Parliament Monsoon Session: కాంగ్రెస్ ఎంపీ అధిర్ రంజన్ చౌదరి రాష్ట్రపతి ద్రౌపది ముర్ముపై ‘రాష్ట్రపత్ని’ అంటూ చేసిన వ్యాఖ్యలు పార్లమెంట్‌ను కుదిపేశాయి. రాష్ట్రపత్ని వ్యాఖ్యలపై ఉభయసభల్లో బీజేపీ ఎంపీలు ఆందోళన చేపట్టారు. రాష్ట్రపతిని అవమానించినందుకు సోనియాగాంధీ, అధిర్ రంజన్ చౌదరి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో పార్లమెంట్ ఉభయ సభలు రేపటికి వాయిదాపడ్డాయి. రాష్ట్రపతి పదవిని అగౌరవపరిచేలా అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ బీజేపీ సభ్యులు పార్లమెంట్‌లో నినాదాలు చేశారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రపతి పదవిని అవమానపరిచిందని.. ఆ పార్టీ లోక్‌సభాపక్ష నేత అధిర్ రంజన్ చౌదరి వెంటనే క్షమాపణ చెప్పాలని కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ దిగువ సభలో డిమాండ్ చేశారు. అత్యున్నత పదవిలో ఉన్న మహిళకు జరిగిన అవమానాన్ని సోనియా గాంధీ ఆమోదించారంటూ ఆమె మండిపడ్డారు. దీనిపై పార్లమెంట్ ఉభయసభలు దద్దరిల్లాయి.
మరోవైపు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కూడా ఈ వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించారు. పార్లమెంట్ ప్రాంగణంలో నిరసన తెలియజేస్తున్న బీజేపీ సభ్యులకు మద్దతు తెలిపారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ క్షమాపణ చెప్పాలంటూ డిమాండ్ చేశారు. రాష్ట్రపతి వివాదంపై అధికార, ప్రతిపక్ష నేతల నినాదాలతో ఉభయ సభలు వాయిదాపడ్డాయి. ఆ తర్వాత కూడా దీనిపై సోనియా క్షమాపణలు చెప్పాలంటూ భాజపా నేతలు సభలో కొంతసేపు నినాదాలు చేశారు. ఈ క్రమంలో కమలం పార్టీ నేత రమాదేవి వద్దకు సోనియా వెళ్లి మాట్లాడుతుండగా.. మధ్యలో స్మృతి ఇరానీ జోక్యం చేసుకున్నారు. దీంతో కాంగ్రెస్ అధినేత్రి .. ‘నాతో మాట్లాడొద్దు’అంటూ స్మృతిని వారించారు. ఆమె స్పందించిన తీరు తమను భయానికి గురిచేసిందని నిర్మలా సీతారామన్ వ్యాఖ్యానించారు.
Adhir Ranjan Chowdhury: క్షమాపణ చెబుతా.. ఈ వివాదంలోకి సోనియాను ఎందుకు లాగుతున్నారు..
ఈ నేపథ్యంలో తాజా వివాదంపై కాంగ్రెస్ నేత అధిర్ రంజన్ చౌదరి స్పందించారు. ఈ క్రమంలో ట్విట్టర్ వేదికగా వీడియోను విడుదల చేశారు. తాను క్షమాపణ చెబుతానని.. తనను ఉరితీసినా తాను సిద్ధంగా ఉన్నానన్న ఆయన.. ఈ వివాదంలోకి కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీని ఎందుకు లాగుతున్నారని ప్రశ్నించారు. తాను పొరపాటుగా ఈ వ్యాఖ్యలు చేశానని.. రాష్ట్రపతిని కించపరిచే ఉద్దేశం తనకు లేదన్నారు. కాంగ్రెస్ పార్టీ క్షమాపణ చెప్పాలని బీజేపీ ఎంపీలు ఆందోళనల నేపథ్యంలో ఉభయసభలు రేపటికి వాయిదా పడ్డాయి. విపక్ష, అధికార పక్షాల ఆందోళనల నడుమ ఇవాళ మొత్తం వాయిదాల పర్వం కొనసాగింది.