతం.. వారి మాటలు విటుంటే నాలుగురోజుల నుండి వాళ్లు ఎంత నరకం అనుభవించారో అర్థమవుతుంది.. కనీసం పసిబిడ్డలకు పాలు కూడా అందలేదు.. రోజుల తరబడి మంచి నీళ్లు కూడా అందలేదు అన్నారు..
కృష్ణా జిల్లా గన్నవరంలో గూడవల్లి వద్ద బుడమేరు కాలువ కట్ట తెగిపోయింది.. దీంతో.. బుడమేరు కాలువ నుంచి జాతీయ రహదారి 16పైకి వరద నీరు చేరుతుంది.. నిడమానూరు నుండి గూడవల్లి వరకు జాతీయ రహదారిపైకి వరద నీరు చేరిపోయింది..
వరద బాధితులను ఆదుకనేందుకు స్వచ్ఛందంగా ముందుకు రావాలని ప్రభుత్వం పిలుపునిచ్చింది.. బాధితులకు ఏ రూపంలోనైనా సాయం అందించాలని కోరారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. స్వచ్ఛందంగా ఆహారం ఇవ్వదలచిన దాతల కోసం ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో ప్రత్యేక పాయింట్ ఏర్పాటు చేశామన్నారు.. ఇక, ఆహారం అందించే దాతలను కో-ఆర్డినేట్ చేసుకునే బాధ్యతను ఐఏఎస్ మనజీర్ కు అప్పగించారు.. స్వచ్ఛందంగా ముందుకొచ్చే దాతలకు మరింత సమాచారం అందించేందుకు 79067 96105 నెంబర్ ఏర్పాటు చేసింది ప్రభుత్వం..
ఈ నెల 5వ తేదీన పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడే అల్పపీడనం క్రమేపీ బలపడే అవకాశం ఉందని వాతావరణశాఖ చెబుతుంది.. అల్పపీడనం బలపడటానికి అనుకూలంగా రుతుపవన ద్రోణులు మారుతున్నాయని.. దీని ప్రభావంతో వచ్చే 24 గంటల్లో కృష్ణా జిల్లా.. గుంటూరు జిల్లాలకు మరోసారి వర్షం హెచ్చరికలు జారీ చేసింది..
బెజవాడలో వరదలపైనే ఫోకస్ పెట్టారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. రాత్రి గంటన్నర సేపు సింగ్ నగర్ లో పర్యటించిన సీఎం చంద్రబాబు. బోట్ల ద్వారా తరలించిన, స్వచ్ఛందంగా బయటకు వచ్చిన బాధితులతో మాట్లాడారు.. వారి ఆవేదన, బాధలను, రెండు రోజులుగా పడుతున్న కష్టాలను సీఎంకు వివరించారు బాధితులు. ఊహించని ఉత్పాతం వల్ల పడిన ఇబ్బందులను సీఎం చంద్రబాబుకు వివరించారు వరద బాధితులు. ఇప్పటికీ బంధువులు, ఇరుగు పొరుగు వారు ఇంకా జలదిగ్బంధంలోనే ఉన్నారని తెలుపుతూ ఆవేదన వ్యక్తం చేశారు..
బెజవాడ వాసులు క్రమంగా ఊపిరి పీల్చుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.. ప్రకాశం బ్యారేజీకి గంట గంటకూ వరద తగ్గుతోంది.. మధ్యాహ్నం 3 గంటల నుంచి క్రమంగా వరద తగ్గుతోంది.. మధ్యాహ్నం 12 గంటలకు రికార్డ్ స్థాయిలో ప్రకాశం బ్యారేజీకి 11.43 లక్షల క్యూసెక్కుల వరద రాగా.. రాత్రి 9 గంటల వరకు ప్రకాశం బ్యారేజీకి 11.20 లక్షల క్యూసెక్కులకు తగ్గింది ఇన్ఫ్లో..