తెలంగాణలో భారత్ సమ్మిట్ నిర్వహించబోతున్నాం..
ఢిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా మీడియాతో చిట్ చాట్ లో పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. తెలంగాణలో భారత్ సమ్మిట్ నిర్వహించబోతున్నాం.. దానికి సంబంధించినటువంటి అంశాలపై కేంద్ర విదేశాంగ శాఖ మంత్రితో ఇవాళ చర్చిస్తాను.. డీలిమిటేషన్ అనేది సౌత్ ను లిమిటేషన్ చేయడానికే.. డీలిమిటేషన్ పై తెలంగాణలో జరిగే అఖిలపక్ష సమావేశానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కచ్చితంగా హాజరు కావాలన్నారు. రాష్ట్ర అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాల్లో కేంద్రం తీసుకునే నిర్ణయాల్లో కేంద్ర మంత్రులు కచ్చితంగా కీలకపాత్ర పోషిస్తారు అని పేర్కొన్నారు. గాంధీ కుటుంబంతో రేవంత్ రెడ్డికి బలమైన సంబంధాలు ఉన్నాయి.. ఈ విషయంలో ఎవరు ఎటువంటి ప్రచారాలు చేసిన ఇబ్బంది లేదు అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు.
స్పీకర్ పై అవిశ్వాస తీర్మానం పెడతాం..
తెలంగాణ అసెంబ్లీలో స్పీకర్ పై జగదీష్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీష్ రావు స్పందించారు. ఈ సందర్భంగా జగదీష్ రెడ్డి స్పీకర్ ను అవమానించలేదన్నారు. సభ మీ ఒక్కరిదీ కాదు – సభ అందరి అన్నారు.. మీ అనే పదం సభ నిబంధనలకు విరుద్ధం కాదు అన్నారు. మీ ఒక్కరిదీ అనే పదం అన్ పార్లమెంట్ పదం కాదు.. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎందుకు నిరసన చేశారో తెలియదు.. సభను ఎందుకు వాయిదా వేశారో తెలీదు.. కాంగ్రెస్ డిస్పెన్స్ లో పడింది.. స్పీకర్ ను కలిశాం.. రికార్డు తీయాలని అడిగాం.. దళిత స్పీకర్ నుఅగౌరపరిచే విధంగా జగదీష్ రెడ్డి మాట్లాడలేదు అని హరీష్ రావు వెల్లడించారు.
భూ హక్కులు, పట్టాదారు పాసు పుస్తకం సవరణ బిల్లుకు ఆమోదం
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ మరో కీలక చట్ట సవరణ బిల్లుకు ఆమోద ముద్ర వేసింది.. ఏపీ భూ హక్కులు, పట్టాదారు పాస్ పుస్తకాల చట్ట సవరణకు అసెంబ్లీ ఆమోదం తెలిపింది.. అప్పిలేట్ అథారిటీని జిల్లా రెవెన్యూ అధికారుల నుంచి ఆర్డీవోలకు మారుస్తూ చట్టసవరణ చేశారు… చట్టసవరణ బిల్లును సభలో ప్రవేశపెట్టారు రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్.. 4 లక్షలకు పైగా భూవివాదాల అప్పీళ్లు పెండింగ్‌లో ఉన్నాయన్నారు మంత్రి… చట్టసవరణ వల్ల అప్పీళ్లు త్వరితగతిన క్లియర్ అవుతాయని స్పష్టం చేశారు.
విద్యార్థులకు దండం పెట్టి, గుంజీలు తీసిన హెచ్‌ఎం.. స్పందించిన మంత్రి లోకేష్..
విజయనగరం జిల్లాలో ఓ హెచ్‌ఎం విద్యార్థులకు స్టేజ్ పై నుంచి సాష్టాంగ నమస్కారం చేసి గుంజీలు తీసి.. క్షమాపణలు చెప్పిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారిపోయింది.. దీనిపై రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా స్పందించారు.. “విజయనగరం జిల్లా, బొబ్బిలి మండలం, పెంట జెడ్పీ హైస్కూల్ హెడ్మాస్టర్ చింత రమణ గారు పిల్లల విద్యా పురోగతి అంతంతమాత్రంగా ఉందని, చెప్పిన మాట వినడంలేదని.. విద్యార్థులను దండించకుండా, గుంజీలు తీసిన వీడియో సోషల్ మీడియా ద్వారా నా దృష్టికి వచ్చింది. హెడ్మాస్టరు గారూ! అంతా కలిసి పనిచేసి, ప్రోత్సాహం అందిస్తే మన ప్రభుత్వ పాఠశాలల పిల్లలు అద్భుతాలు సృష్టిస్తారు. వారిని దండించకుండా అర్థం చేసుకునేలా మీ స్వీయక్రమశిక్షణ చర్య ఆలోచన బాగుంది, అభినందనలు. అందరం కలిసి విద్యాప్రమాణాలు పెంచుదాం. పిల్లల విద్య, శారీరక, మానసిక వికాసానికి కృషిచేసి, వారి బంగారు భవిష్యత్తుకు బాటలు వేద్దాం..” అంటూ ట్వీట్ చేశారు మంత్రి నారా లోకేష్..
విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఎల్లుండి నుంచే ఒంటిపూట బడులు..
తెలంగాణ ప్రభుత్వం పాఠశాల విద్యార్థులకు శుభ వార్త చెప్పింది. వేసవి కాలం నేపథ్యంలో ఈనెల 15వ తేదీ నుంచి ఒంటి పూట బడులు ప్రారంభం కానున్నట్లు ప్రకటించింది. విద్యా సంవత్సరం ముగిసే వరకు ఒక్క పూట బడులు కొనసాగనున్నట్లు విద్యాశాఖ తెలిపింది. ప్రతి రోజు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 వరకు స్కూల్స్ పని చేయనున్నాయి. ఇక, 10వ తరగతి పరీక్ష కేంద్రాల్లో ఒంటి గంట నుంచి సాయంత్రం 5 వరకు క్లాసులు జరగనున్నట్లు అధికారులు స్పష్టం చేశారు. అయితే, తెలంగాణ రాష్ట్రంలో క్రమంగా ఎండలు మండిపోతున్నాయి. రాబోయే రోజుల్లో ఎండల తీవ్రత మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉండటంతో.. ఈ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని విద్యాశాఖ ఒంటి పూట బడులు నిర్వహించడానికి అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. 2025 మార్చి 15వ తేదీ నుంచి ఈ ఒక్క పూట బడులు కొనసాగనున్నట్లు తెలిపారు. ఇక, లాస్ట్ వర్కింగ్ డే ఏప్రిల్ 23వ తేదీ వరకూ హాఫ్ డే స్కూల్స్ కొనసాగనున్నాయి.
విద్యుత్తు రంగంలో ఎన్నో సంస్కరణలు టీడీపీ తెచ్చింది..
అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా సభలో ఇంధన శాఖపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఎప్పుడు కరెంట్ ఉంటుందో.. ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితి ఒకప్పుడు ఉండేదని ఆరోపించారు. తాను పాదయాత్ర చేసినపుడు కొన్ని సంఘటనలు తనను కలిచి వేశాయన్నారు. ప్రస్తుతం 9 గంటలు రైతులకు నిర్విరామంగా కరెంట్ ఇస్తున్న పరిస్థితి ఉందని తెలిపారు. విద్యుత్తు రంగంలో ఎన్నో సంస్కరణలు టీడీపీ తెచ్చింది.. కరెంట్ బిల్లుల విషయంలో కీలక సంస్కరణలు తెచ్చామని పేర్కొన్నారు. తనను ప్రపంచ బాంక్ జీతగాడు అన్నా కూడా పడ్డాను.. ఒక అసమర్ధ పాలన వల్ల చీకటి రోజులు వచ్చాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆలోచన లేకుండా పీపీఏలను రద్దు చేశారు.. దావోస్‌లో కూడా పీపీఏలపై చర్చ జరిగింది.. ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడైనా విద్యుత్ వినియోగం ఆధారంగానే ప్రజల అభివృద్ధిని లెక్కిస్తారని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. కొన్నేళ్లుగా విద్యుత్ రంగంలో విప్లవాత్మకమైన మర్పులు వచ్చాయి.. గతంలో కరెంటు కోతల సమయంలో రైతుల అవస్థలు ప్రత్యక్షంగా పరిశీలించానని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు.
అర్థం లేని ఆరోపణలు చేస్తే మేం సమాధానాలు చెప్పలేం..
ప్రభుత్వంపై మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ తీవ్ర విమర్శలు గుప్పించారు. మండలిలో ఇవాళ జరిగిన ప్రశ్నోత్తరాలలో ప్రభుత్వం నుంచి నిర్దిష్ట సమాధానాలు రావటం లేదని ఆరోపించారు. 2019 నుంచి జరిగిన స్కాంలపై మాట్లాడాలని అన్నారు.. తాము 2014 నుంచి మాట్లాడాలని అడిగామని పేర్కొన్నారు. అమరావతి భూములు, స్కిల్ స్కాంలు, అగ్రిగోల్డ్ దందాలు అన్నీ విచారణ చేయాలని అడిగామని బొత్స సత్యనారాయణ తెలిపారు. మరోవైపు.. మాజీ ముఖ్యమంత్రిని భూ బకాసురుడు అని మాట్లాడటం సరికాదని చెప్పామని బొత్స పేర్కొన్నారు. విశాఖ సిట్ విచారణపై రిపోర్టులు బయట పెట్టాలని అడిగాం.. నిరాధార ఆరోపణలు చేయటం సరికాదని చెప్పామని ఆయన తెలిపారు.
