మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంగా రాష్ట్ర ప్రభుత్వం మూడు రోజుల పాటు రైతు పండుగను నిర్వహిస్తోంది. అన్ని జిల్లాల రైతులు ఈ వేడుకల్లో పాలుపంచుకునేందుకు వ్యవసాయ శాఖతో పాటు అనుబంధ శాఖలన్నీ భారీగా ఏర్పాట్లు చేస్తున్నాయి. రైతులకు ఆధునిక వ్యవసాయ పద్ధతులు, లాభసాటి విధానాలు, వివిధ పంట ఉత్పత్తులపై అవగాహన కల్పించేందుకు ఈ సందర్భంగా వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తారు. రైతు సదస్సులో భాగంగా 25 వివిధ విభాగాల అధ్వర్యంలో 150 స్టాళ్లను ఏర్పాటు చేస్తున్నారు.
దేశంలో ఎక్కడా లేని విధంగా 18 వేల కోట్లు రైతుకు రుణమాఫీ చేశామని మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు పేర్కొన్నారు. పాలమూరు సభ ద్వారా మరో రూ. 3 వేల కోట్లు ఇవ్వబోతున్నామన్నారు. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్‌లో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు మాట్లాడారు.
ఏడాది పాలనలో ఏం చేశారో ప్రజలకు వివరించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రశ్నించారు. డిసెంబర్ 7న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తామని.. సోనియా పుట్టిన రోజున రైతులకు రుణమాఫీ చేస్తామని ప్రకటించారని.. ఇచ్చిన ఏ గ్యారంటీని కూడా అమలు చెయ్యలేదని విమర్శించారు. ఏడాదిలో రేవంత్ రెడ్డి సాధించింది ఏంటి అంటూ ప్రశ్నలు గుప్పించారు. బెదిరింపులు.. తిట్ల పురాణాలు, వ్యక్తిగత దాడులు.. అక్రమ కేసులు తప్ప కాంగ్రెస్ సాధించింది లేదన్నారు.
కాళేశ్వరం కమిషన్ ఛైర్మన్ జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ ముందు కేంద్ర జలశక్తి శాఖ సలహాదారు వెదిరే శ్రీరామ్ హాజరయ్యారు. కాళేశ్వరం బ్యారేజీలకు సంబంధించిన అంశాలపై అఫిడవిట్ సమర్పించారు.
నారాయణపేట జిల్లా మాగనూర్ జడ్పీ హైస్కూల్‌లో ఫుడ్ పాయిజన్ ఘటనపై తెలంగాణ హైకోర్టు విచారణ చేపట్టింది. స్కూల్‌లో ఫుడ్ పాయిజన్ చాలా తీవ్రమైన అంశమని హైకోర్టు వ్యాఖ్యానించింది. రాష్ట్ర ప్రభుత్వం సీరియస్‌గా తీసుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేసింది. వారంలో కౌంటర్ వేస్తామన్న ప్రభుత్వ న్యాయవాదిపై మండిపడింది
ఈమధ్య కాలంలో జరిగిన ఎన్నికల్లో దేశవ్యాప్తంగా మెజారిటీ సీట్లు కాంగ్రెస్ పార్టీ గెలిచిందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. కేరళలో, జార్ఖండ్ మంచి మెజారిటీ... మహారాష్ట్రలో కూడా పార్లమెంట్ స్థానాల్లో కాంగ్రెస్ గెలిచిందన్నారు. కేరళ వయనాడ్‌లో అత్యధిక మెజారిటీతో ప్రియాంక గాంధీ గెలిచారన్నారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మీడియా చిట్ చాట్‌లో మాట్లాడారు. దేశంలో రాహుల్ గాంధీని ప్రధాన మంత్రిగా చూడాలని అనుకుంటున్నారని వ్యాఖ్యానించారు.
కార్తిక మాసం శుభవేళ.. రోజుకో కల్యాణం, వాహనసేవ, పీఠాధిపతుల ప్రవచనాలు, ప్రముఖుల ఉపన్యాసాలతో 'కోటి దీపోత్సవం' దిగ్విజయంగా కొనసాగుతోంది. కోటి దీపోత్సవం వేళ హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ స్టేడియం శివనామస్మరణతో 13వ రోజు మార్మోగిపోయింది. కోటి దీపోత్సవానికి విశిష్ట అతిథిగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హాజరయ్యారు. కోటి దీపోత్సవానికి విశిష్ట అతిథిగా హాజరైన రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు నిర్వాహకులు ఘనంగా స్వాగతం పలికారు.
నరసాపురం ఎంపీ, కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మకు పితృ వియోగం కలిగింది. ఆయన తండ్రి కాసేపటి క్రితం తుదిశ్వాస విడిచారు. కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ తండ్రి సూర్యనారాయణ రాజు (91సం.లు) గత కొన్ని నెలలుగా అనారోగ్యంతో బాధపడుతూ ఈరోజు సాయంత్రం హైదరాబాద్ హాస్పిటల్‌లో ప్రాణాలు విడిచారు.
సుమత్రా తీరంలో ఈక్వటోరియల్ హిందూ మహాసముద్రం, దక్షిణ అండమాన్ సముద్రంపై ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. దీని ప్రభావంతో నవంబర్ 23న ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని తెలిపింది.
కోటి దీపోత్సవానికి విశిష్ట అతిథిగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హాజరయ్యారు. కోటి దీపోత్సవం వేదికగా భక్తులను ఉద్దేశించి రాష్ట్రపతి ముర్ము ప్రసంగించారు. దీపాలతో ప్రతి కార్యక్రమాన్ని ప్రారంభించడం మన సంప్రదాయమని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. కోటి దీపోత్సవంలో పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందని పేర్కొన్నారు.