విజయనగరం జిల్లాలో మహిళా ఎస్సై పట్ల ఆకతాయిల దాడి ఘటనపై హోంమంత్రి వంగలపూడి అనిత ఆగ్రహం వ్యక్తం చేశారు. మద్యం మత్తులో హద్దులు మీరి ప్రవర్తించిన దుండగులపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. కాగా.. వేపాడ మండలం గుడివాడ గ్రామంలో డాన్స్ బేబీ డాన్స్ కార్యక్రమంలో నృత్యం చేస్తున్న మహిళలపై తాగుబోతులు అసభ్యంగా ప్రవర్తించారు. ఈ క్రమంలో.. అడ్డుకోబోయిన మహిళా ఎస్సై పైనా దురుసుగా ప్రవర్తించారు. ఇది క్షమించరాని నేరమని హోంమంత్రి అనిత పేర్కొన్నారు. విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్‌తో ఫోన్లో మాట్లాడి అనిత వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇప్పటికే ఈ ఘటనలో 9 మందిని అదుపులోకి తీసుకున్నట్లు ఎస్పీ వెల్లడించారు. జాతర పేరుతో మహిళలపట్ల పోకిరీ వేషాలు వేస్తే సహించబోమని హోంమంత్రి అనిత హెచ్చరించారు.