President Droupadi Murmu: కోటి దీపోత్సవానికి విశిష్ట అతిథిగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హాజరయ్యారు. కోటి దీపోత్సవం వేదికగా భక్తులను ఉద్దేశించి రాష్ట్రపతి ముర్ము ప్రసంగించారు. దీపాలతో ప్రతి కార్యక్రమాన్ని ప్రారంభించడం మన సంప్రదాయమని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. కోటి దీపోత్సవంలో పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందని పేర్కొన్నారు. కార్తీక మాసంలో అందరూ శివున్ని కొలుస్తారన్నారు. అసత్యంపై సత్యం గెలిచిన పండగ ఇది అని.. తెలుగు నేలపై కార్తీక మాసం వేళ కోటి దీపోత్సవం చేయడం ఎంతో ఆనందమని హర్షం వ్యక్తం చేశారు. అందరూ ఒక్కటై దీపాలు వెలిగించడం ఏకత్వాన్ని సూచిస్తుందని కోటి దీపోత్సవం వేదికపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహ కళ్యాణం, పూరీ జగన్నాథుని పూజలో పాల్గొనడం నా అదృష్టమని రాష్ట్రపతి స్పష్టం చేశారు.
అంతకు ముందు కోటి దీపోత్సవానికి విశిష్ట అతిథిగా హాజరైన రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు నిర్వాహకులు ఘనంగా స్వాగతం పలికారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో పాటు తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ పాల్గొన్నారు. వారితో పాటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మంత్రి సీతక్క కోటి దీపోత్సవంలో పాల్గొన్నారు. కోటి దీపోత్సవ వేడుకలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దీప ప్రజ్వలన చేశారు. కోటి దీపోత్సవంలో పూరీ జగన్నాథునికి రాష్ట్రపతి ముర్ము ప్రత్యేక పూజలు చేశారు. యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామికి రాష్ట్రపతి పట్టువస్త్రాలు సమర్పించారు. తొలి కార్తీక దీపాన్ని రాష్ట్రపతి వెలిగించారు.