కర్ణాటకలో ఓ బీజేపీ కార్యకర్త హత్య విషయంపై పార్టీలోనూ, బయటా నెలకొన్న ఒత్తిళ్ల నేపథ్యంలో ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం కర్ణాటకలో పరిస్థితులకు అనుగుణంగా తాము వ్యవహరిస్తున్నామని.. ఒకవేళ పరిస్థితులుగానీ మారితే పరిస్థితులు డిమాండ్ చేస్తే కర్ణాటకలో కూడా ‘యోగి మోడల్’ ప్రభుత్వం అమలులోకి వస్తుందని వ్యాఖ్యానించారు.
పార్లమెంట్‌లో ఇవాళ జరిగిన పరిణామాలపై కాంగ్రెస్ లోక్‌సభాపక్ష నేత అధిర్ రంజన్ చౌదరి లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు. కాంగ్రెస్ అధినేత్ర సోనియా గాంధీ పట్ల బీజేపీ ఎంపీల అనుచిత ప్రవర్తనను ప్రివిలేజ్ కమిటీ దృష్టికి తీసుకెళ్లేందుకు చొరవ తీసుకోవాలని ఆయన లేఖలో కోరారు.
5జీ స్పెక్ట్రమ్ వేలంలో గురువారం మూడో రోజు ముగిసే సమయానికి ప్రభుత్వానికి 1,49,623 కోట్ల రూపాయల విలువైన బిడ్‌లు వచ్చాయి. కేంద్ర కమ్యూనికేషన్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపిన వివరాల ప్రకారం.. వేలం మూడో రోజు ముగిసే వరకు 16 రౌండ్ల బిడ్డింగ్‌లు పూర్తయ్యాయి. శుక్రవారం నాలుగో రోజు వేలం కొనసాగనుంది.
కేంద్రం 2017 నుంచి ప్రకటనల కోసం రూ. 3,339 కోట్లు ఖర్చు చేసిందని కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ ఇవాళ రాజ్యసభలో వెల్లడించారు. సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ ద్వారా ప్రభుత్వం ఖర్చు చేసిందని ఆయన తెలిపారు.
తమిళనాడు వేదికగా 44వ ఫిడే చెస్ ఒలింపియాడ్-2022 పోటీలు ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ప్రారంభమయ్యాయి. చెన్నైలోని జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్, సూపర్‌స్టార్ రజనీకాంత్ సహా పలువురు ప్రముఖులు ఈ ప్రారంభోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు.
డీజిల్ దొంగతనాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించిన పెట్రోల్ పంప్ మేనేజర్ కాల్చి చంపబడిన ఘటన ఉత్తరప్రదేశ్‌లోని బరేలీలో చోటుచేసుకుంది. లక్నో నుంచి ఢిల్లీకి వెళ్లే జాతీయ రహదారి-24పై ఆగి ఉన్న ట్రక్కు నుండి దొంగలు డీజిల్‌ను దొంగిలిస్తుండగా.. ఆపడానికి ప్రయత్నించిన పెట్రోల్ పంప్ మేనేజర్ ప్రయత్నించాడు. దీంతో తమ వద్ద ఉన్న గన్‌తో దొంగలు అతనిని పట్టపగలే కాల్చి చంపేశారు.
భారతదేశపు మొట్టమొదటి స్వదేశీ విమాన వాహక నౌక 'విక్రాంత్' నౌకాదళానికి అప్పగించబడింది. విస్తృతమైన వినియోగదారు అంగీకార ట్రయల్స్ తర్వాత కొచ్చిన్ షిప్‌యార్డ్ లిమిటెడ్(సీఎస్ఎల్) 'విక్రాంత్'ను భారత నావికాదళానికి అప్పగించింది. స్వదేశీ విమాన వాహక నౌక 'విక్రాంత్'ను నిర్మించిన కొచ్చిన్ షిప్‌యార్డ్ లిమిటెడ్.. ఇవాళ భారత నౌకాదళానికి అప్పగించి చరిత్రను సృష్టించింది.
కాంగ్రెస్ ఎంపీ అధిర్ రంజన్ చౌదరి రాష్ట్రపతి ద్రౌపది ముర్ముపై 'రాష్ట్రపత్ని' అంటూ చేసిన వ్యాఖ్యలు పార్లమెంట్‌ను కుదిపేశాయి. రాష్ట్రపత్ని వ్యాఖ్యలపై ఉభయసభల్లో బీజేపీ ఎంపీలు ఆందోళన చేపట్టారు. రాష్ట్రపతిని అవమానించినందుకు సోనియాగాంధీ, అధిర్ రంజన్ చౌదరి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో పార్లమెంట్ ఉభయ సభలు రేపటికి వాయిదాపడ్డాయి.
పశ్చిమ బెంగాల్ టీచర్ రిక్రూట్‌మెంట్ కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రి పార్థ ఛటర్జీని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మంత్రి పదవి నుంచి తొలగించారు. ఇప్పటికే ఈ స్కాంలో ఆయన అరెస్ట్ అయ్యారు. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది.
తాజా వివాదంపై కాంగ్రెస్ నేత అధిర్ రంజన్ చౌదరి స్పందించారు. తాను క్షమాపణ చెబుతానని.. తనను ఉరితీసినా తాను సిద్ధంగా ఉన్నానన్న ఆయన.. ఈ వివాదంలోకి కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీని ఎందుకు లాగుతున్నారని ప్రశ్నించారు. తాను పొరపాటుగా ఈ వ్యాఖ్యలు చేశానని.. రాష్ట్రపతిని కించపరిచే ఉద్దేశం తనకు లేదన్నారు.