Kotipalli-Narsapur Railway Line: అంబేద్కర్ కోనసీమ జిల్లా ప్రజలు చిరకాలంగా ఎదురుచూస్తున్న కోటిపల్లి – నర్సాపురం రైల్వే లైన్ పనులకు మోక్షం లభించింది. మళ్లీ రైల్వే లైన్ పనులు పట్టాలు ఎక్కాయి. భూ సేకరణ పూర్తయిన ప్రాంతాలలో నిర్మాణ పనులను ప్రారంభించేలా చర్యలు చేపట్టారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ రైల్వే అధికారులను ఆదేశాలు ఇవ్వడంతో పనులు పునరుద్ధరించారు. గతంలో రైల్వే లైన్‌లో భాగంగా భూ సేకరణ పూర్తయిన ప్రాంతాలలోని భూమిని రైల్వే అధికారులు స్వాధీన పరుచుకొని రైల్వే నిర్మాణ పనులను ప్రారంభించే దిశగా చర్యలు తీసుకున్నారు. అయినవిల్లి మండలంలోని శానపల్లి లంక, సిరిపల్లి, మాగం, అమలాపురం రూరల్ మండలంలోని ఏ వేమవరం, బట్న విల్లి గ్రామాలలో రైల్వే లైనుకు సంబంధించి భూసేకరణ పూర్తి అయ్యింది. రైల్వే అధికారులు గ్రామానికి ఒకప్రత్యేక బృందాలను పంపి నిర్మాణ పనులను ప్రారంభించారు. రెవెన్యూ అధికారులు ఆయా గ్రామాలలో భూ సేకరణ పూర్తయిన భూములను సర్వే చేసి హద్దులను గుర్తించి రైల్వే అధికారులకు అప్పగిస్తున్నారు. సంబంధిత ప్రాంతాలలోని రైతులు తదుపరి పంట వేసేలోపు రైల్వే అధికారులు భూ సేకరణ పూర్తయిన భూములను తమ ఆధీనంలోకి తీసుకొని నిర్మాణ పనులు ప్రారంభించాలని ఆదేశాలు ఇచ్చారు.
Read Also: AP Cabinet Meeting: నేడు ఏపీ కేబినెట్ భేటీ.. కీలక అంశాలపై ఫోకస్.. వారికి శుభవార్త..!