ఓ కీలకమైన విషయానికి సంబంధించి ప్రభుత్వం ఆ పెద్దాయన్ని సలహాదారుగా నియమించుకుంది. సలహాలతో ప్రభుత్వానికి సరైన గైడెన్స్ ఇవ్వడమో.. లేక సమన్వయమో చేయాలి. ఆ సలహాదారు మాత్రం టచ్ మీ నాట్‌గా ఉండిపోయారు. తాను చెప్పినా ఎవరూ వినరని నిస్తేజమా? నాకెందుకులే అనే భావనా? ఏదీ అర్థం కాకుండా ఉందట. మరి ఆయనకు పదవి ఇచ్చి ఏ లాభం అనే చర్చ అప్పుడే మొదలైపోయిందట. ఇంతకీ ఎవరాయన?
ఉద్యమంలో ఉద్యోగులు.. సలహాదారు సన్మానాల్లో..!
చంద్రశేఖర్ రెడ్డి. APNGO అధ్యక్షుడిగా పనిచేశారు. పదవీ విరమణ చేయగానే ప్రభుత్వం కూడా ఆయన్ను గుర్తించి.. ఉద్యోగులకు సంబంధించిన అంశంపై సలహాదారుగా నియమించింది. చంద్రశేఖర్‌రెడ్డిని అలా సలహాదారుగా నియమించారో లేదో.. పీఆర్సీ అమలు కోసం ప్రభుత్వంపై ఉద్యోగుల నుంచి ఒత్తిళ్లు పెరిగాయి. ఈ సమయంలో సలహాదారు హోదాలో చంద్రశేఖర్ రెడ్డి పాత్ర కీలకం. సమస్య పరిష్కారానికి చొరవ తీసుకోవాలి. కానీ ఇటీవల జరుగుతున్న పరిణామాల్లో ఎక్కడా చంద్రశేఖర్ రెడ్డి ఆ తరహా పాత్ర పోషించిన.. పోషిస్తోన్న దాఖలాలు కన్పించడం లేదనే చర్చ ఉద్యోగ వర్గాల్లో జోరుగా సాగుతోంది. రాజధానిలో సీరియస్‌గా చర్చలు జరుగుతుంటే రెడ్డిగారు కడప జిల్లాలో సన్మానాలు చేయించుకుంటున్నారట.
సలహాదారు ఉన్నా ఫలితం లేకుండా పోయిందా?
పీఆర్సీ నివేదిక కోసం ఉద్యోగ సంఘాల ప్రతినిధులు దాదాపు 5 గంటలపాటు సచివాలయంలో బైఠాయించి చిన్నసైజు ఆందోళన నిర్వహించారు. ప్రభుత్వం వైపు నుంచి ఎవ్వరూ స్పందించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు ఉద్యోగులు. చివరకు నెలాఖరులోగా PRC సమస్యను పరిష్కరించాలని ఉద్యోగ సంఘాలు అల్టిమేటం ఇచ్చాయి. ఈ మధ్యకాలంలో ఇలాంటివి ఎప్పుడూ జరగలేదు. ఇది ప్రభుత్వంపై తీవ్ర ప్రభావం చూపే అంశం. గతంలో అంటే ప్రభుత్వం.. దాని తరఫున అధికారులు సంఘాలతో చర్చించి సర్దుబాటు చేసుకునేవారు. కానీ.. ఇప్పుడు ప్రత్యేకించి.. పైగా ఏరికోరి ఓ సలహాదారుడిని నియమించుకుంటే ఫలితం లేకుండా పోయిందనే భావన వ్యక్తమవుతోంది. వాస్తవంగా రోజువారీ వ్యవహారాల్లో ఉద్యోగుల విషయాల్లో ఇవ్వడానికి సలహాలు ఏమీ ఉండవట. PRC వంటి కీలక విషయాల్లోనే చేస్తే ఏదైనా చేయవచ్చు. అలాంటిది ఇప్పుడే గాయబ్ అయితే ఇక ఆయన ఎందుకు? ఆయనకు ఆ పదవి ఎందుకు అనే విమర్శ వినిపిస్తోంది.
రెడ్డి నియామకాన్ని వ్యతిరేకించిన ఇతర ఉద్యోగ సంఘాలు?
సచివాలయంలో బైఠాయింపు జరిగిన సందర్భంలోనే పరిస్థితి తీవ్రతను చంద్రశేఖర్‌రెడ్డి ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకెళ్లి ఉంటే ఇంత వరకు వచ్చేది కాదని.. ఈ స్థాయిలో విమర్శలు ఉండేవి కావని ప్రభుత్వంలో జరుగుతున్న చర్చ. చంద్రశేఖర్‌రెడ్డిని ఉద్యోగ వ్యవహారాల సలహాదారుగా నియమించే సందర్భంలోనే APNGO మినహా.. ఇతర ఉద్యోగ సంఘాలు వ్యతిరేకించాయి. ఆయన్ను సలహాదారుగా నియమించ వద్దని సూచించాయి. కానీ ప్రభుత్వం రెడ్డి సినియారిటీని దృష్టిలో పెట్టుకుని ఆయన్ను సలహాదారుగా నియమించుకుంది. దీంతో ఉద్యోగ సంఘాల ప్రతినిధులు కూడా ఏం చేయలేక సైలెంట్ అయ్యారు. ఈ క్రమంలో చంద్రశేఖర్‌రెడ్డి మరింత బాధ్యతతో వ్యవహరిస్తే బాగుండేదనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. సలహాదారుగా తన నియామకాన్ని వ్యతిరేకించిన వారిని కూడా కలుపుకొని వెళ్లి.. వారికి నచ్చచెప్పి.. ప్రభుత్వానికి ఇబ్బంది లేకుండా చూడాల్సిన బాధ్యత చంద్రశేఖర్ రెడ్డి మీద ఉంది కదా అన్నది వారి వాదన.