TG High Court: నారాయణపేట జిల్లా మాగనూర్ జడ్పీ హైస్కూల్‌లో ఫుడ్ పాయిజన్ ఘటనపై తెలంగాణ హైకోర్టు విచారణ చేపట్టింది. స్కూల్‌లో ఫుడ్ పాయిజన్ చాలా తీవ్రమైన అంశమని హైకోర్టు వ్యాఖ్యానించింది. రాష్ట్ర ప్రభుత్వం సీరియస్‌గా తీసుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేసింది. వారంలో కౌంటర్ వేస్తామన్న ప్రభుత్వ న్యాయవాదిపై మండిపడింది.
Read Also: Bhatti Vikramarka: రైతు భరోసా, కొత్త రేషన్ కార్డులపై డిప్యూటీ సీఎం కీలక ప్రకటన!
మాగనూరు ఘటనలో పిల్లలు కుర్‌కురేలు తిని అస్వస్థతకు గురయ్యారని అడిషనల్ అడ్వొకేట్ జనరల్ కోర్టుకు తెలిపారు. బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకున్నామని అడిషనల్ అడ్వకేట్ జనరల్ వెల్లడించారు. అధికారులపై ఏమి చర్యలు తీసుకున్నారో నివేదిక ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. మాగనూరు , కరీంనగర్ బురుగు పల్లి ఘటనలపై నివేదిక ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. ఫుడ్ ఫాయిజన్ అయిన పాఠశాలల్లో శాంపుల్ సేకరించి ల్యాబ్‌కి పంపాలని న్యాయ స్థానం ఆదేశించింది. సోమవారం లోపు రిపోర్ట్ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేస్తూ.. తదుపరి విచారణ సోమవారానికి వాయిదా వేసింది. నారాయణపేట జిల్లా మాగనూర్ జడ్పీ హైస్కూల్‌లో మధ్యాహ్నం భోజనం వికటించి 50 మంది అస్వస్థతకు గురై వారం రోజులు కాక ముందే.. అదే పాఠశాలలో మళ్లీ 29 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు.