మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిపై ఏపీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు మరోసారి సెటైర్లు విసిరారు. తనకు నమస్కారం పెట్టేందుకు ఇష్టం లేకనే జగన్ అసెంబ్లీలోకి రావడం లేదని అన్నారు.
కేంద్ర ప్రభుత్వం సహకారంతో నిర్వహిస్తున్న హౌసింగ్ పథకంలో డూప్లికేట్ లబ్ధిదారులు లేకుండా చూసేందుకు ప్రధానమంత్రి తాజాగా రూపొందించిన ఆవాస్ ఆండ్రాయిడ్ అప్లికేషన్‌పై కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ సమీక్ష నిర్వహించారు. గుంటూరులో ఐదు రాష్ట్రాలలోని అధికారులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
మురికి కాలువలో రూ.500 నోట్లు కొట్టుకొచ్చిన ఘటన మహారాష్ట్ర సాంగ్లీ జిల్లాలోని ఆట్పాడిలో చోటుచేసుకుంది. మురికి కాలువలోని మురికి నీళ్లలో రూ.500 నోట్లు కనిపించడంతో జనాలు తొలుత వాటిని నకిలీ నోట్లుగా భావించారు. కానీ అవి నిజమైన నోట్లే అని తెలిశాక జనం ఆ నోట్ల కోసం ఎగబడ్డారు. కాలువలోని మొత్తం చెత్తను తొలగించి మరీ రూ.500 నోట్ల కోసం వెతికారు.
విజయనగరం జిల్లాలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పర్యటించారు. గుర్ల తాగునీటి పథకాన్ని పరిశీలించడంతో పాటు.. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చికిత్స పొందుతున్న డయేరియా బాధితులను ఉపముఖ్యమంత్రి పరామర్శించారు. అనంతరం గ్రామస్థులతో మాట్లాడారు. డయేరియా వ్యాప్తి కారణాలపై కలెక్టర్‌తో సమీక్షించారు.
శ్రీకాకుళం జిల్లా మూలపేట పోర్టు నిర్మాణ పనులను వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు పునఃప్రారంభించారు. 2014-19లో భావనపాడు పోర్టు కోసం టెండర్లు సైతం పిలిచామని.. ప్రభుత్వం మారడంతో మూలపేటకు పోర్టును మార్చారని మంత్రి వెల్లడించారు. ప్రభుత్వం అనేది కంటిన్యూ కార్యక్రమం అని ఆయన తెలిపారు. అలా అమలు చేయకపోతే ఎంతో నష్టం ఉంటుందన్నారు.
కడప జిల్లా బద్వేల్‌లో యువకుడు పెట్రోల్ పోసి నిప్పంటించిన ఘటనలో తీవ్రంగా గాయడిన ఇంటర్ విద్యార్థిని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోవడం ఎంతో బాధాకరమని సీఎం చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటన ఎంతగానో కలచివేసిందన్నారు. ఎంతో భవిష్యత్తు ఉన్న విద్యార్థిని ఒక దుర్మార్గుడి దుశ్చర్యకు బలి కావడం విచారకరమని దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.
వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధురికి తిరుమల పోటీసులు జారీ చేశారు. 41ఏ కింద నోటీసులు ఇచ్చారు. ఇటీవల తిరుమల కొండపై రీల్స్ చేసిన వివాదంలో టీటీడీ విజిలెన్స్ అధికారులు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు వారిద్దరిపై కేసు నమోదు చేశారు.
కడప జిల్లాలో పెట్రోల్ దాడికి గురైన విద్యార్థిని మరణం విషాదకరమని హోం మంత్రి వంగలపూడి అనిత విచారం వ్యక్తం చేశారు. తీవ్రంగా గాయపడి కోలుకోలేక ఆస్పత్రిలో మృతి చెందడం చాలా దిగ్భ్రాంతికరమన్నారు. బాలికపై దాడి అనంతర దృశ్యాలు, పరిస్థితులు తనను తీవ్రంగా కలచివేశాయన్నారు.