కడప మున్సిపల్ కార్పొరేషన్ సమావేశం రసాభాసగా మారింది.. కడప కార్పొరేషన్ సర్వసభ్య సమావేశం కడప ఎమ్మెల్యే మాధవీ రెడ్డి నిరసన మధ్య ప్రారంభం కాక ముందే ఆగిపోయింది. ఎక్స్ అఫిషియో సభ్యురాలిగా తనకు గౌరవం ఇవ్వకుండా కార్పొరేటర్లతో సమానంగా క్రిందనే సీటు వేయడంపై మాధవీ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కౌన్సిల్ మీటింగ్ హాలు లోకి రాగానే ఆమె మేయర్ వేదిక పక్కనే నిలబడి నిరసన తెలిపి.. మాట్లాడే అవకాశం ఇవ్వాలని మైక్ తీసుకున్నారు
తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. దేశంలో తొలి సీప్లేన్ సర్వీసులకు వేదికకా మారనుంది విజయవాడ.. ఇప్పటికే డీ హావిలాండ్ ట్విన్ అట్టర్ క్లాసిక్ 300 విమానం భారత్‌కు చేరుకోగా... నేడు శ్రీశైలం నుంచి విజయవాడ వరకు సీ ప్లేన్ ట్రయల్ రన్ నిర్వహించనున్నారు..
ముంబై నటి కాదంబరి జత్వాని కేసులో ఈ రోజు ఏపీ హైకోర్టులో కీలక పిటిషన్లపై విచారణ సాగనుంది.. ముంబై సినీనటి జత్వాని కేసులో ఐపీఎస్ అధికారుల ముందస్తు బెయిల్ పిటిషన్‌పై నేడు హైకోర్టులో విచారణకు రానుంది..
ఈ రోజు మొత్తంగా ఐదు సబ్స్టేషన్ల ప్రారంభించనున్నారు సీఎం చంద్రబాబు.. ఇదే సమయంలో మరో 14 సబ్స్టేషన్లకు శంకుస్థాపన చేయనున్నారు.. ఈ సబ్స్టేషన్లు ప్రధానంగా పరిశ్రమలు, ఆక్వాకల్చర్ మరియు వ్యవసాయ రంగాలు మరియు గృహాలకు మెరుగైన నాణ్యమైన విద్యుత్‌ను అందించగలవని అధికారి చెబుతున్నారు.. గుంటూరు జిల్లా తాళ్లాయపాలెంలో 400/220 కేవీ గ్యాస్ ఇన్సులేటెడ్ సబ్‌స్టేషన్ (జీఐఎస్) భౌతికంగా ప్రారంభించనున్న సీఎం.. మరో నాలుగు సబ్స్టేషన్లను ప్రారంభించి, మరో 14 వాటికి శంకుస్థాపన చేస్తారు.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, భీమవరం మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ ఇంట్లో, వ్యాపార సంస్థల్లో దాడులు నిర్వహించారు ఆదాయపన్నుశాఖ అధికారులు.. బుధవారం అర్ధరాత్రి 12 గంటల వరకు సోదాలు నిర్వహించారు ఐటీ అధికారులు.. ఈ రోజు కూడా ఆయనకు సంబంధించిన వ్యాపారాల్లో భాగస్వాములుగా ఉన్న వారి ఇళ్లల్లో సోదాలు నిర్వహించనున్నారని సమాచారం.
రాజమండ్రి విమానాశ్రయంలో తుపాకీ బుల్లెట్లు కలకలం సృష్టించాయి.. విజయవాడకు చెందిన ఎం.సుబ్బరాజు అనే ప్రయాణికుడు హైదరాబాద్ వెళ్లేందుకు రాజమండ్రి విమానాశ్రయానికి రాగా.. టెర్మినల్ భవనంలోకి వెళ్తున్న సమయంలో ఆయన వద్ద బుల్లెట్లు ఉన్నట్లు స్కానింగ్ లో తేలింది.. వెంటనే అప్రమత్తమైన ఎస్పీఎఫ్ సిబ్బంది.. సుబ్బరాజును అదుపులోకి తీసుకుని విచారించారు.
వైసీపీ నేత బోరుగడ్డ అనిల్‌కు పోలీసుల రాచ మర్యాదలు అంటూ సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్‌గా మారిపోయింది.. రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలిస్తుండగా మార్గమధ్యంలో ఓ రెస్టారెంట్లో విందు భోజనం అంటూ పోలీసులపై విమర్శలు వెల్లివెత్తాయి.. ఇక, టీడీపీ కార్యకర్తలు సెల్ఫోన్లో ఈ వ్యవహారాన్ని వీడియో చిత్రీకరిస్తుండగా.. ఫోన్ లాక్కుని వీడియో డిలీట్ చేశారంటూ పోలీసులపై మండిపడ్డారు.. ఈ వ్యవహారం అంతా వివాదాస్పదం కావడంతో.. పోలీసులపై వేటు పడింది
చిత్తూరు జిల్లా కుప్పంలో వైసీపీకి భారీ షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన కీలక నేత, కుప్పం మున్సిపల్ ఛైర్మన్ డాక్టర్ సుధీర్.. తెలుగుదేశం పార్టీలో చేరారు.. వైసీపీకి గుడ్‌బై చెప్పడంతో పాటు మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్ పదవులకు రాజీనామా చేసినట్లు ఈ సందర్భంగా వెల్లడించారు సుధీర్..