ఇటీవల కాలంలో తిరుమలకు భక్తుల రాక విపరీతంగా పెరిగింది. కరోనా కారణంగా రెండేళ్ల పాటు కలియుగ వేంకటేశ్వరుడిని దర్శించుకోని భక్తులు ప్రస్తుతం తిరుమల బాట పడుతున్నారు. తమకు ఇష్టమైన దైవాన్ని దర్శించుకోవాలని ఉవ్విళ్లూరుతున్నారు. దీంతో వీకెండ్లలోనే కాకుండా వీక్ డేస్‌లోనూ తిరుమల కొండ రద్దీగా కనిపిస్తోంది. అటు సెప్టెంబర్ నెలలో భక్తులు, ఆదాయ వివరాలను టీటీడీ వెల్లడించింది. గత నెలలో మొత్తం 21.12 లక్షల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారని తెలిపింది. శ్రీవారి హుండీకి రూ.122.19 కోట్ల ఆదాయం వచ్చిందని, మొత్తం 98.44 లక్షల లడ్డూలను విక్రయించామని పేర్కొంది. సెప్టెంబర్ నెలలో 44.7 లక్షల మంది అన్నప్రసాదాలు స్వీకరించారని టీటీడీ వివరించింది.
Read Also: ఉదయం డ్రైఫ్రూట్స్ తింటే ఆరోగ్యానికి ఎంత మంచిదో తెలుసా..?
అటు తిరుమలలో వీఐపీ బ్రేక్ దర్శన సమయం ఉదయం 10 గంటలకు మారుస్తామని టీటీడీ ఈవో ధర్మారెడ్డి చెప్పారు. త్వరలో దీనిని ప్రయోగాత్మకంగా అమలు చేస్తామని డయల్ యువర్ ఈవో కార్యక్రమంలో ప్రకటించారు. అదేవిధంగా కొండపైకి వచ్చే భక్తులకు వసతి గదులు తిరుపతిలోనే కేటాయిస్తామని అన్నారు. డిసెంబర్‌లో ఒంగోలు, జనవరిలో ఢిల్లీలో స్వామివారి వైభవోత్సవాలు నిర్వహిస్తామని తెలిపారు. కాగా దసరా సెలవుల ముగింపుతో పాటు వీకెండ్ కావడంతో ప్రస్తుతం తిరుమలకు భక్తులు పోటెత్తారు. దీంతో శ్రీవారి సర్వదర్శనానికి 48 గంటల సమయం పడుతోంది. క్యూలైన్లలో వేచి ఉన్న భక్తులతో తిరుపతి ఎమ్మెల్యే కరుణాకర్‌రెడ్డి మాట్లాడి.. వారికి శ్రీవారి అన్నప్రసాదాలు పంపిణీ చేశారు. భక్తులకు టీటీడీ అందిస్తున్న సేవల గురించి ఎమ్మెల్యేకు ఈవో ధర్మారెడ్డి వివరించారు. మరో మూడు రోజుల పాటు తిరుమలలో రద్దీ ఇలాగే ఉండే అవకాశం ఉందని ఈవో తెలిపారు.