సభ నుంచి జగదీష్ రెడ్డి సస్పెన్షన్.. స్పీకర్ సంచలన నిర్ణయం
తెలంగాణ అసెంబ్లీలో జరిగిన ఘర్షణాకర పరిణామాల నేపథ్యంలో బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి జగదీష్ రెడ్డిని అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ముగిసేంత వరకు సస్పెండ్ చేస్తూ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కీలక నిర్ణయం తీసుకున్నారు. సభలో స్పీకర్‌ను ఉద్దేశించి “మీరు మేము ఎన్నుకుంటేనే స్పీకర్ అయ్యారు. ఈ సభ మీ సొంతమేం కాదు” అంటూ జగదీష్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
జగదీష్ రెడ్డి వ్యాఖ్యలతో సభలో తీవ్ర గందరగోళం నెలకొంది. కాంగ్రెస్ సభ్యులు ఆయన వ్యాఖ్యలను ఖండిస్తూ, “సభ గౌరవాన్ని దిగజార్చేలా మాట్లాడిన జగదీష్ రెడ్డిని సస్పెండ్ చేయాలి” అంటూ తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. దీంతో అసెంబ్లీ భద్రతా అధికారులను అప్రమత్తం చేస్తూ, మార్షల్స్‌ను భారీగా మోహరించారు. సభ్యుల మధ్య వాగ్వాదం తీవ్రరూపం దాల్చడంతో, సభలో క్రమశిక్షణను కాపాడేందుకు స్పీకర్ తక్షణ చర్యలు తీసుకోవాల్సిన అవసరం వచ్చింది.
ఎడ్యుకేషన్ సిస్టం బాగుంటేనే వ్యవస్థ బాగుంటుంది
తెలంగాణ శాసన మండలిలో విద్యా వ్యవస్థపై చర్చ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. విద్యార్థుల సంఖ్య తగ్గిపోతున్న నేపథ్యంలో ప్రభుత్వ పాఠశాలల పరిస్థితిపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఫీల్డ్ లో పరిస్థితిని పరిశీలించినప్పుడు బాధ కలుగుతోందని, ప్రస్తుత విద్యా విధానంలో మార్పు చేసి మెరుగుదల తీసుకురావాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ, “ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తగ్గిపోవడం తీవ్ర సమస్యగా మారింది. మా దగ్గర చిగురు మామిడి మండలం నవాబ్ పేట గ్రామంలో 50 మంది విద్యార్థులకు 10 మంది ఉపాధ్యాయులు ఉన్నారు. ఉపాధ్యాయుల సంఖ్య ఎక్కువగా ఉన్నా విద్యార్థుల సంఖ్య పెరగడం లేదు” అని పేర్కొన్నారు.
తెలంగాణ ఓపెన్ స్కూల్ పరీక్షల షెడ్యూల్ ఇలా..
తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ (TOSS) 2025 సంవత్సరానికి సంబంధించిన ఎస్ఎస్సీ (SSC) , ఇంటర్మీడియట్ (Intermediate) పరీక్షల టైమ్ టేబుల్ విడుదల చేసింది. ఈ పరీక్షలు ఏప్రిల్-మే నెలల్లో నిర్వహించనుండగా, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన మార్గదర్శకాలకు అనుగుణంగా అవి జరుగనున్నాయి.
థియరీ పరీక్షలు ఏప్రిల్ 20 నుండి ఏప్రిల్ 26, 2025 వరకు జరుగుతాయి. పరీక్షలు రెండు సెషన్లుగా నిర్వహించబడతాయి – ఒకటి ఉదయం, మరొకటి మధ్యాహ్నం. ఉదయం సెషన్ ఉదయం 9:00 గంటల నుంచి మధ్యాహ్నం 12:00 గంటల వరకు ఉంటే, మధ్యాహ్న సెషన్ మధ్యాహ్నం 2:30 గంటల నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు కొనసాగుతుంది. పరీక్షల తర్వాత ప్రాక్టికల్ పరీక్షలు ఏప్రిల్ 26 నుండి మే 3, 2025 వరకు నిర్వహించనున్నారు. పరీక్షా కేంద్రాలు, హాల్ టికెట్లు, ఇతర వివరాల కోసం విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలి.