Koti Deepotsavam 2024 Day 13: కార్తీక మాసానికి ప్రత్యేక స్థానం ఉంది.. హిందువులకు ఈ నెల శివుడు, విష్ణువు లిద్దరి పూజ కొరకు చాలా పవిత్రంగా భావిస్తారు.. కార్తీక స్నానాలకు, ఈ మాసం వివిధ వ్రతాలకు శుభప్రధమైనదిగా పురాణాలు చెబుతున్నాయి.. ఇక, కార్తీక మాసం వచ్చిందంటే చాలు హైదరాబాద్‌తో పాటు తెలుగు రాష్ట్రాలకు చెందిన భక్తుల చూపు మొత్తం ఎన్టీవీ-భక్తి టీవీ నిర్వహించే కోటిదీపోత్సవంపైనే ఉంటుంది. కార్తిక మాసం శుభవేళ.. రోజుకో కల్యాణం, వాహనసేవ, పీఠాధిపతుల ప్రవచనాలు, ప్రముఖుల ఉపన్యాసాలతో ‘కోటి దీపోత్సవం’ దిగ్విజయంగా కొనసాగుతోంది. కోటి దీపోత్సవం వేళ హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ స్టేడియం శివనామస్మరణతో 13వ రోజు మార్మోగిపోయింది. కోటి దీపోత్సవానికి విశిష్ట అతిథిగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హాజరయ్యారు. కోటి దీపోత్సవానికి విశిష్ట అతిథిగా హాజరైన రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు నిర్వాహకులు ఘనంగా స్వాగతం పలికారు. రాష్ట్రపతితో పాటు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మంత్రి సీతక్క కోటి దీపోత్సవంలో పాల్గొన్నారు. కోటి దీపోత్సవ వేడుకలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దీప ప్రజ్వలన చేశారు. కోటి దీపోత్సవంలో పూరీ జగన్నాథునికి రాష్ట్రపతి ముర్ము ప్రత్యేక పూజలు చేశారు. యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామికి రాష్ట్రపతి పట్టువస్త్రాలు సమర్పించారు. తొలి కార్తీక దీపాన్ని రాష్ట్రపతి వెలిగించారు.
కోటి దీపోత్సవం వేదికగా రాష్ట్రపతి ముర్ము ప్రసంగించారు. దీపాలతో ప్రతి కార్యక్రమాన్ని ప్రారంభించడం మన సంప్రదాయమని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. కోటి దీపోత్సవంలో పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందని పేర్కొన్నారు. కార్తీక మాసంలో అందరూ శివున్ని కొలుస్తారన్నారు. అసత్యంపై సత్యం గెలిచిన పండగ ఇది అని.. తెలుగు నేలపై కార్తీక మాసం వేళ కోటి దీపోత్సవం చేయడం ఎంతో ఆనందమని హర్షం వ్యక్తం చేశారు. అందరూ ఒక్కటై దీపాలు వెలిగించడం ఏకత్వాన్ని సూచిస్తుందని కోటి దీపోత్సవం వేదికపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహ కళ్యాణం, పూరీ జగన్నాథుని పూజలో పాల్గొనడం నా అదృష్టమని రాష్ట్రపతి వ్యాఖ్యానించారు.
Read Also: President Droupadi Murmu: కోటి దీపోత్సవంలో పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉంది: రాష్ట్రపతి
13వ రోజు కోటి దీపోత్సవానికి రెండు తెలుగు రాష్ట్రాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి.. దీపాల పండుగలో పాల్గొని ఈ లోకాన్నే మరిచేలా పునీతులయ్యారు. భక్తి టీవీ ఆధ్వర్యంలో జరుగుతున్న కోటి దీపోత్సవం 2024లో నేటితో 13 రోజులు విజయవంతంగా ముగిశాయి. నేడు కార్తీక గురువారం వేళ విశేష కార్యక్రమాలను నిర్వహించారు. చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధానార్చకులు సీ.ఎస్. రంగరాజన్ గారు ప్రవచనామృతం వినిపించారు. వేదికపై పూరీ జగన్నాథ హారతి, నృసింహ రక్షా కంకణ పూజ నిర్వహించారు. భక్తులచే నృసింహ విగ్రహాలకు రక్షా కంకణ పూజ చేయించారు. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనృసింహ స్వామి కళ్యాణాన్ని వీక్షించి భక్తులు తరించిపోయారు. శేష వాహనంపై స్వామి వారు భక్తులను అనుగ్రహించారు. చివరలో లింగోద్భవం, సప్తహారతులు, మహానీరాజనంతో 13వ రోజు కోటి దీపోత్సవం విజయవంతంగా ముగిసింది.